అమెరికా గడ్డపై ఇరాన్‌ డర్టీ బాంబు? | Iran plotting a dirty bomb attack in the US | Sakshi
Sakshi News home page

అమెరికా గడ్డపై ఇరాన్‌ డర్టీ బాంబు?

Nov 18 2026 6:00 AM | Updated on Nov 18 2026 6:00 AM

Iran plotting a dirty bomb attack in the US

లేదంటే రసాయన బాంబు 

అమెరికా నిఘావర్గాల హెచ్చరిక 

సన్నద్ధంగా ఉండాలని పిలుపు 

న్యూఢిల్లీ: అమెరికా రాజధాని వాషింగ్టన్‌పై ఇరాన్‌ డర్టీ బాంబు లేదా రసాయన బాంబుతో దాడి చేసే అవకాశముందని ఆ దేశ నిఘా వర్గాలు హెచ్చరించినట్లు వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌ తెలిపింది. ట్రంప్‌ ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారులు ఎవరెవరిపై ఏ ఏ ప్రాంతాల్లో దాడులు జరగవచ్చో కూడా తమకు తెలుసునని అమెరికన్‌ అధికారులు చెబుతున్నట్లు సీఎన్‌ఎన్‌ తెలిపింది. నిఘా వర్గాలు అందించిన ఈ సమాచారంతో వైట్‌హౌస్‌ కూడా అప్రమత్తమైందని, అధికార ప్రతినిధి లారెన్‌ బిస్‌ ‘‘పరిస్థితిని సమీక్షిస్తున్నాం. కానీ ప్రస్తుతానికైతే అమెరికాకు విశ్వసనీయమైన ముప్పు ఏదీ లేదు’’అని ప్రకటించిన విషయాన్ని సీఎన్‌ఎన్‌ గుర్తు చేసింది.

 ఇరాన్‌ డర్డీ బాంబు దాడి సమాచారం వెనుక కొద్దో గొప్పో వాస్తవం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. మినాబ్‌ పాఠశాలపై దాడులకు ఆదేశాలిచ్చారన్న కారణంతో ఇద్దరు అమెరికా నావికాదళ అధికారులను ఇరాన్‌ ఇటీవలే బెదిరించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 123 మంది బాలికలు మరణించారు. అంతకుముందు అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్‌ బెసెంట్‌ను ఇంటి నుంచి మిలిటరీ బేస్‌కు తరలించారు. 

ఈ నేపథ్యంలో ఇరాన్‌ డర్టీ బాంబు లేదా రసాయన బాంబులతో అమెరికాపై దాడి చేసినా చేయవచ్చునని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ‘‘అయితే ఇరాన్‌ ఈ దాడులు కచ్చితంగా చేస్తుందా? లేదా? తగిన సిబ్బంది ఉన్నారా? అన్నది చర్చనీయాంశం’’అని అమెరికన్‌ అధికారిని ఉటంకిస్తూ సీఎన్‌ఎన్‌ తెలిపింది. గత వారం రోజుల్లో దాడులను తిప్పికొట్టడం అనే అంశంపై చర్చలు జరిగినట్లు రెండు వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు, విశ్రాంత అమెరికా అధికారుల హత్యకు ఇరాన్‌ ప్లాన్‌ చేస్తోందని, 2024లో ట్రంప్‌పై జరిగిన దాడి అందులో భాగమేనని నిఘా వర్గాల నివేదిక ఒకటి తెలిపింది.  

ఏమిటీ డర్టీ బాంబు... 
అమెరికా గడ్డపై ఇరాన్‌ ఏ రకమైన దాడి చేయగలిగినా అది ఆ దేశానికి పెద్ద విజయమే అవుతుంది. తాము తలచుకుంటే ఎంతదాకైనా వెళ్లగలమన్న సంకేతం ట్రంప్‌కు అందించినట్లు అవుతుంది. అయితే డర్టీ బాంబుల్లాంటి వాటితో సమస్య మరింత జటిలమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇది అణ్వాయుధం కాదు. కానీ కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ ప్రమాదకరమైన రేడియోధారి్మకతను వెదజల్లగలదు. అయితే రేడియో ధారి్మకతతో వెంటనే ప్రాణాలు పోకపోవచ్చు కానీ.. పేలుడు ధాటికి మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువ. పైగా డర్టీ బాంబు కోసం స్మగ్లింగ్‌ చేయాల్సిన పని లేదు.

 అమెరికాలో ఉన్న వారి సాయంతోనే అక్కడికక్కడ డర్టీ బాంబు తయారు చేయవచ్చు. బాంబు తయారీకి అవసరమైన పదార్థాలను అమెరికాలోనే సేకరించి ఉంచే అవకాశాలపై ఇరానియన్లు చర్చించుకున్నట్లు తెలిసిందని సీఎన్‌ఎన్‌ విశ్వసనీయ వర్గాలను ప్రస్తావిస్తూ తెలిపింది. డర్టీ బాంబుతో ప్రజలు అనారోగ్యం పాలు కావచ్చునని, కొన్ని ప్రాంతాల్లో నివసించే అవకాశం లేకుండా పోతుందని వారు చెబుతున్నారు. ఒకవేళ ఇరాన్‌ డర్టీ బాంబు స్థానంలో రసాయన బాంబును వాడితే అమెరికా దళాలు ఆ ప్రభావాన్ని ఎదుర్కొనే పరిస్థితి లేదని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో రానున్న కొన్ని వారాలు అమెరికా భద్రతకు చాలా కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement