ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. క్షణాల్లో దేశంలోని ఏ మూలకైనా, విదేశాల్లోని వారికైనా వీడియో కాల్స్ చేసి మాట్లాడు తున్నాం.. 5జీ రాకతో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. కానీ, సుమారు 66 ఏళ్ల క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదు. పక్క నగరంలో ఉన్న బంధువులతోనో, వ్యాపార భాగస్వాములతోనో ఫోన్‌లో మాట్లాడాలంటే అది ఒక పెద్ద ప్రహసనంగా ఉండేది. అలాంటి క్లిష్ట పరిస్థితులకు చెక్ పెడుతూ, భారత టెలికాం చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరతీసిన ఆవిష్కరణే ‘ఎస్టీడీ’ అంటే సబ్‌స్క్రైబర్ ట్రంక్ డయలింగ్.
వ్యాపార రంగాల గమనాన్ని మార్చేసింది..
1960వ దశకానికి ముందు ఒక నగరం నుంచి మరో నగరానికి ఫోన్ చేయాలంటే, వినియోగదారులు నేరుగా నంబర్ డయల్ చేసే అవకాశం ఉండేది కాదు. ముందుగా టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌కు ఫోన్ చేసి, అక్కడి ఆపరేటర్ ద్వారా ‘ట్రంక్ కాల్’ బుక్ చేసుకోవాల్సి వచ్చేది. లైన్లు ఖాళీగా ఉండి, ఆపరేటర్ కనెక్ట్ చేసే వరకు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. అత్యవసర వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలన్నా, కుటుంబ సమాచారం తెలుసుకోవాలన్నా ఈ జాప్యం పెద్ద అడ్డంకిగా మారేది. వాస్తవానికి 1923లోనే అప్పటి అవిభక్త భారత్‌లో లాహోర్-లాయల్‌పూర్ మధ్య సుదూర ప్రాంతాలకు ఫోన్ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
అయితే, అందులోనూ ఆపరేటర్ ప్రమేయం తప్పనిసరిగా ఉండేది. వినియోగదారుడే స్వయంగా నంబర్ డయల్ చేసే స్వేచ్ఛ అప్పట్లో లేదు. భారత టెలికాం రంగంలో 1960 నవంబర్ 26 ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఆ రోజున ఉత్తరప్రదేశ్‌లోని రెండు ప్రధాన నగరాలైన కాన్పూర్, లక్నో మధ్య దేశంలోనే మొట్టమొదటి ఎస్టీడీ (STD) సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
విప్లవాత్మక మార్పులు..
ఈ సేవ అందుబాటులోకి రావడంతో టెలిఫోన్ వినియోగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వినియోగదారులు తమ ఫోన్ నుంచే నేరుగా అవతలి నగరం కోడ్, ఫోన్ నంబర్ డయల్ చేసి మాట్లాడే వెసులుబాటు కలిగింది. కాల్ బుక్ చేసి గంటల తరబడి ఎదురుచూడాల్సిన శ్రమ తప్పింది. తక్షణమే కనెక్షన్ లభించడం ప్రారంభమైంది. మధ్యలో ఆపరేటర్ ప్రమేయం లేకపోవడంతో సంభాషణలకు గోప్యత పెరిగింది.
కాన్పూర్-లక్నో మధ్య ప్రయోగాత్మకంగా మొదలైన ఈ సాంకేతికత అనతికాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరించింది. 1960ల నుంచి 1980ల మధ్య భారత టెలికాం విభాగం మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేసింది. దీని ఫలితంగా 1987 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు ఎస్టీడీ నెట్‌వర్క్ ద్వారా దేశ రాజధాని ఢిల్లీతో పూర్తిస్థాయిలో అనుసంధానమయ్యాయి. ఆ తర్వాత క్రమంగా జిల్లా కేంద్రాలు, పట్టణాలు, చివరకు మారుమూల గ్రామాలకు సైతం ఈ నెట్‌వర్క్ విస్తరించింది.
ఎస్టీడీ ప్రభావం ఎలా ఉంది అంటే..?
ఎస్టీడీ సేవలు కేవలం ప్రజల మధ్య మాటలను కలపడానికే పరిమితం కాలేదు; భారత ఆర్థిక వ్యవస్థ, వ్యాపార రంగాల వేగాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. అంతకుముందు ఇతర నగరాల్లోని సప్లయర్లు, డీలర్లతో మాట్లాడటానికి టెలిగ్రామ్‌లు లేదా ఉత్తరాలపై ఆధారపడాల్సి వచ్చేది. ఎస్టీడీ రాకతో వ్యాపారులు నేరుగా ఫోన్‌లో ధరలు, ఆర్డర్లు, సరఫరా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలిగింది.
ఇది వ్యాపార లావాదేవీల వేగాన్ని గణనీయంగా పెంచింది. ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా 1990లలో దేశవ్యాప్తంగా వీధివీధినా వెలిసిన పసుపు రంగు ‘ఎస్టీడీ, ఐఎస్‌డీ,పీసీఓ’ బూత్‌లు లక్షలాది మంది యువతకు స్వయం ఉపాధిని కల్పించాయి. సామాన్యుడికి సైతం సుదూర ప్రాంతాలతో మాట్లాడే అవకాశాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించాయి.
దేశవ్యాప్తంగా ఏర్పడిన ఈ ట్రంక్ డయలింగ్ నెట్‌వర్కే భవిష్యత్తులో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, ఐటీ రంగాల విస్తరణకు బలమైన పునాదిగా నిలిచింది. ప్రస్తుతం మనం వాడుతున్న అధునాతన 4జీ, 5జీ, ఫైబర్ నెట్‌వర్క్‌ల వెనుక 66 ఏళ్ల క్రితం కాన్పూర్-లక్నో మధ్య వేసిన ఆ తొలి ఎస్టీడీ అడుగు ఎంతో కీలకమైనది. ఆనాటి సాంకేతిక మార్పే నేడు భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం మార్కెట్లలో ఒకటిగా నిలబెట్టడానికి తొలి మెట్టుగా మారింది.
- పసుపులేటి వెంకటేశ్వరరావు.
ఇదీ చదవండి: చీరకట్టులో మహిళా పారిశ్రామికవేత్త సైకిల్ రైడ్..!


