టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. వివాహేతర సంబంధాల ఆరోపణల నేపథ్యంలో సీఈఓ పదవికి దూరమైన ఆయన.. మళ్లీ సంస్థ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బోర్డు కోరితే తిరిగి బాధ్యతలు స్వీకరించేందుకు గౌరవంగా భావిస్తానని ప్రకటించారు.
తన రాజీనామాపై వచ్చిన వార్తల తర్వాత తొలిసారిగా ఎక్స్ (X) వేదికగా స్పందించిన హువాంగ్.. ‘‘బోర్డుకు సమస్యలు సృష్టించినందుకు తీవ్రంగా చింతిస్తున్నా. నా తప్పులకు పూర్తి బాధ్యత నాదే’’ అని పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన తప్పులు చేశానని అంగీకరించారు. అయితే, తాను తిరిగి రావాలని కోరుతూ కంపెనీ ఉద్యోగులు, పెట్టుబడిదారులు, ఇతరుల నుంచి పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నాయని వెల్లడించారు.
మరోవైపు, ఎన్విడియా బోర్డు మాత్రం హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించే అంశాన్ని పరిశీలించడం లేదని బీబీసీ తెలిపింది. సంస్థలోని ఓ ఉన్నతాధికారిణితో వివాహేతర సంబంధం సహా ఆయన వ్యక్తిగత వ్యవహారాలపై బోర్డు విచారణ చేపట్టింది. చైనా గూఢచారిగా అనుమానిస్తున్న మహిళతో సంబంధాల ఆరోపణలపైనా అమెరికా చట్టసభ్యుల పలు కమిటీలు విచారణ జరపనున్నాయి.
మరోవైపు, అమెరికా మార్కెట్లు ముగిసిన తర్వాత ఎన్విడియా త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. ఈ సందర్భంగా సంస్థ తాత్కాలిక సీఈఓ కొలెట్ క్రెస్.. హువాంగ్ వ్యవహారంపై స్పందించే అవకాశం ఉంది. ఏఐ రంగం అభివృద్ధిలో హువాంగ్ కీలక పాత్రను పలువురు టెక్ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఆయనను తిరిగి సీఈఓగా నియమించాలంటూ ఆన్‌లైన్‌లో పిటిషన్ సైతం ప్రారంభమైంది.
అయితే, హువాంగ్ పునర్నియామకంపై అందరిలోనూ ఏకాభిప్రాయం కనిపించడం లేదు. ఎన్విడియాలో భారీ వాటా కలిగిన పెట్టుబడిదారు బ్రాడ్ గెర్స్ట్నర్ సైతం బోర్డు విచారణ పూర్తయ్యాకే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ‘‘బోర్డును హువాంగ్ తప్పుదోవ పట్టించారా లేదా అన్నది తెలియదు. చట్టానికి ఎవరూ అతీతులు కారు’’ అని వ్యాఖ్యానించారు. దీంతో హువాంగ్ తిరిగి ఎన్విడియా పగ్గాలు చేపడతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: విప్లవ ఆశలున్నా దారి తెలీని నక్సల్బరీ


