‘బాహుబలి’లా అధికారం చెలాయించొద్దు: సుప్రీంకోర్టు | supreme court on bihar judge | Sakshi
Sakshi News home page

‘బాహుబలి’లా అధికారం చెలాయించొద్దు: సుప్రీంకోర్టు

Nov 23 2026 6:01 PM | Updated on Nov 23 2026 7:43 PM

supreme court on bihar judge

న్యూఢిల్లీ: న్యాయాధికారాన్ని వినియోగించే సమయంలో ‘బాహుబలి’లా అధికారం చెలాయించొద్దంటూ బిహార్‌కు చెందిన ఓ న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశించినప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదనే కారణంతో ఓ పోలీసు అధికారిని దోషిగా నిర్ధారించి జరిమానా విధించడంపై అభ్యంతరం తెలిపింది. చట్టంలోని నిబంధనలు, న్యాయస్థానాల అధికార పరిధిపై సరైన అవగాహన పెంచుకోవాలని సూచించింది. అవసరమైతే ఆయనకు జాతీయ న్యాయ అకాడమీలో శిక్షణ ఇప్పించాలని పేర్కొంది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. పట్నా హైకోర్టు తన ఉత్తర్వులపై విధించిన స్టేను సవాలు చేస్తూ బిహార్ న్యాయమూర్తి అనిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.

రోహ్‌తాస్ జిల్లా ససారంలోని జిల్లా, అదనపు సెషన్స్ జడ్జి-4గా పనిచేస్తున్న అనిల్ కుమార్.. అప్పట్లో రోహ్‌తాస్ ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి రౌషన్ కుమార్‌ను కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పాటించలేదనే కారణంతో దోషిగా నిర్ధారించారు. 2026 సెప్టెంబర్ 29న ఆయనకు ప్రతీకాత్మకంగా రూ.1 జరిమానా విధించారు. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో తన పరిశీలనలను అధికారి సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని బిహార్ డీజీపీని ఆదేశించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖను కూడా కోరారు. 

కేసు ఏంటి? 
బిహార్‌లో 2023లో పరిష్కారమైన ఓ క్రిమినల్ కేసులో తప్పుడు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సెషన్స్ కోర్టు ఆదేశించింది. అయితే పోలీసుల నుంచి స్పందన ఆలస్యం కావడంతో న్యాయమూర్తి ఈ చర్యలు తీసుకున్నారు. అనంతరం ఎస్పీపై తీసుకున్న చర్యలను పట్నా హైకోర్టు నిలిపివేసింది.

ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. కోర్టు ప్రాంగణంలోనే జరిగే నేరాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను ముందుగా అర్థం చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. ఎవరైనా కోర్టులో దాడి చేయడం, న్యాయస్థానాన్ని దూషించడం లేదా బయటకు వెళ్లాలని ఆదేశించినా వెళ్లకుండా ఉండటం వంటి చర్యలు కోర్టు సమక్షంలో జరిగిన నేరాల పరిధిలోకి వస్తాయని వివరించింది. అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న ఆదేశాన్ని పాటించకపోవడం మాత్రమే అలాంటి నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

‘‘చట్టంపై మీకున్న అవగాహన మమ్మల్ని ఆశ్చర్యపరుస్తోంది. న్యాయాధికారాన్ని వినియోగించేటప్పుడు మీ క్లయింట్ బాహుబలిలా వ్యవహరించడం మానుకోవాలని చెప్పండి’’ అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఎస్పీని పిలిపించి అదే రోజు దోషిగా నిర్ధారించడం ఏమాత్రం సమర్థనీయం కాదని జస్టిస్ బాగ్చీ అన్నారు. ‘‘మీ అధికార పరిధి ఏమిటో తెలుసుకోండి. ఇక చాలు.. ఇలాంటి సాహసాలు ఆపండి’’ అని సూచించారు.

న్యాయమూర్తి తన అధికార పరిధిని గుర్తించి వ్యవహరించాలని, జాతీయ న్యాయ అకాడమీలో మరింత శిక్షణ పొందాలని ధర్మాసనం సూచించింది. న్యాయం చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ చట్టం నిర్దేశించిన విధానాలను పక్కనపెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో న్యాయమూర్తి వివరణ, క్షమాపణలను పట్నా హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు విచారణను ముగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement