తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగమైన విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) అధ్యక్షుడు తోల్ తిరుమావళవన్, శ్రీలంకలోని ఎల్‌టీటీఈ (LTTE) దివంగత అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ పూర్వ నివాసాన్ని సందర్శించడం తమిళనాడులో రాజకీయ దుమారానికి దారి తీసింది. ఇది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని అవమానించడమేనని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు టీవీకే సర్కార్‌లోని భాగమైన కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు ఈ విషయంపై మౌనంగా ఉండటంపై కూడా బీజేపీ విమర్శలు సంధిస్తోంది.
వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ శ్రీలంకలోని జాఫ్నా జిల్లా వాల్వెట్టిత్తురైలో ఉన్న ప్రభాకరన్ పూర్వ నివాస స్థలాన్ని సందర్శించారు. ప్రభాకరన్ తన బాల్యాన్ని గడిపిన ఆ ప్రదేశంలో తిరుమావళవన్ నడుస్తున్న వీడియోలను ఆ దళిత నాయకుడు స్వయంగా షేర్ చేయడం వివాదాన్ని రేపింది.
ఇదీ చదవండి: ఇండియన్స్‌కు షాక్ ఇచ్చిన మలేషియా
తమిళనాడులో ఉన్న భిన్న రాజకీయ పక్షాల కూటమిలో, భాగస్వామ్య పార్టీలు కొన్ని విషయాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. శ్రీలంకలో ప్రభాకరన్ గతంలో నివసించిన ఇల్లు అటువంటి రాజకీయ సున్నితమైన అంశం. 1991లో రాజీవ్ గాంధీని హత్య చేసిన సంస్థకు నాయకత్వం వహించిన ప్రభాకరన్‌కు సంబంధించిన స్థలాన్ని, విజయ్ ప్రభుత్వంలో కీలక మిత్రపక్షంగా ఉన్న తిరుమావళవన్ సందర్శించడం గమనార్హం.
అయితే, ప్రస్తుతం ప్రభాకరన్ ఇల్లు అక్కడ లేదు. అంతర్యుద్ధం ముగిసిన ఒక సంవత్సరం తర్వాత, 2010లో శ్రీలంక సైన్యం ప్రభాకరన్ పూర్వీకుల ఇంటిని కూల్చివేసింది. ఆ తర్వాత ఆ స్థలాన్ని చదును చేశారు. ఎల్‌టీటీఈ అధినేత నివసించినప్రదేశం అన్న బోర్డు తప్ప ప్రస్తుతం ఖాళీ స్థలం మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 16న జరిగిన సీనియర్ తమిళ రాజకీయనాయకుడు ఎం.కె. శివాజిలింగం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తిరుమావళవన్ శ్రీలంకకు వెళ్లారు. ఈ సందర్భంగా జాఫ్నాలోని చెమ్మణి స్మారక స్థలాన్ని కూడా ఆయన సందర్శించి, బాధితులు ,వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.
ఇదీ చదవండి: బుడ్డోడి ఫోజులకు ఫిదా : సర్‌ప్రైజ్ ఆఫర్
బీజేపీ విమర్శలు
తమిళనాడు బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి మంగళవారం 'ఎక్స్' వేదికగా ప్రభాకరన్ జాఫ్నా ఇంటికి తిరుమావళవన్ వెళ్లడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది క్షమించరాని చర్య అంటూ దుయ్యబట్టారు. ప్రభాకరన్ స్వాతంత్ర్య సమర యోధుడు కాదని, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు కారణమైన నిషేధిత ఉగ్రవాద సంస్థకు అధిపతి అని అన్నారు. ఇది రాజీవ్ గాంధీ జ్ఞాపకాలను అవమానించడమే అన్నారు. తమిళనాడు ప్రభుత్వంలో వీసీకేతో కాంగ్రెస్ కొనసాగిస్తున్న పొత్తును కూడా బీజేపీ అధికార ప్రతినిధి ప్రశ్నించారు.
ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దాడిలో కాంగ్రెస్ తన మాజీ ప్రధానిని కోల్పోయిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ హత్యకు బాధ్యుడైన వ్యక్తి నివాసాన్ని సందర్శించిన నాయకుడి పార్టీతో కాంగ్రెస్ అధికారాన్ని పంచుకుంటోందని తిరుపతి ఆరోపించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ వీసీకేతో తన పొత్తును తెంచుకోవాలని లేదా రాజీవ్ గాంధీ హంతకుడిని కీర్తిస్తున్న నాయకుడి పార్టీతో అధికారం పంచుకుంటున్న రాజకీయ భారాన్ని మోయాలని డిమాండ్ చేశారు. తిరుమావళవన్ పర్యటనపై గానీ, బీజేపీ చేసిన ఆరోపణలపై గానీ కాంగ్రెస్ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.


