పుణే: మహారాష్ట్ర, పుణే జిల్లాలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో షాకింగ్ ఘటన జరిగింది. విద్యుత్ అంతరాయంతో లిఫ్ట్ ఆగిపోవడంతో.. 19 ఏళ్ల విద్యార్థిని 12 గంటలపాటు లిఫ్టులో చిక్కుకుపోయింది. లోనీ కల్భోర్‌లోని ఎంఐటీ కళాశాలలో బుధవారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సాయంత్రం క్లాసులు అయిపోయాక ఐదో అంతస్తులో ఉన్న విద్యార్థిని అందరికన్నా చివరగా లిఫ్టు ఎక్కింది. కిందికి వస్తుండగా పదేపదే విద్యుత్ అంతరాయం ఏర్పడి లిఫ్ట్ ఆగిపోయింది. అప్పటికే సిబ్బంది, విద్యార్థులు భవనం నుంచి వెళ్లిపోయారు. లిఫ్ట్‌లోని ఎమర్జెన్సీ అలారం, ఇంటర్‌కామ్, బ్యాకప్ పవర్ సిస్టమ్ కూడా పనిచేయలేదు. ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో ఆమె ఎవరికీ సమాచారం అందించలేకపోయింది. ఎంత రాత్రైనా విద్యార్థిని ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆమె తల్లిదండ్రులు, అదే కళాశాలలో చదువుతున్న ఆమె సోదరి వెతికారు.
చివరకు రాత్రి 9 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం తెల్లవారుజామునుంచే కళాశాల ప్రాంగణం, సమీప భవనాలు, ప్రాంతాల్లో గాలించారు. చివరకు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఐదో అంతస్తులో లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన విద్యార్థినిన గుర్తించి, రక్షించారు. దాదాపు 12 గంటల పాటు ఆమె అందులోనే ఉండిపోయింది. అయితే విద్యార్థిని క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఆమె తల్లిదండ్రులు తమ ఫిర్యాదును ఉపసంహరించుకున్నారని కల్భోర్ సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ సమాధాన్ పవార్ తెలిపారు. అయితే, ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకుంటున్న చర్యలు , లిఫ్ట్ పనితీరులో అవసరమైన మెరుగుదలల వివరాలను కోరుతూ పోలీసులు కళాశాలకు లేఖ రాశారని పోలీసు అధికారి తెలిపారు.


