ఎఫ్‌బీఐ క్రిమినల్‌ డేటాబేస్‌ హ్యాక్‌? రంగంలోకి దర్యాప్తు సంస్థ! | FBI Criminal Database Hack Investigation | Sakshi
Sakshi News home page

ఎఫ్‌బీఐ క్రిమినల్‌ డేటాబేస్‌ హ్యాక్‌? రంగంలోకి దర్యాప్తు సంస్థ!

Nov 22 2026 12:08 AM | Updated on Nov 22 2026 12:08 AM

FBI Criminal Database Hack Investigation

వాషింగ్టన్‌: అమెరికాలో మరో సైబర్‌ దాడి కలకలం రేపుతోంది. నేరస్థుల వివరాలు, అరెస్టు వారెంట్లు, బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌లకు ఉపయోగించే ఎఫ్‌బీఐ కీలక డేటాబేస్‌ హ్యాక్‌ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.

నేషనల్‌ క్రైమ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ (ఎన్‌సీఐసీ) డేటాబేస్‌ను ఫెడరల్‌, స్థానిక దర్యాప్తు సంస్థలు వినియోగిస్తాయి. నేరస్థుల సమాచారం, అరెస్టు వారెంట్లు తదితర వివరాలను పంచుకునేందుకు ఈ వ్యవస్థ కీలకంగా ఉంటుంది. హ్యాకింగ్‌ ఘటనపై ఎఫ్‌బీఐ వెంటనే స్పందించలేదు.

ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ.. హ్యాక్‌ గురించి ఇప్పుడే విన్నానని, ఇది మంచిది కాదని అన్నారు. అయితే, దీని ద్వారా గతంలో తెలియని విషయాలు వెలుగులోకి రావచ్చని వ్యాఖ్యానించారు.

ఇటీవల అమెరికాలో బ్యాంకింగ్‌, విమానయాన రంగాల్లో సాంకేతిక అంతరాయాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. అవి సైబర్‌ దాడుల వల్ల జరగలేదని అధికారులు స్పష్టం చేసినప్పటికీ.. ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌ నేషనల్‌ సైబర్‌ డైరెక్టర్‌ సీన్‌ కైర్‌క్రాస్‌ను ఈ వారం పదవి నుంచి తొలగించారు.

ఇదిలా ఉండగా, సెప్టెంబర్‌లో షైనీహంటర్స్‌ అనే హ్యాకింగ్‌ బృందం ఎఫ్‌బీఐ సిబ్బందికి చెందిన సుమారు 38 వేల మంది వ్యక్తిగత వివరాలను చోరీ చేసినట్లు ప్రకటించింది. మరోవైపు అమెరికా వ్యవసాయ శాఖ రైతు చెల్లింపుల వ్యవస్థపైనా సైబర్‌ దాడి జరిగినట్లు ఎన్బీసీ పేర్కొంది. అయితే, ఈ ఘటనలపై అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.

ఇదీ చదవండి: కెనడాలో కాల్పులు : భారత సంతతి జంట మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement