తల్లికి తలకొరివి పెట్టేందుకూ.. కడుపున పుట్టినోళ్లు రాకున్నా... | Heartbreaking Incident In Telangana, Villagers Perform Last Rites For 70 Year Old Woman Abandoned By Her Children | Sakshi
Sakshi News home page

తల్లికి తలకొరివి పెట్టేందుకూ.. కడుపున పుట్టినోళ్లు రాకున్నా...

Nov 24 2026 9:54 AM | Updated on Nov 24 2026 10:11 AM

Mother Last Rites Villagers Humanity Jangaon

కన్నబిడ్డల నిరాకరణ.. గ్రామస్తులే బంధువులైన వేళ3

వృద్ధురాలికి దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించిన తరిగొప్పుల వాసులు

అంత్యక్రియలు నిర్వహిస్తున్న గ్రామస్తులు. (ఇన్‌సెట్‌లో) పుష్పనీల

నర్మెట(తరిగొప్పుల): ఆ తల్లికి ఐదుగురు కూతుళ్లు.. ఒక కుమారుడు.. మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. అయినా చివరి రోజుల్లో ఆమెకు తోడుగా నిలిచేవారు కరువయ్యారు. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆ తల్లి కన్నుమూసిన తర్వాత కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కన్నబిడ్డలు ముందుకు రాని దయనీయ పరిస్థితి. దీంతో గ్రామస్తులే బంధువులై, మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచి ఆమెకు అంతిమ వీడ్కోలు పలికారు.

జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన పలువురిని కలచివేసింది. తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన నాగబండి పుష్పనీల (70) భర్త రాంచంద్రం గతంలోనే చనిపోయారు. ఆమెకు ఐదుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉండగా, వారిలో ఒక కూతురు మరణించింది. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు.

ఒకప్పుడు కుటుంబంతో సంతోషంగా జీవించిన పుష్పనీలకు వృద్ధాప్యంలో మాత్రం ఒంటరితనం మిగిలింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం చనిపోయింది. ఆమె మరణవార్తను కూతుళ్లకు, కుమారుడికి ఫోన్‌ ద్వారా తెలియజేసినా స్పందించలేదు. ఇద్దరు కూతుళ్లు, అల్లుళ్లు మాత్రమే చివరిచూపు కోసం వచ్చారు. కానీ, పుష్పనీల అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవడంతో గ్రామస్తులు చొరవ తీసుకున్నారు.

తలకొరివి పెట్టేందుకు కొడుకు రాకపోవడంతో.. కూతుళ్లు కూడా వెనుకంజ వేయడంతో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ బాధ్యత తీసుకున్నారు. గ్రామస్తులంతా ఒక్కటై హిందూ సంప్రదాయం ప్రకారం ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు.

ఇదీ చదవండి: ఫెర్టిలిటీ కేంద్రాల వైద్యులకు బెయిల్‌ ఇవ్వలేం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement