విమానాశ్రయ ప్రాజెక్ట్‌.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు! | Parandur Airport Project Madras High Court Issues Notice to Tamil Nadu Govt | Sakshi
Sakshi News home page

విమానాశ్రయ ప్రాజెక్ట్‌.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు!

Nov 20 2026 6:15 PM | Updated on Nov 20 2026 6:23 PM

Parandur Airport Project Madras High Court Issues Notice to Tamil Nadu Govt

తమిళనాడులో ప్రతిపాదిత పరందూర్ గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు మరోసారి న్యాయపరమైన చర్చకు కేంద్రబిందువైంది. ఈ ప్రాజెక్టును నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్, పుస్తక ప్రచురణకర్త జి.గౌతమన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మద్రాస్‌ హైకోర్టు కీలకంగా స్పందించింది. ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన వివరాలను సమర్పించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వంతో పాటు సంబంధిత కేంద్ర, రాష్ట్ర సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఏ.ధర్మాధికారి, జస్టిస్‌ జి.అరుల్‌ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తమిళనాడు ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలకు కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాత చేపట్టనున్నట్లు వెల్లడించింది.

ఈ వ్యవహారంలో కీలకమైన అంశం ఏమిటంటే.. ఇప్పటికే భూసేకరణ, సాధ్యాసాధ్యాల అధ్యయనాలు, పరిపాలనా అనుమతుల దశలను దాటిన భారీ ప్రాజెక్టును ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేయడంపై న్యాయస్థానంలో ప్రశ్నలు తలెత్తడం. ‘ఇప్పటికే వందల ఎకరాల భూమిని సేకరించి, పరిహారం చెల్లించిన తర్వాత ప్రాజెక్టును మధ్యలో ఎలా వదిలేస్తారు? ప్రజాధనాన్ని వృథా చేయడానికి వీల్లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వాల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా విమానాశ్రయాల నిర్మాణం జరగదని స్పష్టం చేసింది.

ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు

చెన్నైకి రెండో అంతర్జాతీయ విమానాశ్రయంగా పరందూర్‌ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం 2023 అక్టోబర్‌ 31న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా కాంచీపురం జిల్లాలోని పరందూర్‌ సహా 20 గ్రామాల్లో ప్రైవేటు భూముల సేకరణ, ప్రభుత్వ భూముల బదలాయింపునకు పరిపాలనా అనుమతులు కల్పించారు.

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, టిడ్కో నిర్వహించిన సాధ్యాసాధ్యాల అధ్యయనాల అనంతరం పన్నూర్, తిరుపోరూర్, పడలం వంటి ఇతర ప్రాంతాల కంటే పరందూర్‌ అనుకూలమని ఎంపిక చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని పిటిషనర్‌ తన వాదనలో ప్రస్తావించారు. చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేకు సమీపంలో ఉండటం, ఇతర ప్రాంతాలతో పోలిస్తే తక్కువ స్థాయిలో జనాభా తరలింపు (సుమారు 1,500 కుటుంబాలు) అవసరం కావడం, విమానయాన కార్యకలాపాలకు అనుకూలత, భవిష్యత్తులో విమానాశ్రయ విస్తరణకు అవకాశాలు ఉండటం వంటి అంశాలు ఈ ప్రాంతం ఎంపికకు కారణాలుగా పేర్కొన్నారు.

ప్రభుత్వం చెబుతున్న కారణాలేమిటి?

2026 ఆగస్టు 24న తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ శాసనసభలోని రూల్‌ 110 కింద పరందూర్‌ విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించిన చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రైతుల వ్యవసాయ భూములు, గ్రామీణ ప్రజల నివాసాలు, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ఎంపిక చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. తాజా విచారణ సందర్భంగా అడ్వకేట్‌ జనరల్‌ విజయ్‌ నారాయణ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు.

ప్రతిపాదిత భూసేకరణ ప్రాంతంలో (మొత్తం 5,368 ఎకరాల్లో సుమారు 201 ఎకరాలు జలవనరులు, చిత్తడి నేలలు) పెద్ద సంఖ్యలో చెరువులు, ఇతర జలవనరులు, వ్యవసాయ భూములు ఉన్నాయని, దీంతో పర్యావరణ అనుమతులు పొందడం కష్టమయ్యే అవకాశముందని కోర్టుకు వివరించారు. ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, తప్పుడు నిర్ణయాన్ని సరిదిద్దుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కారణాలను వివరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వు త్వరలో జారీ చేస్తామని, ప్రస్తుతం ఆ ఉత్తర్వు ప్రక్రియలో ఉందని తెలిపారు.

మరోవైపు, పరందూర్‌ ప్రాజెక్టును నిలిపివేసినప్పటికీ చెన్నైకి రెండో విమానాశ్రయం అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించడంతో పాటు మీనంబాక్కంలోని ప్రస్తుత విమానాశ్రయంలో టెర్మినల్‌ విస్తరణ (టెర్మినల్ 3, టెర్మినల్ 5 ద్వారా వార్షిక సామర్థ్యాన్ని 5.5 కోట్ల ప్రయాణికులకు పెంచడం) ద్వారా ప్రయాణికుల రద్దీని నిర్వహించాలనే ప్రణాళికను కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా, మద్రాస్‌ హైకోర్టు జారీ చేసిన నోటీసులు ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసినట్లు కాదు. అలాగే ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని కూడా ఆదేశించలేదు. సంబంధిత సంస్థల వివరణలు, ప్రభుత్వం సమర్పించే అధికారిక రికార్డులు, పర్యావరణపరమైన అంశాల పరిశీలన అనంతరం ఈ వ్యవహారంలో తదుపరి న్యాయపరమైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల లాభం.. కారణాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement