Hollywood: ప్రశంసలు.. విమర్శల మధ్య 'హంగర్‌ గేమ్స్‌' కొత్త చిత్రం! | Hollywood Movie Hunger Games Sunrise Reviews | Sakshi
Sakshi News home page

Hollywood: ప్రశంసలు.. విమర్శల మధ్య 'హంగర్‌ గేమ్స్‌' కొత్త చిత్రం!

Nov 18 2026 2:13 AM | Updated on Nov 18 2026 2:16 AM

Hollywood Movie Hunger Games Sunrise Reviews

హాలీవుడ్‌లో భారీ క్రేజ్‌ సంపాదించుకున్న ‘హంగర్‌ గేమ్స్‌’ ఫ్రాంచైజీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సిరీస్‌ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘హంగర్‌ గేమ్స్‌: సన్‌రైజ్‌ ఆన్‌ ది రీపింగ్‌’పై విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు సినిమాను దారుణమైన ప్రీక్వెల్‌గా కొట్టిపారేస్తుంటే.. మరికొందరు మాత్రం సిరీస్‌లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రశంసిస్తున్నారు.

ఈ ఫ్రాంచైజీలో ఇది ఆరో సినిమా. ఇందులో యువకుడిగా ఉన్న హేమిచ్‌ అబెర్నతీ కథను చూపించనున్నారు. గత చిత్రాల్లో ఈ పాత్రను వుడీ హారెల్సన్‌ పోషించారు. తొలి ‘హంగర్‌ గేమ్స్‌’ సినిమాకు 24 ఏళ్ల ముందు జరిగే కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. 2023లో వచ్చిన ‘ది బాలడ్‌ ఆఫ్‌ సాంగ్‌బర్డ్స్‌ అండ్‌ స్నేక్స్‌’కు ఇది ప్రీక్వెల్‌గా తెరకెక్కింది.

అయితే, ప్రముఖ పత్రిక ‘ది గార్డియన్‌’ ఈ సినిమాకు ఫైవ్‌స్టార్స్‌ రేటింగ్‌లో ఒక స్టార్‌ మాత్రమే ఇచ్చింది. కథ విసుగు పుట్టించేలా ఉందని, అభిమానుల నుంచి ఆదాయం పొందడమే లక్ష్యంగా రూపొందించినట్లు విమర్శించింది. ఇండీవైర్‌, న్యూయార్క్‌ టైమ్స్‌ సైతం కథలో ఆసక్తికరమైన పాత్రలు లేకపోవడం, జెన్నిఫర్‌ లారెన్స్‌ స్థాయి ప్రభావం కనిపించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. స్క్రీన్‌ డైలీ కూడా సినిమాను నిరాశపరిచే ప్రీక్వెల్‌గా అభివర్ణించింది.

మరోవైపు, ‘ది ర్యాప్‌’ మాత్రం సినిమాను ప్రశంసించింది. నటీనటుల ప్రదర్శన, ఆకట్టుకునే శైలి, సామాజిక అంశాలపై చేసిన వ్యాఖ్యానాలు బాగున్నాయని పేర్కొంది. హాలీవుడ్‌ రిపోర్టర్‌ కూడా హేమిచ్‌ పాత్రలో నటించిన జోసెఫ్‌ జాడా నటనను మెచ్చుకుంది. టైమ్‌ అవుట్‌ నాలుగు స్టార్ల రేటింగ్‌ ఇస్తూ.. 2023లో వచ్చిన ప్రీక్వెల్‌ కంటే ఈ సినిమా ఎంతో మెరుగ్గా ఉందని తెలిపింది.

అలాగే, ఈ చిత్రంలో రాల్ఫ్‌ ఫైన్స్‌, జెస్సీ ప్లెమన్స్‌, గ్లెన్‌ క్లోజ్‌, కీరన్‌ కల్కిన్‌, ఎల్లే ఫానింగ్‌, మెకెన్నా గ్రేస్‌, మాయా హాక్‌ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే, ఒకవైపు ప్రశంసలు.. మరోవైపు విమర్శలతో ఈ సినిమా ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుంది? బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: రెండు భాగాలుగా డ్రాగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement