న్యూఢిల్లీ: ఆసియాలో భారత్ తన పలుకుబడిని మరింత పెంచుకున్నది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలుగా గుర్తింపు పొందిన అమెరికా, చైనా తర్వాత ఆసియాలో మూడో స్థానాన్ని భారత్ దక్కించుకుంది. అంతేకాదు.. ఆసియాలో అత్యంత సమర్థవంతమైన ప్రాంతీయ నాయకుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ రెండో స్థానాన్ని చేజిక్కించుకున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మొదటి స్థానంలో నిలిచారు. లోవీ ఇన్‌స్టిట్యూట్ సోమవారం విడుదల చేసిన 2026 ఆసియా పవర్ ఇండెక్స్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
భారత్‌కు మొత్తం 40.5 పాయింట్లు లభించాయి. 2018లో ఈ సూచీ ప్రారంభమైనప్పటి నుంచి భారత్, చైనా మధ్య సామర్థ్య వ్యత్యాసం కనిష్ఠ స్థాయికి చేరింది. అమెరికా, చైనా మధ్య వ్యత్యాసం కూడా 5.3 పాయింట్లకు తగ్గింది. ఇది 2018 తర్వాత అత్యల్పం. ముఖ్యంగా చైనా పురోగతి కంటే అమెరికా విధానపరమైన తప్పిదాలే ఈ అంతరాన్ని తగ్గించాయని నివేదిక పేర్కొంది. భారత్ ఆర్థిక సామర్థ్యం స్కోరు స్వల్పంగా తగ్గి 26.4 పాయింట్లకు చేరింది. రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆర్థిక వ్యవస్థల కొలమానాల్లో మార్పులు దీనికి కారణమయ్యాయి. విదేశాల్లో భారత్ పెట్టుబడులు దాదాపు 20 బిలియన్ డాలర్లు తగ్గాయి. అయితే భవిష్యత్తు వనరుల విభాగంలో మాత్రం భారత్ 56.2 పాయింట్లు సాధించింది. మెరుగైన ఆర్థిక అంచనాలు దేశ దీర్ఘకాలిక సామర్థ్యాన్ని చాటాయని నివేదిక తెలిపింది.
దౌత్యపరమైన ప్రభావంలో భారత్ 70.3 పాయింట్లు సాధించింది. అయితే గల్ఫ్ ప్రాంతంలో జరిగిన సంఘర్షణ సమయంలో భారత్ అంతర్జాతీయంగా పెద్దగా స్పందించకపోవడం, అమెరికా జలాంతర్గామి ఇరాన్ నౌకను ముంచిన ఘటనపై మౌనం వహించడం వల్ల మోదీ ప్రపంచ నాయకత్వంపై అంచనాలు తగ్గాయని నివేదిక పేర్కొంది. మరోవైపు ప్రాంతీయ రక్షణ సంబంధాలు మెరుగుపడ్డాయి. ఆగ్నేయాసియా దేశాలకు బ్రహ్మోస్ క్షిపణుల విక్రయాలు, రక్షణ రంగంలో సహకారం పెరగడంతో భారత్ డిఫెన్స్ నెట్‌వర్క్స్ విభాగంలో 18.6 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానానికి చేరింది. ఆర్థిక సంబంధాల్లో ఏడో స్థానానికి, సాంస్కృతిక ప్రభావంలో 43.8 పాయింట్లకు చేరుకుంది. ఈ పరిణామాలు ఆసియాలో భారత్ ప్రభావం మరింత బలపడుతోందని సూచిస్తున్నాయని నివేదిక తెలిపింది.


