అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ (Federal Reserve)పై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ మంచి వృద్ధిని సాధిస్తున్నప్పటికీ.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎక్కువగా ఉంచడం వల్ల దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా భారత్‌ను ఉదాహరణగా చెబుతూ.. భారత్‌లో వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం వల్ల ఆర్థిక వృద్ధి వేగంగా జరుగుతోందని వ్యాఖ్యానించారు.
వడ్డీ రేట్ల వల్ల సమస్యలు
వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే.. హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, బిజినెస్ లోన్స్ వంటి వాటిపై భారం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రజలు లోన్స్ తీసుకోవడానికి వెనుకాడతారు. దీంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కంపెనీలలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపకపోవచ్చు. ఫలితంగా.. పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించే అవకాశం ఉంటుంది. కాబట్టి వడ్డీ రేట్లను తగ్గించాలని ట్రంప్ చెబుతున్నారు.
భారత్ 7 శాతం వృద్ధి
భారతదేశంలో వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం వల్ల.. ఇండియా సుమారు 7 శాతం ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటు ద్వారా వడ్డీ రేట్లను నియంత్రిస్తుంది. రెపో రేటు తగ్గితే బ్యాంకులకు రుణాలు తక్కువ వడ్డీకి లభించే అవకాశం ఉంటుంది. దాని ప్రభావంతో ప్రజలు, వ్యాపార సంస్థలకు కూడా రుణాలు చౌకగా లభించి పెట్టుబడులు, వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది.
ద్రవ్యోల్బణం
అయితే.. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల ప్రయోజనాలు మాత్రమే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయి. మార్కెట్‌లో డబ్బు చలామణి ఎక్కువైతే వస్తువులు, సేవల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం (Inflation) అధికమయ్యే ప్రమాదం ఉంది. అందుకే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్, భారతదేశ RBI వంటి కేంద్ర బ్యాంకులు కేవలం GDP వృద్ధిని మాత్రమే కాకుండా ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు, ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. కేంద్ర బ్యాంకులు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.


