ఒకరినొకరు తిట్టుకుంటే ఏమొస్తుంది?: ప్రధాని మోదీ | PM Modi Indias Economy Growing Rapidly Criticism Wont Drive Progress | Sakshi
Sakshi News home page

ఒకరినొకరు తిట్టుకుంటే ఏమొస్తుంది?: ప్రధాని మోదీ

Nov 19 2026 12:15 PM | Updated on Nov 19 2026 12:15 PM

PM Modi Indias Economy Growing Rapidly Criticism Wont Drive Progress

న్యూఢిల్లీ: రాజకీయ నేతలు ఉదయం, సాయంత్రం ఒకరినొకరు విమర్శించుకోవడం వల్ల దేశం అభివృద్ధి చెందదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోందని, ప్రపంచ రేటింగ్ సంస్థలు సైతం దేశ వృద్ధిపై సానుకూల అంచనాలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఫిక్కీ శతాబ్ది సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతోందని తెలిపారు. దేశ వృద్ధి రేటు సుమారు 7 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.

ఎగుమతుల్లో సరికొత్త రికార్డు
గత అక్టోబరులో భారత వస్తు ఎగుమతులు దాదాపు 50 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని మోదీ వెల్లడించారు. ఇప్పటివరకు నమోదైన అత్యధిక నెలవారీ ఎగుమతుల గణాంకమిదని చెప్పారు. భారత్‌ ఆర్థిక పురోగతిని గుర్తించిన మూడీస్‌, ఎస్‌అండ్‌పీ, ఫిచ్‌ వంటి అంతర్జాతీయ రేటింగ్ సంస్థలతో పాటు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా వృద్ధి అంచనాలను పెంచుతున్నాయని వివరించారు.

12 ఏళ్లలో పేదరికంపై పోరాటం
పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుతూ.. 1970వ దశకంలో గరీబీ హటావో నినాదం వచ్చినప్పుడు దేశ జనాభా సుమారు 50 కోట్లుగా ఉండేదని గుర్తుచేశారు. అప్పట్లో సరైన విధానాలు, సంకల్పం లేకపోవడంతో పేదరిక నిర్మూలన సాధ్యం కాలేదన్నారు. అయితే గత 12-13 ఏళ్లలో ప్రభుత్వ చర్యలతో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదికను ప్రస్తావిస్తూ ఈ విషయాన్ని వివరించారు.

రాహుల్‌ విమర్శలకు పరోక్ష సమాధానం
మరోవైపు, అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ భారత ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశం ఆర్థిక విపత్తు అంచున ఉందని ఆరోపించారు. యువతకు డిగ్రీలు ఉద్యోగాలు కల్పిస్తాయనే నమ్మకం లేదని, పేపర్‌ లీకేజీలు వారి భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు తగ్గుతూ, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో మోదీ అభివృద్ధి గణాంకాలను ప్రస్తావిస్తూ రాజకీయ విమర్శలతో దేశం ముందుకు సాగదని వ్యాఖ్యానించారు.

భారత ఆర్థిక ప్రయాణంలో ఎన్నో మలుపులు
గత వందేళ్ల భారత ఆర్థిక ప్రయాణాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. లైసెన్స్‌-కోటా రాజ్‌, జాతీయీకరణ ప్రయోగాలు, ఒకప్పుడు ఫ్రజైల్‌ ఫైవ్‌ దేశాల జాబితాలో భారత్‌ ఉండటం వంటి పరిణామాలను గుర్తుచేశారు. గత 12 ఏళ్లలో యువత, రైతులు, కార్మికులు, పారిశ్రామికవేత్తల సమష్టి కృషితో పరిస్థితులు మారాయని అన్నారు. ఫిక్కీ వందేళ్ల ప్రస్థానాన్ని అభినందిస్తూ, రాబోయే 20 ఏళ్లలో భారత పరిశ్రమలు సాధించాల్సిన లక్ష్యాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: ఇందిరకు ప్రధాని మోదీ నివాళులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement