ట్రంప్‌కు కిమ్‌ దిమ్మతిరిగే షాక్‌! | Trump tried to contact Kim Jong Un but calls went unanswered | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు కిమ్‌ దిమ్మతిరిగే షాక్‌!

Nov 23 2026 7:02 AM | Updated on Nov 23 2026 7:06 AM

Trump tried to contact Kim Jong Un but calls went unanswered

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో చర్చలు జరిపేందుకు చేస్తున్న ప్రయత్నాలకు స్పందన కరువైంది. ట్రంప్‌ స్వయంగా ఫోన్‌ చేసినా అటువైపు నుంచి సమాధానం రాలేదు. చివరకు ఆయన పంపిన లేఖ సైతం తెరవకుండానే వెనక్కి వచ్చిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ (డబ్ల్యూఎస్‌జే) తన కథనంలో వెల్లడించింది. గత ఏడాది వాషింగ్టన్‌, ప్యాంగ్యాంగ్‌ మధ్య ఉన్న అధికారిక సమాచార మార్గాలతో పాటు ఇతర మార్గాల్లోనూ ట్రంప్‌ సంప్రదించేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది. అయినప్పటికీ ఉత్తర కొరియా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ట్రంప్‌ కిమ్‌కు లేఖ రాయగా, దాన్ని ఉత్తర కొరియా ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్తకు అందించారు. అయితే ఆ లేఖను తెరవకుండానే తిరిగి పంపినట్లు సమాచారం.

ఇటీవల ఆసియా పర్యటన సందర్భంగా కూడా కిమ్‌తో సమావేశం కావాలని ట్రంప్‌ ప్రయత్నించారు. ఆ పర్యటనలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఆయన భేటీ అయ్యారు. అయితే ట్రంప్‌తో సమావేశం కావాలంటే ఉత్తర కొరియా కొన్ని షరతులు విధించినట్లు డబ్ల్యూఎస్‌జే పేర్కొంది. అవి వైట్‌హౌస్‌కు ఆమోదయోగ్యంగా లేకపోవడంతో భేటీ సాధ్యపడలేదు. మరోవైపు ఉత్తర కొరియాను చట్టబద్ధమైన అణ్వస్త్ర దేశంగా అమెరికా గుర్తించాలని కిమ్‌ కోరుతున్నట్లు డబ్ల్యూఎస్‌జే తన కథనంలో తెలిపింది.

గతంలో ట్రంప్‌, కిమ్‌ మూడుసార్లు సమావేశమయ్యారు. 2018 జూన్‌లో సింగపూర్‌లో జరిగిన తొలి భేటీ చారిత్రాత్మకంగా నిలిచింది. అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఉత్తర కొరియా నాయకుడిని కలవడం అదే తొలిసారి. అనంతరం వియత్నాం, కొరియా సైనిక రహిత ప్రాంతం (డీఎంజెడ్‌)లోనూ ఇరువురు భేటీ అయ్యారు. చివరి సమావేశంలో ట్రంప్‌ కొద్దిసేపు ఉత్తర కొరియా భూభాగంపై కూడా అడుగుపెట్టారు. అయితే ఈ మూడు సమావేశాల్లోనూ ఉత్తర కొరియా అణ్వాయుధాల నిరాయుధీకరణపై ఆశించిన ఫలితం రాలేదు.

2019లో చివరిసారిగా ట్రంప్‌ను కలిసినప్పటి నుంచి ఉత్తర కొరియా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంది. అప్పట్లో 20-30 వరకు ఉన్నాయని అంచనా వేసిన అణు వార్‌హెడ్ల సంఖ్య ప్రస్తుతం సుమారు 60కి చేరినట్లు అంచనాలున్నాయి. అమెరికాను చేరుకోగల ఘన ఇంధనంతో పనిచేసే ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను కూడా అభివృద్ధి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ దౌత్య ప్రయత్నాలకు కిమ్‌ నుంచి స్పందన రాకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి: ‘అయ్యన్ 4.0’: అడవి దారి నుంచి అత్యవసర వైద్యం వరకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement