తెలుగు లిపి ఎలా పరిణామం చెందిందంటే..! | Ancient Telugu Script Inscriptions | Sakshi
Sakshi News home page

తెలుగు లిపి ఎలా పరిణామం చెందిందంటే..!

Nov 24 2026 10:17 AM | Updated on Nov 24 2026 10:18 AM

Ancient Telugu Script Inscriptions

మంచిరేవులలో అతి అరుదైన తావు గుర్తింపు

అస్పష్టంగా కనిపిస్తున్న అక్షరాలు

డి్రస్టెచ్‌ సాఫ్ట్‌వేర్‌లో ఇలా... 

సాక్షి, హైదరాబాద్‌: బ్రాహ్మీ లిపి నుంచి తెలుగు లిపి ఉద్భవించిన తీరు... ప్రస్తుత తెలుగు భాష రూపును సంతరించుకునే పరిణామ క్రమం ఎలా మొదలైంది లాంటి అత్యంత కీలక అంశాలకు సంబంధించిన సజీవ సాక్ష్యం వెలుగు చూసింది. అత్యంత అరుదైన 2 వేల ఏళ్ల నాటి, 1300 ఏళ్ల నాటి రాతలు పక్కపక్కనే రాసి ఉన్న తావును పరిశోధకులు గుర్తించారు. నగర శివారు మంచిరేవుల అటవీ ట్రెక్కింగ్‌ పార్క్‌లోని ఓ గుట్ట పడిగరాయి మీద ఈ రాతలను గుర్తించారు.

సాధారణంగా ఆదిమానవులు ఎరుపు, తెలుపు, నలుపు రంగులతో నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు ప్రతిబింబించే చిత్రాలు గీయటం సహజం. కొన్ని చోట్ల మాత్రమే, ఆ చిత్రాలతోపాటు నాటి లిపిలో అక్షరాలు, పదాలు రాసిన దాఖలాలున్నాయి. మొదటిసారి రాష్ట్రంలో అలాంటి అతి అరుదైన రాతి రాతల తావు వెలుగుచూసిందని దీన్ని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షులు శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు.  

కీసర గుట్ట, ములుగులోనూ తెలుగు ప్రస్తావన
కీసరగుట్టలో భూమి ఉపరితలం మీదనే ఉన్న పెద్ద రాతి గుండు మీద ‘‘తొలుచువాన్డ్రు’’అని రాసిఉన్న ఐదో శతాబ్దంనాటి చెక్కడం తెలుగు తొలి శాసనంగా కొందరు చరిత్రపరిశోధకులు పేర్కొంటున్నారు. ఇది అచ్చతెలుగు రూపం. తొలుచు వారు అన్న రెండు పదాల సమాసం. కానీ, ఇక్కడి లిపి ప్రస్తుత తెలుగు రూపునకు భిన్నంగా ఉంటుంది. అది బ్రాహ్మీ లిపి నుంచి పరిణామం చెందుతున్న రూపం.

అక్కడి నిర్మాణాలకు సంబంధించి శిల్పులు ఉండే చోట ఓ నామ ఫలకంగా బండ రాయిమీద అక్షరాలను అప్పట్లో అలా చెక్కారు. ఇప్పుడు దీనికంటే దాదాపు ఐదొందల ఏళ్ల ముందు తెలుగు రాత ఎలా ఉండేది, దీనికి రెండొందల ఏళ్ల తర్వాత ఎలా ఉండేదో తెలిపే అత్యంత అరుదైన అక్షరాల సమూహం వెలుగుచూసింది. నగర శివారు మంచిరేవుల అటవీ ట్రెక్కింగ్‌ పార్క్‌లోని ఓ గుట్ట పడిగరాయి మీద ఈ రాతలు గుర్తించారు. ములుగు జిల్లా పాండవుల గుట్ట, వర్గల్‌ సమీపంలోని సీతమ్మలొద్ది ప్రాంతాల్లో ఇలాంటివి గుర్తించారు. కానీ, బొమ్మలు లేకుండా కేవలం అక్షరాలు మాత్రమే రాసిన దాఖలాలు వెలుగుచూడలేదు.

ఏంటీ ప్రత్యేకం... 
ఈ భారీ గుండు మీద అస్పష్టంగా కొన్ని అక్ష రాలు కనిపిస్తున్నాయి. కొన్ని పంక్తులను వాక్యాలుగా రాసినా, వాతావరణ ప్రభావంతో అవి బాగా వెలిసి పోయి కొన్ని అసంపూర్తి అక్షరాలు మాత్రమే అస్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిల్లో బ్రాహ్మీ లిపిలో కొన్ని అక్షరాలను గుర్తించారు. అవి ఒకటో శతాబ్దంలో రాసినవిగా తేలి్చనట్టు హరగోపాల్‌ పేర్కొన్నారు.

మరి కొన్ని అక్షరాలు ఏడో శతాబ్దంలో రాసినవిగా గుర్తించినట్టు పేర్కొన్నారు. అంటే దాదాపు ఏడొందల కాలంలో ఈ రాతి మీద రాతను సూపర్‌ ఇంపోజ్‌ అయ్యాయన్నమాట. బ్రాహ్మీ లిపి నుంచి తెలుగు ప్రస్తుత రూపులోకి అక్షరాలు ఎలా మారాయో గుర్తించే అత్యంత అరుదైన తావుగా దాన్ని భావిస్తున్నారు. ఒకటో శతాబ్దంలో ఎలా రాశారు. ఏడో శతాబ్దానికి వచ్చే సరికి ఎలా పరిణామం చెందింది అన్నది పోల్చుకునేందుకు వీలైన కాన్వాస్‌గా దాన్ని పేర్కొంటున్నారు.

హ్యాండ్‌ హెల్డ్‌ 3డీ డిజిటల్‌ కెమెరా స్కానర్‌తోనే సాధ్యం
ఇలాంటి వాటిని స్పష్టంగా గుర్తించేందుకు హ్యాండ్‌ హెల్డ్‌ 3డీ డిజిటల్‌ కెమెరా స్కానర్‌ అవసరం. కానీ, రాష్ట్రంలో ఇది అందుబాటులో లేదు. ఏఎస్‌ఐ వద్ద కొన్ని ఉండగా, బెంగళూరులో కొందరు ప్రైవేటు పరిశోధకుల వద్ద ఉంది. అత్యంత ఖరీదైన యంత్రం కావటంతో స్థానిక పరిశోధకులు దీన్ని సమకూర్చుకోలేదు. తెలుగు భాష పరిణామ క్రమంలో కీలక విషయాలు తెలుసుకునే వీలున్నందున, ఏఎస్‌ఐ నుంచో ప్రైవేటు పరిశోధకుల నుంచో తెచ్చె రాష్ట్ర ప్రభుత్వం ఈ యంత్రాన్ని సమకూరిస్తే బాగుంటుందని పరిశోధకులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: కర్రె గుట్టలు ఇంకా సురక్షితం కాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement