నేను పోగొట్టుకున్నది సీఈవో పదవిని మాత్రమే! | Jensen Huang Rayani Diary by Madhav Singaraju | Sakshi
Sakshi News home page

జెన్సన్‌ హువాంగ్‌ (బిలియనీర్‌) రాయని డైరీ

Nov 16 2026 1:15 PM | Updated on Nov 16 2026 2:19 PM

Jensen Huang Rayani Diary by Madhav Singaraju

మాధవ్‌ శింగరాజు

సర్వస్వం కోల్పోవటం అంటే, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఒక్కరిగా, ఒంటరిగా ఎవరికీ కాకుండా మిగిలిపోవటమే కదా?!

దేవుడా, అలాగైతే నేనేమీ నా సర్వస్వాన్ని కోల్పోలేదు! నేను పోగొట్టుకున్నది సీఈవో పదవిని మాత్రమే. బోర్డు సభ్యత్వాన్ని మాత్రమే. 840 కోట్ల డాలర్లను మాత్రమే.

నా కుటుంబం నాకింకా తోడుగానే ఉంది. ‘‘నాన్న ఎందుకు ఇలా చేశారు!’’ అని ఆవేదన చెందే వయసులో నా పిల్లలిద్దరూ లేరు.

‘‘నా భర్త ఇలా ఎందుకు చేశాడు?’’ అని కుమిలిపోయే స్థితిలో నా భార్య లేదు.
నా కూతురు మాడిసన్, ‘ఎన్విడియా’లోనే ‘ఫిజికల్‌ ఏఐ ప్లాట్‌ఫామ్స్‌’ విభాగానికి సీనియర్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌. మయామిలోని

‘మాండరిన్‌ ఓరియెంటల్‌ హోటల్‌’లో సీనియర్‌ షెఫ్‌గా చేసి వచ్చింది.
విలువలను మీద ఒలకపోసుకుని మరీ, మానవులు కొత్త రుచులకు కళ్లను నాలుకలా చాచటానికి వారిలోని చాపల్యమే కారణం అయి ఉండాల్సిన అవసరం లేదనీ, అరుదుగా హృదయం కూడా వారిని అర్రులు చాచేలా చేస్తుందనీ తను చక్కగా అర్థం చేసుకోగలదు.

నిన్నటి వరకు నేను ట్రిలియన్‌ డాలర్ల ‘ఎన్విడియా’ సామ్రాజ్యానికి చక్రవర్తిని! ఇప్పుడా కిరీటాన్ని తీసి పక్కన పెట్టేసి, శాంటా క్లారాలోని ప్రధాన కార్యాలయం నుండి మౌనంగా బయటికి నడిచాను.

స్పెన్సర్‌ నా కుమారుడు. ఎన్విడియా రోబోటిక్స్‌ విభాగంలో ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌. నా నిష్క్రమణ క్షణాలలో నా పక్కనే ఉన్నాడు. నేను కారు ఎక్కబోతున్నప్పుడు నా భుజం మీద చెయ్యి వేశాడు! హఠాత్తుగా నాకు స్నేహితుడయ్యాడు! ‘‘రాత్రికి ఇంట్లో డిన్నర్‌కి కలుద్దాం నాన్నా...’’ అని వీడ్కోలు చెప్పాడు.

స్పెన్సర్, తైవాన్‌లో కాక్‌టెయిల్‌ బార్‌ నడిపి వచ్చినవాడు. కాక్‌టెయిల్‌ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా నిషేధాల నడుమ మనసుల అన్వేషణ సాగుతూనే ఉంటుందని ఎరిగినవాడు.

కాక్‌టెయిల్, డిన్నర్‌ ముందర ఆకలిని రాజేస్తుంది. డిన్నర్‌ తర్వాత త్వరగా ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. మనసును, శరీరాన్ని తేలిక పరుస్తుంది. అదే గుణం ‘ఆలిస్‌’లో ఉంది!
‘కింబర్లీ’లోనూ ఉంది!  

ఆలిస్‌ చైనీస్‌ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్, ఇన్వెస్టర్‌. తైవాన్‌ టెక్‌ సదస్సులో పరిచయం. కింబర్లీ ఎన్విడియాలో నా సహోద్యోగిని. హెల్త్‌కేర్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌.

సాయంత్రమైంది.
డిన్నర్‌కు ముందు, నా భార్య లోరీనే స్వయంగా నాకు కాక్‌టెయిల్‌ సర్వ్‌ చేసింది! నా కుమారుడే స్వయంగా ఆ కాక్‌టెయిల్‌ను తయారు చేశాడు. నా కూతురు... నా వైపు, తన తల్లి వైపు మార్చి మార్చి చూస్తోంది.

ఇదీ చ‌ద‌వండి: యోగి ఆదిత్యనాథ్‌ (యూపీ సీఎం) - రాయని డైరీ

ఒరెగాన్‌  స్టేట్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడు నేను, లోరీ తొలిసారి ‘ల్యాబ్‌ పార్ట్‌నర్స్‌’గా కలుసుకున్నాం. క్లాస్‌లోని 250 మంది అబ్బాయిల్లో ముగ్గురే అమ్మాయిలు. ఆ ముగ్గురిలో లోరీ ఒకరు.
‘‘నాతో కలిసి హోమ్‌వర్క్‌ చేస్తే నీకు మంచి మార్కులు వస్తాయి’’ అని ఒకరోజు లోరీతో అన్నాను. మార్కుల కోసం తను, తన కోసం నేను... ప్రతి ఆదివారం కలిసేవాళ్లం.

40 ఏళ్ల తర్వాత, భార్యగా లోరీ నాకు వేయబోయే మార్కుల కోసం నేనిప్పుడు డైనింగ్‌ టేబుల్‌ ముందు నిరీక్షిస్తూ కూర్చున్నాను.

ఫెయిల్‌ అయిన విద్యార్థి, టీచర్‌ నాలుగు మార్కులు కలిపి పాస్‌ చేయకపోతుందా అనే ఆశతో ఎదురుచూస్తున్నట్లుగా ఉన్నాన్నేను. నాలుగు కాదు, నలభై మార్కులు కలిపినా పాస్‌ అవగలనా?
లోరీ వైపు చూశాను.

తను మౌనంగా ఉంది. ప్రశాంతంగా కనిపిస్తోంది.
వేడి ఆవిర్లు రేగుతున్న పాత్రను ముందుకు జరుపుతూ, ‘‘మీకెంతో ఇష్టమైన ‘ఝజియాంగ్మియన్‌’ వడ్డించమంటారా?’’ అని అడుగుతోంది! 
వేయించిన సాస్‌ నూడుల్స్‌ అవి. 
చైనీస్‌ స్పెషల్‌! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement