మొత్తం రూ.2,500 కోట్ల వ్యాపారం
గతేడాదితో పోలిస్తే 1.8 రెట్ల వృద్ధి
రెడ్‌సీర్ గణాంకాలు వెల్లడి
పండుగ వేళ ఆన్‌లైన్ షాపింగ్ జోరుగా సాగింది. నిత్యావసర సరుకుల నుంచి బంగారం, వెండి నాణేల వరకు ఇంటివద్దకే తెప్పించుకునేందుకు భారతీయ వినియోగదారులు ఆసక్తి చూపారు. దీంతో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు భారీ వ్యాపారం లభించింది. నవంబర్ 6 నుంచి 8 వరకు జరిగిన ధన్‌తేరస్, ఛోటీ దీపావళి, దీపావళి పండుగల సందర్భంగా ఈ ప్లాట్‌ఫామ్‌లకు మొత్తం 4.4 కోట్ల ఆర్డర్లు అందాయి. వీటి ద్వారా రూ.2,500 కోట్ల స్థూల సరుకుల విక్రయ విలువ (జీఎంవీ) నమోదైంది.
గతేడాది దీపావళి సీజన్‌తో పోలిస్తే ఈసారి వ్యాపారం దాదాపు 1.8 రెట్లు పెరిగినట్లు రెడ్‌సీర్ గణాంకాలు వెల్లడించాయి. బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, జియోమార్ట్ క్విక్, అమెజాన్ నౌ, బీబీ నౌ అనే ఏడు ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఈ గణాంకాలను సేకరించారు. ప్రతి పండుగ రోజున మొత్తం జీఎంవీలో 85–90 శాతం వాటాను నాలుగు అగ్రగామి సంస్థలే దక్కించుకుంటున్నాయి.
ధన్‌తేరాస్ రోజు సెకనుకు 175 ఆర్డర్లు
ఈ మూడు రోజుల్లో ధన్‌తేరస్ రోజున అత్యధిక వ్యాపారం జరిగింది. ఒక్కరోజే సుమారు 1.5 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. అంటే సెకనుకు దాదాపు 175 ఆర్డర్ల చొప్పున నమోదయ్యాయి. ఆ రోజు రూ.850–900 కోట్ల జీఎంవీ నమోదైంది. గతేడాది ధన్‌తేరస్ రోజున ఇది రూ.490 కోట్లుగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9,500 డార్క్ స్టోర్లలో ఒక్కో స్టోర్‌కు సగటున 1,600 ఆర్డర్లు అందాయి. గతేడాదితో పోలిస్తే ధన్‌తేరస్ రోజు వ్యాపారం 1.8 రెట్లు, ఛోటీ దీపావళి రోజు 1.7 రెట్లు, దీపావళి రోజు 1.9 రెట్లు పెరిగింది. దీపావళి రోజున కూడా దాదాపు 1.5 కోట్ల ఆర్డర్లు రావడం విశేషం. కాగా, 2026 సెప్టెంబర్‌లో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల రోజువారీ సగటు జీఎంవీ రూ.550 కోట్లుగా ఉంది. ఇది గతేడాది దీపావళి సీజన్‌లో ఏ ఒక్క పండుగ రోజున నమోదైన వ్యాపారం కంటే ఎక్కువ. అప్పట్లో ధన్‌తేరస్ రోజున కూడా జీఎంవీ రూ.500 కోట్ల లోపే ఉంది.
పండుగకు తగ్గట్టు కొనుగోళ్లు
పండుగ రోజులకు అనుగుణంగా కొనుగోళ్ల సరళి కూడా మారింది. ధన్‌తేరస్ రోజున స్టీల్ పాత్రల అమ్మకాలు సాధారణ రోజులతో పోలిస్తే 16 రెట్లు పెరిగాయి. ప్రెషర్ కుక్కర్లు, క్లీనింగ్ ఉత్పత్తుల విక్రయాలు ఆరు రెట్లు అధికమయ్యాయి. రూ.3,000 నుంచి రూ.14,000 ధరల మధ్య ఉన్న బంగారం, వెండి నాణేలు ధన్‌తేరస్ మొత్తం జీఎంవీలో 15–20 శాతం వాటాను దక్కించుకున్నాయి. దీపావళి రోజున పూల అమ్మకాలు సాధారణ స్థాయి కంటే ఎనిమిది రెట్లు పెరిగాయి. పురుషుల సంప్రదాయ దుస్తుల విక్రయాలు ఏకంగా 15 రెట్లు ఎగబాకాయి. స్వీట్లు, దీపాలు, అలంకరణ వస్తువులకూ భారీ డిమాండ్ నెలకొంది. పనీర్ అమ్మకాలు సాధారణ స్థాయి కంటే 1.5 రెట్లకు చేరాయి.
‘‘ఈ పండుగ సీజన్‌లో వినియోగదారులు ఒక్కసారిగా భారీగా ఖర్చు చేయలేదు. సాధారణంగా కొనుగోలు చేసే వస్తువులతో పాటు పండుగకు అవసరమైన సరుకులను చేర్చుస్తూ, మళ్లీ మళ్లీ ఆర్డర్లు ఇచ్చారు. భవిష్యత్తులో ఈ క్విక్ కామర్స్ రంగం మరింత విస్తరించాలంటే మెట్రో నగరాల్లో స్టోర్ల సంఖ్య ఎంత ముఖ్యమో, చిన్న నగరాల్లోనూ సేవలను విస్తరించడం కూడా అంతే కీలకం’’ అని రెడ్‌సీర్ అసోసియేట్ పార్ట్‌నర్ నిఖిల్ దలాల్ తెలిపారు.
ఇదీ చదవండి: బంగారం కొనుగోలుదారులకు పండగ దినం!


