క్వాంటమ్ టెక్నాలజీలో పెరుగుతున్న అవకాశాలు
బ్యాక్ ఎండ్‌లో కీలకంగా నిలుస్తున్న విభాగం
2030 నాటికి రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు
గత కొంతకాలంగా క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీ గురించి విస్తృత చర్చ జరుగుతోంది. నేటి టెక్నాలజీ ఏఐ అయితే.. క్వాంటమ్ టెక్నాలజీని భవిష్యత్ టెక్నాలజీగా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల మద్దతుతో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీపై పరిశోధనలు ఊపందుకుంటున్నాయి. ఈ రంగంలో లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏమిటీ, ప్రయోజనాలు, కెరీర్ అవకాశాలు, అకడమిక్ అర్హతలు, నైపుణ్యాలు తదితర వివరాలు..
క్వాంటమ్ టెక్నాలజీ అంటే
💠 ఫిజిక్స్‌లోని క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలను ఉపయో గించి.. ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాలు, వ్యవస్థలను అభివృద్ధి చేసే విస్తృతమైన రంగాన్ని క్వాంటమ్ టెక్నాలజీ అంటారు. ఈ క్వాంటమ్ టెక్నాలజీలోనే ఒక భాగం క్వాంటమ్ కంప్యూటింగ్.
💠 సంప్రదాయ కంప్యూటర్లు బిట్స్ (0, లేదా 1)ను ఉపయో గిస్తాయి. కాని క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్ (0,1ల కలయిక స్థితి) ఆధారంగా పనిచేస్తాయి.
💠 కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సెన్సింగ్ రంగాల్లో అనుస రిస్తున్న సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా.. అణువులు, పరమాణువులు, ఎలక్ట్రాన్లు, ఫోటాన్లు వంటి సూక్ష్మ కణాల క్వాంటమ్ లక్షణాలను వినియోగించే సాంకేతికతే క్వాంట మ్ టెక్నాలజీ. ఔషధాల అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీ, ఆర్థిక రంగం, అంతరిక్ష పరిశోధనలు, రక్షణ రంగాల్లో భవిష్యత్‌లో ఇది ఎంతో కీలక పాత్ర పోషించే అవకాశముంది.
నాలుగు ముఖ్య విభాగాలు
క్వాంటమ్ టెక్నాలజీని నాలుగు ముఖ్య విభాగాలుగా విభ జించొచ్చు. అవి..
💠 క్వాంటమ్ కంప్యూటింగ్: క్లిష్టమైన గణన సమస్యలు, రసా యన అణువుల నమూనాలు, ఆప్టిమైజేషన్ సమస్యల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుంది.
💠 క్వాంటమ్ కమ్యూనికేషన్ : అత్యంత సురక్షితమైన సమా చార ప్రసార వ్యవస్థల అభివృద్ధికి తోడ్పడుతుంది.
💠 క్వాంటమ్ సెన్సింగ్: అత్యంత సూక్ష్మమైన మార్పులను గుర్తించే సెన్సార్ల అభివృద్ధికి ఉపయోగపడుతుంది.
💠 క్వాంటమ్ మెట్రాలజీ: సమయం, దూరం, గురుత్వాకర్షణ, అయస్కాంత క్షేత్రం వంటి పరిమాణాలను పూర్తి కచ్చితత్వంతో కొలవడానికి దోహదపడుతుంది.
ఎందుకింత ప్రాధాన్యం?
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో డేటా పరిమాణం విపరీతంగా పెరుగుతోంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డ్రగ్ డిస్కవరీ, వాతావరణ నమూనాలు, ఫైనాన్షియల్ రిస్క్ విశ్లేషణ వంటి రంగాల్లో మరింత క్లిష్టమైన గణనల అవసరం ఏర్పడుతోంది. ఇలాంటి సందర్భాల్లో క్వాంటమ్ టెక్నాలజీ కొత్త అవకాశాలను అందిస్తుంది. ఔషధ పరిశోధనల్లో అణువుల ప్రవర్తనను అనుకరించడం, కొత్త బ్యాటరీ పదార్థాలను గుర్తించడం, రసాయన ప్రక్రియలను విశ్లేషించడం వంటి పనుల్లో దీర్ఘకాలికంగా ప్రయోజనాలు కలిగిస్తోంది.
నేషనల్ క్వాంటమ్ మిషన్
💠 క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా 2023లో ‘నేషనల్ క్వాంటమ్ మిషన్’కు రూపకల్పన చేసింది. క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సెన్సింగ్, మెటీరి యల్స్ రంగాల్లో స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫలితంగా ఈ విభాగంలో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
💠 క్వాంటమ్ టెక్నాలజీలో అండర్‌గ్రాడ్యుయేట్ మైనర్, ఎంటెక్ ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా 23 క్వాంటమ్ టీచింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 17 క్వాంటమ్ టెక్నాలజీ స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించే స్థాయికి మిష¯Œ విస్తరించింది. క్యూనివర్స్ పేరుతో విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లకు క్వాంటమ్ కంప్యూటింగ్ వనరులను సైతం అందుబాటులో ఉంచారు.
ఈ రంగాల్లో ప్రాధాన్యం
హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, ఆటోమొబైల్, క్లైమేట్ రీసెర్చ్‌లో క్వాంటమ్ టెక్నాలజీ ప్రాధాన్యం పెరుగుతోంది. క్వాంటమ్ సైన్స్‌తోపాటు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, పరిశోధన, డేటా సైన్స్ వంటి విభాగాల్లోనూ ఉద్యోగ అవకాశాలుంటాయి.
ముఖ్య హోదాలు.. విధులు
💠 క్వాంటమ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్: క్వాంటమ్ అల్గారిథమ్‌లు, సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలి.
💠 క్వాంటమ్ అల్గారిథమ్ ఇంజనీర్: క్లిష్టమైన గణన సమస్యలకు క్వాంటమ్ పరిష్కారాలు రూపొందించాలి.
💠 క్వాంటమ్ హార్డ్‌వేర్ ఇంజనీర్: క్యూబిట్స్, ప్రాసెసర్లు, హార్డ్‌వేర్ వ్యవస్థల రూపకల్పన చేయాలి.
💠 క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్: క్వాంటమ్ ఫిజిక్స్‌లో పరిశోధనలు చేయాల్సి ఉంటుంది.
💠 క్వాంటమ్ అప్లికేషన్ సైంటిస్ట్: ఆయా రంగాల్లో క్వాంటమ్ వినియోగానికి అనువైన టూల్స్ రూపొందిచాలి.
💠 క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ఇంజనీర్: సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
💠 క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ స్పెషలిస్ట్: క్వాంటమ్ ఆధారిత, పోస్ట్ క్వాంటమ్ భద్రతా పరిష్కారాలు రూపొందిచాలి.
💠 క్వాంటమ్ సెన్సార్ ఇంజనీర్: అత్యంత ఖచ్చితమైన సెన్సార్ల అభివృద్ధి, పరీక్షలు చేయాలి.
💠 క్వాంటమ్ కంట్రోల్ ఇంజనీర్: క్యూబిట్స్ నియంత్రణకు అవసరమైన ఎలక్ట్రానిక్స్, సిగ్నల్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి.
💠 క్వాంటమ్ టెక్నాలజీ కన్సల్టెంట్: పరిశ్రమలకు క్వాంటమ్ టెక్నాలజీ అనువర్తనాలపై సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది.
అకడమిక్ అర్హతలు
క్వాంటమ్ టెక్నాలజీలో కెరీర్ ప్రారంభించాలనుకునే విద్యార్థు లు ఇంటర్మీడియెట్ స్థాయిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌పై గట్టి పట్టు సాధించాలి. ఆ తర్వాత తమ ఆసక్తికి అనుగుణంగా డిగ్రీ, పీజీ కోర్సులను ఎంచుకోవచ్చు. బీటెక్‌లో సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈ ఈ, ఇంజనీరింగ్ ఫిజిక్స్ బ్రాంచ్‌లు;పీజీలో ఫిజిక్స్,అప్లైడ్ ఫిజిక్స్,క్వాంటమ్ సైన్స్,మ్యాథమెటిక్స్ స్పెషలైజేషన్లు; పీహెచ్డీ స్థాయిలో క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ మెటీరియల్స్‌లో పరిశోధనలు కొనసాగించాలి. క్వాంటమ్ విభాగంలో సాఫ్ట్‌వేర్, ఇంజనీరింగ్, అప్లికేషన్ డెవలప్ మెంట్ వంటి ఉద్యోగాలకు సంబంధిత బ్యాచిలర్, మాస్టర్స్ డి గ్రీతో పాటు ప్రాజెక్టులు, ప్రత్యేక నైపుణ్యాలు ఉపయోగపడతాయి.
అవసరమైన స్కిల్స్
అకడమిక్ అర్హతలతోపాటు పలు ప్రత్యేకమైన స్కిల్స్ క్వాంటమ్ టెక్నాలజీలో కీలకంగా మారుతున్నాయి. లీనియర్ అల్జీబ్రా, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, పైథాన్ పోగ్రామింగ్, సీ++, క్వాంటమ్ అల్గారిథమ్స్, సర్క్యూట్ డిజైన్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్, క్రిప్టోగ్రఫి, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ టెక్నాలజీ, రీసెర్చ్ మెథడాలజీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఆవశ్యకంగా మారుతున్నాయి.
ఆన్‌లైన్ మార్గాలివే
క్వాంటమ్ టెక్నాలజీలో నైపుణ్యాలు పొందేందుకు ప్రస్తుతం పలు ఆన్‌లైన్ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా క్వాంటమ్ టెక్నాలజీలో ప్రాథమిక పరిజ్ఞానం నుంచి ప్రాక్టికల్ నైపుణ్యాల వరకు.. అనేక విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. ఐబీఎం క్వాంటమ్, మైక్రోసాఫ్ట్ లెర్న్, అమెజాన్ బ్రాకెట్, డి–వేవ్, ఎడెక్స్, కోర్సెరా వంటి సంస్థల ఆధ్వర్యంలో క్వాంటమ్ అల్గారిథమ్స్, మెకానిక్స్, కంప్యూటింగ్, ఆప్టిమైజేషన్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
లక్షల ఉద్యోగాలు!
క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి కెరీర్ అవకాశాలు ఆశా జనకంగా ఉన్నాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మన దేశంలో 2030 నాటికి క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐ విభా గాల్లో కలిపి పది లక్షల ఉద్యోగాల సృష్టి జరగనుంది. నాస్ కామ్ అంచనా ప్రకారం–క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ విభాగాల్లో 2 లక్షల నుంచి 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. అంతర్జాతీయంగా.. గత ఏడాది ఈ విభాగంలో కొత్తగా పది వేలకు పైగా ఉద్యోగాలు లభించాయి. దాదాపు 556 సంస్థలు క్వాంటమ్ టెక్నాలజీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అదే విధంగా గత ఏడాది అంతర్జాతీయంగా క్వాంటమ్ రంగం మార్కెట్ విలువ సుమారు 1.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 2024తో పోలిస్తే 14 శాతం పెరిగింది. ఎంఐటీ స్లోఆన్ నివేదిక ప్రకారం–2011 నుంచి 2024 మధ్య క్వాంటమ్ నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగా వకాశాలు మూడు రెట్లు పెరిగాయి.
వేతనాలు ఇలా
క్వాంటమ్ టెక్నాలజీ ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే రంగం. దీంతో వేతనాలు కూడా ఆకర్షణీయంగానే ఉంటున్నా యి. క్వాంటమ్ అల్గారిథమ్ ఇంజనీర్లు, హార్డ్‌వేర్ డిజైనర్లు, క్వాంటమ్ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు రూ.8 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తోంది.


