కర్రె గుట్టలు ఇంకా సురక్షితం కాదు | Karre Gutta Maoist Threat Tourists Banned | Sakshi
Sakshi News home page

కర్రె గుట్టలు ఇంకా సురక్షితం కాదు

Nov 24 2026 10:03 AM | Updated on Nov 24 2026 10:03 AM

Karre Gutta Maoist Threat Tourists Banned

పునరావాస చెక్కులు అందుకున్న వారితో డీజీపీ ఆనంద్, అకున్‌ సబర్వాల్, విజయ్‌కుమార్, సింధుశర్మ

మావోయిస్టులు పెట్టిన ల్యాండ్‌మైన్‌ల వెలికితీత కొనసాగుతోంది

ఇప్పటి వరకు స్వా«దీనం చేసుకున్న 500 తుపాకుల వివరాలు తెలియాల్సి ఉంది

లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసం చెక్కుల పంపిణీలో డీజీపీ సీవీ ఆనంద్‌

సాక్షి, హైదరాబాద్‌: గతంలో మావోయిస్టులకు స్థావరంగా కొనసాగిన కర్రె గుట్టల ప్రాంతం ఇప్పటికీ సురక్షితం కాదని డీజీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఆ ప్రాంతంలో మావోయిస్టులు గతంలో పాతిపెట్టిన భారీగా పేలుడు పదార్థాలు, ల్యాండ్‌మైన్‌లను సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్‌ డీఆర్‌జీ బలగాల సమన్వయంతో జాగ్రత్తగా వెలికితీసి నిర‍్వీర్యం చేసే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం పర్యాటకులకు ఆ ప్రాంతంలో అనుమతి ఇవ్వడం లేదని, ల్యాండ్‌మైన్‌ల తొలగింపు పూర్తయిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

కర్రె గుట్టల్లో ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది ఆయుధాల డంపులు గుర్తించినట్టు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లినా తమకు అభ్యంతరం లేదన్నారు. మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా మార్చాలని కోరుతూ ఎలాంటి ప్రతిపాదనలు తమ దృష్టికి రాలేదని వెల్లడించారు. జనజీవన స్రవంతిలో కలిసిన 214 మంది మావోయిస్టులకు పునరావాసం కింద రూ.5.59 కోట్ల రివార్డుల చెక్కులను డీజీపీ సీవీ ఆనంద్‌ అందజేశారు.

ఈ సందర్భంగా సోమవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్‌ డీజీ (లా అండ్‌ ఆర్డర్‌) అకున్‌ సబర్వాల్, అడిషనల్‌ డీజీ (ఇంటెలిజెన్స్‌) విజయ్‌కుమార్, ఎస్‌ఐబీ ఎస్పీ సింధుశర్మతో కలిసి మీడియాతో మాట్లాడారు. 2024 జనవరి నుంచి తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 824 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలిపారు. వీరిలో తెలంగాణకు చెందినవారు 59 మంది, ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు 754 మంది, ఏపీకి చెందినవారు తొమ్మిది మంది, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నట్టు వివరించారు.

ఇప్పటివరకు లొంగిపోయిన వారికి రూ.17.68 కోట్ల మేర నగదు రివార్డులు, పునరావాస సాయం పంపిణీ చేసినట్టు తెలిపారు. మరో 96 మందికి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అందిన తర్వాత చెల్లించనున్నట్టు తెలిపారు. నిమ్స్‌లో ఉచిత వైద్య చికిత్స పొందేందుకు ఆరోగ్యరక్ష కార్డులు పంపిణీ చేశామన్నారు. జనజీవన స్రవంతిలో కలిసి తెలంగాణకు చెందిన 59 మందిలో పది మందికి ఇళ్ల మంజూరు పూర్తయిందని, మరో 49 మందికి ఇళ్ల సదుపాయం కల్పించనున్నట్టు వివరించారు.

మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో 250 ఆయుధాలు మాత్రమే రాష్ట్ర పోలీసులకు సంబంధించినవిగా గుర్తించామని, మరో 500 ఆయుధాల వివరాలను ఇతర రాష్ట్రాలతో కలిసి గుర్తించాల్సి ఉందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై గతంలో నమోదైన కేసుల ఎత్తివేత విషయంలో జాతీయ స్థాయిలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు.

అయితే ఎన్‌ఐఏ నమోదు చేసిన, ఇప్పటికే ట్రయల్‌ కొనసాగుతున్న కేసుల విషయంలో తాము ఏమీ చేయలేమని డీజీపీ స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధం ఎత్తివేతకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ప్రత్యేకించి ట్రాఫిక్‌ విధుల కోసమే త్వరలో 2వేల మంది హోంగార్డులను భర్తీ చేయనున్నట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా డీజీపీ తెలిపారు.

లొంగిపోండి అండగా ఉంటాం..: గణపతి సహా ముగ్గురు కీలక నేతలకూ డీజీపీ పిలుపు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి సహా జోడే రత్నభాయ్, వార్త శేఖర్‌ ఆచూకీపై స్పష్టమైన సమాచారం లేదని డీజీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు సైతం వారి జాడ లభించలేదని తెలిపారు. ఈ ముగ్గురూ అసలు బతికే ఉన్నారా.. లేక చనిపోయారా..? అనేది తెలియని పరిస్థితి ఉందన్నారు. వీరు కూడా అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని డీజీపీ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: తల్లికి తలకొరివి పెట్టేందుకూ.. కడుపున పుట్టినోళ్లు రాకున్నా...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement