సాక్షి, ముంబై: మహారాష్ట్రకు చెందిన రెండేళ్ల బాలుడు కొత్త స్కూటర్ ముందు ఫోజులిచ్చి నెట్టింట తెగ వైరల్‌గామారిపోయాడు. బుడ్డోడి ఫోజులతో కూడా ఒక చిన్న వీడియో 13.7 కోట్ల (137 మిలియన్) వ్యూస్ సాధించడంతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సంచలనంగా మారాడు. అంతేకాదు ఈ వైరల్ క్రేజ్ అతనికి బంపర్ ఆఫర్ కూడా తెచ్చి పెట్టింది. ఏం జరిగిందంటే..
మహారాష్ట్రలోని యావత్మాల్‌కు చెందిన రుద్రాంశ్ సింగ్ ఠాకూర్, నవంబర్ 9న తమ కొత్త హోండా యాక్టివా (Honda Activa) స్కూటర్‌ను కొనుక్కోవడానికి తల్లిదండ్రులు, అక్కతో కలిసి హోండా షోరూమ్‌కు వెళ్ళాడు. స్కూటర్ ముందు ఆ చిన్నారి బోల్డన్ని ఫోజు లిచ్చేశాడు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఫోజులిస్తున్న ఆ చిన్నారిని వీడియోలో బంధించారు. కళ్లకు సొగసైన అద్దాలు పెట్టుకుని, జేబుల్లో చేతులు పెట్టుకుని మరీ స్టైలిష్‌గా ఫోజులిచ్చిన రుద్రాంశ్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఈ క్లిప్ ఏకంగా 13.7 కోట్ల వ్యూస్, 68వేలకు పైగా కామెంట్స్ వచ్చాయంటే మనోడి క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఈ వైరల్ వీడియో ఆ కుటుంబం స్కూటర్ కొనుగోలు చేసిన 'సాయి పాయింట్ హోండా' డీలర్‌షిప్ యజమాని దిలీప్ బోబడే పాటిల్ దృష్టిని ఆకర్షించింది.
ఇదీ చదవండి: రెండేళ్లు స్నానం లేదు, ఆయన చావును కోరుకున్నారు : హేమా చౌదరి సంచలన వ్యాఖ్యలు
చిన్నారికి వచ్చిన ఆదరణను సెలబ్రేట్ చేయడానికి పాటిల్, రుద్రాంశ్ కుటుంబ సభ్యులను షోరూమ్‌కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనొక స్పెషల్ ప్రకటన చేశాడు. రుద్రాంశ్‌కు కేజీ నుండి గ్రాడ్యుయేషన్ దాకా విద్యా ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: International Men’s Day 2026: పెళ్లే పురుషుడి జీవిత లక్ష్యమా?
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న యశ్ చించోల్కర్, ఇది కేవలం సాధారణ బహుమతుల జాబితాలో చేరేది కాదని, ఆ చిన్నారి భవిష్యత్తును తీర్చిదిద్దే గొప్ప కానుక అని అభివర్ణించారు. తన కుమారుడిపై ప్రజలు ఇంత ప్రేమ చూపించడం, అతని భవిష్యత్తుకు అండగా నిలవడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోందని రుద్రాంశ్ తల్లి ఆనందం వ్యక్తం చేశారు.
బుడ్డోడికి నెటిజన్లు ఫిదా
రుద్రాంశ్ ఫోజులకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. వేలాది కామెంట్లు వెల్లువెత్తాయి. ఆత్మవిశ్వాసంతో కూడిన చిన్నారి హావభావాలు, ప్రత్యేకమైన ఫోజుల కారణంగా సోషల్ మీడియా వినియోగదారులు అతనికి 'ఆరా కిడ్' (Aura Kid) అనే ముద్దుపేరు పెట్టారు. కొందరు అతని యాటిట్యూడ్‌ను 'లిటిల్ డాన్'తో పోల్చగా, మరికొందరు సరదాగా అతనిని హోండా కొత్త ఛైర్మన్ అని పిలుస్తున్నారు.
స్కూటర్ కొనుగోలు సమయంలో సరదాగా తీసుకున్న ఒక కుటుంబ వీడియో, ఇప్పుడు ఆ చిన్నారికి ఊహించని గొప్ప అవకాశంగా మారింది. సోషల్ మీడియాలో వచ్చే వైరల్ క్రేజ్ సాధారణంగా తాత్కాలికమే అయినప్పటికీ, రుద్రాంశ్ చదువుకు అండగా నిలుస్తామన్న ఈ హామీ మాత్రం నెట్టింట విశేషంగా నిలుస్తోంది.


