పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధికి ఆర్థిక తోడ్పాటునందిస్తూ స్థానిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ రీజినల్ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక క్రెడిట్ అవుట్‌రీచ్ (రుణ ప్రచార) కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని గురునానక్ కాలనీలో ఉన్న ఒక ప్రైవేట్ హోటల్ వేదికగా జరిగిన ఈ సదస్సుకు వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, బ్యాంకింగ్ నిపుణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జ్ఞాననేత్ర కన్సల్టెన్సీ ప్రతినిధి జయచంద్ర రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి వ్యాపారికి, పారిశ్రామికవేత్తకు ఎటువంటి జాప్యం లేకుండా సులభతరమైన రీతిలో ఆర్థిక సాయం అందించడమే ఈ ప్రత్యేక క్రెడిట్ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా తమ విజయవాడ రీజియన్ పరిధిలో ఏకంగా రూ.70 కోట్ల మేర రుణాలను మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. స్థానిక వ్యాపార వర్గాల అవసరాలను గుర్తించి, ఆర్థిక సహకారం అందించడంలో తమ బ్యాంకు ఎల్లప్పుడూ ముందుంటుందని హర్షం వ్యక్తం చేశారు.
వినియోగదారుల సౌలభ్యం కోసం బ్యాంకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను రీజినల్ హెడ్ వివరిస్తూ.. మార్కెట్లో పోటీతత్వాన్ని తట్టుకునేలా అత్యంత ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, రుణగ్రహీతలపై ఆర్థిక భారం పడకుండా ప్రాసెసింగ్ ఛార్జీలను కనిష్ఠ స్థాయిలో ఉంచామని, దరఖాస్తుల పరిశీలన నుంచి రుణ మంజూరు వరకు ప్రక్రియను అత్యంత వేగవంతం చేశామని వివరించారు.
ఇదీ చదవండి: ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల లాభం.. కారణాలు..


