బులియన్ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు పసిడి నిల్వలను పెంచుకునే పనిలో నిమగ్నమయ్యాయి. 2026 జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రపంచ కేంద్ర బ్యాంకులు, ఇతర అధికారిక సంస్థలు నికరంగా 675 టన్నుల బంగారాన్ని తమ ఖజానాకు జతచేశాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 6 శాతం అధికం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) 2026 నవంబర్ 3న విడుదల చేసిన ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్: క్యూ3 2026’ నివేదిక ఈ కీలక గణాంకాలను వెల్లడించింది.
మూడో త్రైమాసికంలో 42 శాతం జోరు
ఏడాది తొలి భాగంలో కాస్త నెమ్మదించిన కొనుగోళ్లు, రెండు, మూడో త్రైమాసికాల్లో అనూహ్యంగా పుంజుకున్నాయి. ముఖ్యంగా జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో కేంద్ర బ్యాంకులు ఏకంగా 321 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. 2025 క్యూ3తో పోలిస్తే ఇది 42 శాతం వృద్ధి కాగా, గత ఐదేళ్ల త్రైమాసిక సగటు (227 టన్నులు) కంటే చాలా ఎక్కువ. 2024 చివరి త్రైమాసికం తర్వాత ఇదే అత్యధిక స్థాయి. మొదటి త్రైమాసిక గరిష్ఠాల నుంచి ధరలు కొంత దిగిరావడం కలిసొచ్చినా చారిత్రక గరిష్ఠ స్థాయుల్లోనూ కొనుగోళ్లు జరగడం వెనుక విదేశీ మారక నిల్వల వైవిధ్యీకరణ, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత వ్యూహాలే ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది.
వెల్లడికాని వాటానే అధికం..
మూడో త్రైమాసికంలో జరిగిన 321 టన్నుల కొనుగోళ్లలో కేవలం 120 టన్నులు మాత్రమే అధికారికంగా వెల్లడయ్యాయి. మిగిలిన 63 శాతం కొనుగోళ్లు రహస్య (వెల్లడికాని) కార్యకలాపాల కిందకు వస్తాయని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. వెల్లడించిన వాటిలో చైనా (63 టన్నులు), పోలాండ్ (40 టన్నులు) 86 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచాయి.
ఈటీఎఫ్‌లకు ఆదరణ.. ఆభరణాలకు దెబ్బ
ఇన్వెస్టర్ల ఆసక్తితో క్యూ3లో బంగారం ఈటీఎఫ్‌లలోకి 211 టన్నుల పెట్టుబడులు రాగా మొత్తం నిల్వలు 4,256 టన్నుల రికార్డు స్థాయికి చేరాయి. అయితే అధిక ధరల కారణంగా వినియోగదారులు వెనక్కి తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల డిమాండ్ 17 శాతం తగ్గి 313 టన్నులకు, కడ్డీలు, నాణేల డిమాండ్ 19 శాతం క్షీణించి 268 టన్నులకు పరిమితమైంది.
ఆచితూచి అడుగువేస్తున్న ఆర్‌బీఐ
ప్రపంచ బ్యాంకులు దూకుడుగా కొంటున్నప్పటికీ భారత రిజర్వ్ బ్యాంక్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. సెప్టెంబర్ చివరి నాటికి ఆర్‌బీఐ వద్ద 880.5 టన్నుల పసిడి నిల్వలు ఉండగా తొలి తొమ్మిది నెలల్లో నికర కొనుగోళ్లు కేవలం 0.3 టన్నులకే పరిమితమయ్యాయి. మొత్తం విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా జనవరిలో 19 శాతంగా ఉండగా, సెప్టెంబర్ నాటికి 14.5 శాతానికి సర్దుబాటు అయింది.
ఇదీ చదవండి: త్వరలో ఉద్యోగాలే ఉద్యోగాలు!


