పాదరసం నుంచి బంగారం తయారీ! | Can Mercury Turn Into Gold Bengaluru Inventor Patented 2-Step Technology | Sakshi
Sakshi News home page

పాదరసం నుంచి బంగారం తయారీ!

Nov 20 2026 9:10 PM | Updated on Nov 20 2026 9:10 PM

Can Mercury Turn Into Gold Bengaluru Inventor Patented 2-Step Technology

ప్రకృతిలో ఒక మూలకాన్ని మరో మూలకంగా మార్చడం సాధ్యమేనా? ముఖ్యంగా పాదరసం (మెర్క్యురీ) వంటి మూలకాన్ని బంగారం (గోల్డ్‌)గా మార్చగలిగితే ప్రపంచ లోహ పరిశ్రమలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఇన్నాళ్లూ ఊహాగానాలుగా మిగిలిన ఈ అంశానికి బెంగళూరుకు చెందిన ఆవిష్కర్త రాజా విజయ్‌ కుమార్‌ తన ప్రయోగాల ద్వారా కొత్త దిశ చూపిస్తున్నారు. ఆయన అభివృద్ధి చేసిన ‘గ్రావిటోరేడియోఫిజికల్‌ న్యూక్లియర్‌ ట్రాన్స్‌మ్యుటేషన్‌’ (జీఎన్‌టీ) సాంకేతికత పాదరసంతో కూడిన నమూనాలపై ప్రయోగాలు చేసినప్పుడు బంగారం, వెండి సహా పలు మూలకాలు గుర్తించినట్లు వెల్లడైంది. అయితే ఈ ఫలితాలు నిజంగా ఒక మూలకాన్ని మరో మూలకంగా మార్చినట్లు నిరూపించాయా? అన్నది ఇప్పుడు శాస్త్రవర్గాల్లో ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.

ఎనిమిదేళ్ల నిరీక్షణకు పేటెంట్‌ గుర్తింపు

రాజా విజయ్‌ కుమార్‌ అభివృద్ధి చేసిన జీఎన్‌టీ విధానానికి భారత పేటెంట్‌ నంబర్‌ 5683222 లభించింది. 2017 నవంబర్‌ 21న దరఖాస్తు చేసుకున్న ఈ సాంకేతికతకు పేటెంట్‌ మంజూరైంది. ఆయన స్కేలీన్‌ ఎనర్జీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఆర్గనైజేషన్‌ డి స్కేలీన్‌ ఫౌండేషన్‌లో డైరెక్టర్‌, చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.

సాధారణ రసాయన చర్యల ద్వారా ఒక మూలకాన్ని మరో మూలకంగా మార్చడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి మూలకానికి ప్రత్యేకమైన పరమాణు కేంద్రక నిర్మాణం ఉంటుంది. బంగారం పరమాణు సంఖ్య 79 కాగా, పాదరసానికి 80. అంటే పాదరసాన్ని బంగారంగా మార్చాలంటే దాని కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్యలో మార్పు రావాలి. ఈ ప్రక్రియనే న్యూక్లియర్‌ ట్రాన్స్‌మ్యుటేషన్‌ అంటారు.

రెండు దశల్లో ప్రక్రియ

ఈ ప్రయోగంలో కీలకమైన పరికరాన్ని ‘బూమ్‌ ట్యూబ్‌’గా పిలుస్తున్నారు. ఇది ప్రత్యేకంగా రూపొందించిన గొట్టాకారంలోని రియాక్టర్‌. ఇందులో అల్యూమినియం మిశ్రమంతో తయారు చేసిన యాంటెన్నాలు, అధిక శక్తి కలిగిన హైఫ్రీక్వెన్సీ జనరేటర్‌ ఉంటాయి. వాక్యూమ్‌ వాతావరణంలో ఉష్ణోగ్రత, పీడనాన్ని నియంత్రించే ఏర్పాట్లూ ఉంటాయి.

  • ఒక రసాయన సమ్మేళనంలో ఉన్న లక్ష్య మూలకాన్ని విడదీయడానికి ప్రత్యేకమైన డిసోసియేటింగ్‌ ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తారు. ఏ మూలకాన్ని వేరు చేయాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా పౌనపున్యాన్ని ఎంపిక చేస్తారు.

  • విడదీసిన మూలకంపై మరో ప్రత్యేకమైన ట్రాన్స్‌మ్యుటేషన్‌ ఫ్రీక్వెన్సీని ప్రయోగిస్తారు. దీని ద్వారా పరమాణు కేంద్రకంలో మార్పు తీసుకురావడమే లక్ష్యమని విజయ్‌ కుమార్‌ వివరిస్తున్నారు. ప్రతి మూలకానికి ప్రత్యేకమైన పౌనపున్యం లేదా పౌనపున్యాల సముదాయం ఉంటుందని ఆయన అభిప్రాయం. అయితే ఈ విధానం పనిచేసే కచ్చితమైన భౌతిక శాస్త్ర యంత్రాంగం ఇంకా పరిశోధనలోనే ఉంది.

ప్రయోగాల్లో ఏమి గుర్తించారు?

పేటెంట్‌ పత్రాల్లో వివరించిన ప్రయోగాల ప్రకారం.. మెర్క్యురిక్‌ సల్ఫేట్‌ను డిస్టిల్డ్‌ వాటర్‌తో కలిపి నమూనాను సిద్ధం చేశారు. అందులో కొంత భాగాన్ని ఎలాంటి చర్యలు చేపట్టకుండా కంట్రోల్‌ శాంపిల్‌గా ఉంచారు. మిగిలిన నమూనాలను బూమ్‌ ట్యూబ్‌ ద్వారా ప్రాసెస్‌ చేశారు. అనంతరం రెండు రకాల నమూనాలను ప్రయోగశాలకు పంపినట్లు నివేదిక వెల్లడించింది.

పరీక్షల్లో ప్రాసెస్‌ చేసిన నమూనాల్లో బంగారం ఉన్నట్లు గుర్తించారు. మొదటి నమూనాలో లీటరుకు 1.91 మిల్లీగ్రాములు, రెండో నమూనాలో 2.3 మిల్లీగ్రాముల బంగారం ఉన్నట్లు నివేదించారు. రెండో నమూనాలో లీటరుకు 11 మిల్లీగ్రాముల వెండిని కూడా గుర్తించారు. మెగ్నీషియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, జింక్‌ వంటి ఇతర మూలకాల ఉనికినీ నివేదిక ప్రస్తావించింది. మరో ఆసక్తికరమైన అంశం పాదరసం పరిమాణంలో తగ్గుదల. ప్రయోగానికి ముందు 33.45 గ్రాములుగా ఉన్న పాదరసం పరిమాణం ప్రాసెసింగ్‌ అనంతరం 8.67 గ్రాములకు తగ్గినట్లు పేర్కొన్నారు. సల్ఫర్‌ పరిమాణం మాత్రం సుమారు 8.5 గ్రాముల వద్ద స్థిరంగా ఉన్నట్లు వెల్లడించారు.

శాస్త్రీయ నిరూపణ జరిగినట్లేనా?

ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. పేటెంట్‌ మంజూరు కావడం, ప్రయోగ నమూనాలో బంగారం ఉన్నట్లు గుర్తించడం.. ఈ రెండూ పాదరసాన్ని విజయవంతంగా బంగారంగా మార్చినట్లు శాస్త్రీయంగా నిరూపించడానికి సరిపోవు. పేటెంట్‌ అనేది ఆవిష్కరణకు సంబంధించిన మేధో సంపత్తి హక్కుల గుర్తింపు. అది ప్రయోగ ఫలితాలపై అంతర్జాతీయ శాస్త్రీయ ఏకాభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు.

ఇదీ చదవండి: ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల లాభం.. కారణాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement