యాంటీబయాటిక్స్ ప్రాణరక్షక ఔషధాలు. ఇవి నాగరికత సాధించిన విజయాలుగా మానవాళి చరిత్రలో నిలిచాయి. అయితే, ‘ఔషధ నిరోధకత’ ముదిరి పోవటంతో నేడు తమ శక్తిని కోల్పోతున్నాయి. బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు (ఫంగస్), పరాన్న జీవులను నాశనం చేసే మందులే యాంటీబయాటిక్స్. వీటికి సూక్ష్మ క్రిములు లొంగకుండా నిరోధకతను పెంచుకోవటాన్నే ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’ (ఏఎంఆర్) లేదా ‘ఔషధ నిరోధకత’ అంటారు. దీనివల్ల సాధారణ ఇన్ఫెక్షన్లకు కూడా చికిత్స చేయటం కష్టంగా లేదా అసాధ్యంగా మారుతోంది.
ఈ పెనుముప్పుపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా నవంబర్ 18 నుంచి 24 వరకు ప్రపంచ ఏఎంఆర్ అవగాహన వారోత్సవం జరగనుంది. 2026 సంవత్సరానికిగాను ‘ఒకే ఆరోగ్యం, ఒకే చర్య: ఏఎంఆర్‌ను ఇప్పుడే నివారిద్దాం’ అనే నినాదంతో ఐక్యరాజ్య సమితికి చెందిన 4 అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో ఈ ప్రచారం సాగుతోంది. ఐరాస ఆహార– వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరాస పర్యావరణ కార్యక్రమం, ప్రపంచ పశుఆరోగ్య సంస్థలు ఉమ్మడిగా ప్రచారోద్యమం చేపట్టాయి. (antimicrobial resistance week)
ఏటా 47 లక్షల మరణాలు
ఏఎంఆర్ అనేది భవిష్యత్తులో రాబోయే సవాలు కాదు, అది ఇప్పటికే ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న పెను ప్రమాదం. బ్యాక్టీరియా సంబంధిత ఏఎంఆర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 47 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే, 2050 నాటికి ఈ మరణాల సంఖ్య 3.9 కోట్లకు చేరే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా 3.4 లక్షల కోట్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా మన భారత్ వంటి అల్ప–మధ్యాదాయ దేశాలపై ఏఎంఆర్ విసిరే పంజా అత్యంత తీవ్రంగా ఉండనుంది. మను షులు, జంతువులు, మొక్కలు, పర్యావరణం– ఈ నాలుగింటి ఆరోగ్యం ఒకదానితో ఒకటి విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. అందుకనే ‘ఒకే ఆరోగ్యం’ (వన్ హెల్త్) దృక్పథంతో అకుంఠిత దీక్షతో కార్యాచరణ తీసుకుంటేనే ఏఎంఆర్ మహమ్మారిని ఎదుర్కోగలం. ఐరాస సంస్థల ఆధ్యర్యంలో 2026–2036 నూతన ప్రపంచ కార్యాచరణ ప్రణాళిక కూడా ఇదే లక్ష్యంతో సాగుతోంది.
ఎవరేం చేయాలి?
విధాన నిర్ణేతలు, ప్రభుత్వాలు ఏఎంఆర్ కట్టడిలో కీలక పాత్ర పోషించాలి. ప్రాణరక్షక ఔషధాల అందుబాటును మెరుగుపరు స్తూనే, వాటి దుర్వినియోగాన్ని అరికట్టే కఠిన నిబంధనలు అమలు చేయాలి. తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత సదుపాయాలను బలోపేతం చేయటం ద్వారా ఇన్ఫెక్షన్లు రాకముందే నివారించాలి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సిన్ల పరిశోధన, వినియోగాన్ని ప్రోత్సహించాలి. అలాగే ఔషధ వ్యర్థాలు, నిరోధక సూక్ష్మజీవుల వల్ల పర్యా వరణ కాలుష్యం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఇక ప్రజలు యాంటీబయాటిక్స్‌ను బాధ్యతాయుతంగా వినియోగించాలి. వైద్యుల సూచన లేకుండా సొంతంగా యాంటీబయాటిక్స్ వాడటం పూర్తిగా మానుకోవాలి. పోషక లోపం లేకుండా పౌష్టికాహారం తీసుకోవటం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించటం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలి.
ఇదీ చదవండి: అర్థాంతరంగా ముగిసిన అమ్మ జీవితం
ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయ వ్యవస్థల రూపకల్పనలో రైతుల పాత్ర వెలకట్టలేనిది. వ్యవసాయ, ఆహార రంగాల్లో యాంటీ మైక్రోబయల్స్ వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని ప్రపంచ ఏఎంఆర్ కార్యాచరణ ప్రణాళిక పిలుపునిస్తోంది. పశువులు, కోళ్ల పెంపకం... చేపలు, రొయ్యల సాగులో... పంటలు, తోటల సాగులో యాంటీబయాటిక్స్ విచక్షణారహితంగా వాడకూడదు. పశువులకు సకాలంలో టీకాలు వేయించటం, పరిశుభ్రమైన వాతావరణంలో పెంచటం ద్వారా వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వంటి సుస్థిర ఆహారోత్పత్తి పద్ధతులను అవలంబించటం ద్వారా మనుషుల ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చు.
ఎత్నో వెటర్నరీ పద్ధతులు
యునానీ ఆధారిత సంప్రదాయ పశువైద్య (ఎత్నోవెటరినరీ మెథడ్స్–ఈవీఎం) పద్ధతులు ఏఎంఆర్‌ను అరికట్టేందుకు ఒక ఆశా కిరణంగా కనిపిస్తున్నాయి. వీటిని బెంగళూరులోని ట్రాన్స్–డిసిప్లినరీ యూనివర్సిటీ (టీడీయూ), జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్‌డీడీబీ) సంయుక్తంగా పరిశోధనలు చేసి, వాటి ప్రయోజకత్వాన్ని చాటుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది రైతులు ఈ విధానాలను పాటిస్తుండగా, 80 శాతానికి పైగా పశువ్యాధులు నయమవుతున్నాయి. పొదుగు వాపునకు పసుపు–కలబంద–సున్నం పూత వంటి రైతు స్థాయిలో చేయదగిన ఈ చికిత్సల వల్ల యాంటీ బయాటిక్స్ వినియోగం భారీగా తగ్గినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పాడి ఉత్పత్తుల్లో ఔషధ అవశేషాలు ఆ మేరకు తగ్గుతున్నాయి.
– పంతంగి రాంబాబు ‘ సీనియర్ జర్నలిస్ట్
నవంబర్ 18 నుంచి 24 వరకు ప్రపంచ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవం


