సింగపూర్, థాయ్‌లాండ్ ప్రధానులతో మోదీ భేటీ
మనీలా: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఫిలిప్పైన్స్‌లో సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్, థాయ్‌లాండ్ అనుటిన్ చార్న్‌విరాకుల్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆయా దేశాలతో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
లారెన్స్ వాంగ్‌తో జరిగిన సమావేశంలో.. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ రంగాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై మాట్లాడుకున్నారు. సింగపూర్ ప్రధానితో ఫలప్రదమైన సమావేశం జరిగిందని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ‘‘భారతదేశానికి సింగపూర్ ఒక విలువైన భాగస్వామి. రాబోయే కాలంలో మా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆశిస్తున్నాం’’అని వివరించారు.
వచ్చే ఏడాది ‘ఆసియాన్’కు సింగపూర్ సారథ్యం వహించనున్న నేపథ్యంలో మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై థాయ్‌లాండ్ ప్రధానితో మోదీ చర్చించారు. ‘‘భారత్, థాయిలాండ్‌లు సముద్ర సరిహద్దు పొరుగు దేశాలు. శతాబ్దాల ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, ఆధ్యాతి్మక సంప్రదాయాలతో ముడిపడి ఉన్నాయి’’అని మోదీ పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, అనుసంధానం, డిజిటల్ టెక్నాలజీ, ఫిన్‌టెక్, సంస్కృతి, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై సంప్రదింపులు జరిగాయి.
గురుద్వారాలో మోదీ ప్రార్థనలు
మనీలా నగరంలో పురాతన గురుద్వారాను మోదీ మంగళవారం సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గురుద్వారా పునరి్నర్మాణానికి పునాది రాయి వేశారు. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ‘గురుద్వారా ఖల్సా దివాన్’ను సందర్శించడం ఎంతో ఆనందం కలిగించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెనేటర్ ఫ్రాన్సిస్ జోసెఫ్ ఎసు్కడెరో, మనీలా మేయర్ ఫ్రాన్సిస్కో ఇస్కో మోరెనోతో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గురుద్వారా ఖల్నా దివాన్ ఒక శతాబ్దానికి పైగా భారత్, ఫిలిప్పైన్స్ మధ్య సజీవ సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలకు నిదర్శనంగా నిలిచిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ గురుద్వారాను మొదట 1901లో స్థాపించారు. 1924లో ఖల్సా దివాన్‌గా మారింది.


