ఏఐ యుగంలో 'ఎవరు రచయిత'? | Artificial intelligence is also becoming a partner in the story making process | Sakshi
Sakshi News home page

ఏఐ యుగంలో 'ఎవరు రచయిత'?

Nov 16 2026 2:27 AM | Updated on Nov 16 2026 2:27 AM

Artificial intelligence is also becoming a partner in the story making process

ఒక కథ చదివినప్పుడు దాని వెనుక ఒక మనిషి అనుభవమూ, పరిశీలనా, ఊహా, భాషా శ్రమా ఉన్నాయని నమ్ముతాం. రచయిత తన కాలాన్నీ, సమాజాన్నీ, తన లోని సంఘర్షణలనూ పదాల్లోకి మారుస్తాడు. ఇప్పుడు కృత్రిమ మేధ కొన్ని క్షణాల్లోనే కథల్నీ, కవి తల్నీ, వ్యాసాల్నీ రాసేస్తోంది. ముద్రణాయంత్రాలొచ్చినప్పుడు పుస్తక సంస్కృతి మారింది. రేడియో, సినిమా, టెలివిజన్ వచ్చినప్పుడుకథ చెప్పే పద్ధతులు విస్తరించాయి. అవి కథను అందించే మాధ్య మాల్ని మార్చగా, కృత్రిమమేధ కథను రూపొందించే ప్రక్రియలోనూ భాగస్వామ్యమవుతోంది. అది రచయిత ఆలోచనకు తోడ్పడుతోందా, లేక ఆలోచనకు ప్రత్యామ్నాయంగా మారుతోందా అన్నదే ప్రశ్న.

మూస ప్రమాదం
కృత్రిమ మేధ భాషా నమూనాలు విస్తారమైన పాఠ్యసమాహా రాల్లోని నమూనాల్ని నేర్చుకొని, ఇచ్చిన సూచనలకు తగ్గ పదాల క్రమాన్ని రూపొందిస్తాయి. అవి మనుషుల్లా బాల్యాన్ని గడపవు; కుల, లింగ వివక్షల్ని అనుభవించవు; ఆకలీ, వలసా, ప్రేమా, యుద్ధమూ, శ్రమల శారీరక అనుభూతులనూ కలిగి ఉండవు. అయినా ఆ అనుభవాల గురించి నమ్మదగినట్టుగా రాయగలవు. ఒక దళిత యువతి అవమానాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆమెలో కలిగేసంఘర్షణనో, ఒక రైతు భూమి కోల్పోయినప్పుడు అతని ప్రపంచం తలకిందులయ్యే తీరునో చిత్రించడానికి సమాచారమొక్కటే సరి పోదు. ఏఐ ఒక దళిత పాత్రను చిత్రించేటప్పుడు తరచూ బాధను తగ్గించి, వ్యక్తిగత సంఘర్షణను మూసలో పెట్టే ప్రమాదముంది.

గురజాడ అప్పారావు వాడుక భాషను సాహిత్యంలోకి తీసుకు రావడంలో సమాజాన్ని చూసే దృష్టినే మార్చగా, శ్రీశ్రీ కవిత్వంలో శ్రమజీవి ప్రస్తావన కవిత్వ కేంద్రాన్నే మార్చింది. చలం రచనల్లో స్త్రీ అంతరంగానికిచ్చిన స్థానం అప్పటి సామాజిక నైతికతను ప్రశ్నిస్తే, గోగు శ్యామల లాంటి రచయిత్రుల రచనలు అణగారిన స్త్రీల అను భవాలకు సొంత స్వరాన్నిచ్చాయి. కృత్రిమ మేధ వీరి శైలిని పోలిన వాక్యాల్ని తయారుచేయగలదేమో కానీ, వారు చేసిన చారిత్రక జోక్యాన్ని యాంత్రికంగా పునరావృతం చేయలేదు.

ఎంతవరకు ఏఐని వాడొచ్చు?  
అయితే రచయితలు తమ అనుభవాలనే ఎప్పుడూ రాస్తారను కోవడం పొరపాటే. వారు పరిశోధిస్తారు, చరిత్రను చదువుతారు, ఇతరుల జీవితాల్ని ఊహిస్తారు. తాను రాస్తున్న జీవితాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకున్నాడన్నదే ముఖ్యం. పాత్రను తన సిద్ధాంతానికి ఉదాహరణగా కుదించాడా, లేక దాని స్వతంత్రతను నిల బెట్టాడా? ఏఐ ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి, ప్రశ్నించి, తనసృజనాత్మక దృష్టితో మార్చాడా? లేక సిద్ధంగా ఉన్న వాక్యాల్నే తన పేరుతో ప్రచురించాడా? అన్నది గమనించాలి.

పాత పత్రాల్ని అక్షరరూపంలోకి మార్చడం, అరుదైన పదాలకు అర్థాల్ని వెతకడం, అనువాదానికి తొలి ముసాయిదాను తయారు చేయడం, వ్యాకరణ లోపాల్ని గుర్తించడం, రచన నిర్మాణంపై సూచనల్ని రాబట్టడం లాంటి పనుల్లో ఏఐ ఉపయోగపడుతుంది. కానీ అదిచ్చిన ఫలితాన్నే నిజమని నమ్మడం ప్రమాదకరం. అది మనుగడలో లేని పుస్తకాల్నీ, తప్పు తేదీల్నీ, కల్పిత ఉటంకింపులనూ నిజమైన ఆధారాల్లా చూపగలదు. సమాచారాన్ని ధ్రువీకరించాల్సిన బాధ్యత రచయితదే. 

ప్రధాన భాషలతో పోలిస్తే తెలుగులోని మాండలికాలూ,ప్రాంతీయ పదసంపదా, జానపద ప్రయోగాలూ, వృత్తిపదాలూ, అణగారిన సమూహాల భాషా రూపాలూ డిజిటల్‌ సమాచార వనరుల్లో సమానంగా నమోదు కాలేదు. తెలుగు సహా తొమ్మిది భారతీయ భాషల్లోని 38కిపైగా మాండలిక రూపాలకు సంబంధించిన ప్రసంగ సమాచారాన్ని సమీకరించిన ‘రెస్పిన్‌–ఎస్‌1.0’ పరిశోధన (న్యూరిప్స్, 2025) గతంలోని అనేక ప్రసంగ సమాచార వనరుల్లో ప్రామాణిక మాండలికాలకే ఎక్కువ ప్రాధాన్యం లభించిందని పేర్కొంది. తెలంగాణ మాండలిక పదాలను ‘సరిచేయడం’, ఆదివాసీ పదాలను విచిత్రంగా చూపడం, దళిత జీవితాన్ని మూస బద్ధంగా చిత్రించడం సాంకేతిక లోపమొక్కటే కాదు, భాషలోని అధికార సంబంధాల కొనసాగింపు కూడా.

2025లో ‘పీఎన్‌ఏఎస్‌’లో ప్రచురితమైన వీజియా షూ తదిత రుల (‘ఎకోస్‌ ఇన్‌ ఏఐ: క్వాంటిఫైయింగ్‌ లాక్‌ ఆఫ్‌ ప్లాట్‌ డైవర్సిటీ ఇన్‌ ఎల్‌ఎల్‌ఎమ్‌ ఔట్‌పుట్స్‌’) అధ్యయనం, జీపీటీ–4, లామా–3 నమూనాలతో రూపొందించిన కథలను పరిశీలించి, ఏఐ కథల్లో పదేపదే కథా వస్తువులు పునరావృతమవుతున్నాయనీ, పరిశీలించిన మానవ రచనల్లో కథా వైవిధ్యం ఎక్కువగా ఉందనీ చెప్పింది. అయితే ఈ అధ్యయనం 100 చిన్న కథల నమూనాలపై మాత్రమే ఆధారపడింది కాబట్టి దీన్ని అన్ని ఏఐ నమూనాలకూ, అన్ని రకాల రచనలకూ వర్తించే సార్వత్రిక నిర్ధారణగా చూడలేం.

హక్కులు ఎవరివి?
ఇక్కడ రచయితల మేధో సంపత్తి హక్కుల ప్రశ్నా కీలకమైనది. వారి అనుమతి లేకుండా రచనల్ని ఏఐ నమూనాల శిక్షణకు ఉపయో గిస్తున్నారా? అలా ఉపయోగించిన రచనల ఆధారంగా రూపొందిన విషయాలు మూల రచనల హక్కుల్నే ఉల్లంఘిస్తున్నాయా? ఏఐ ఇచ్చిన ఫలితాలపై హక్కులు ఎవరికి చెందాలి? రచయితల సృజ నాత్మక శ్రమకు తగిన గుర్తింపూ, ఆర్థిక ప్రతిఫలమూ వారికెలా దక్కాలి? కాపీరైట్‌ ఉన్న రచనలను శిక్షణకు ఉపయోగించడం, ఏఐ రూపొందించిన ఫలితం మూల రచనను అనుకరించడం, ఆ ఫలితంపై హక్కులు నిర్ణయించడం– ఈ మూడింటికీ ఒకే చట్టపరమైన సమాధానముండదు. 

‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ఓపెన్ ఏఐపై దావా వేసిన సందర్భంలో అనుమతి లేకుండా తన కథనాలను శిక్షణకు ఉపయోగించారని ఆరోపించింది. అయితే ఈ వివాదాల్లో ఆరోప ణలే తుది న్యాయనిర్ణయాలు కావు; ఏఐ శిక్షణకు కాపీరైట్‌ చట్టం ఎలా వర్తించాలన్నది ఇంకా న్యాయపరిశీలనలో ఉన్న ప్రశ్న. మన దేశంలోనూ రచనలు అనుమతి లేకుండా శిక్షణ సమాచారంలో చేరుతున్నాయనే ఆందోళనలున్నాయి. దీనికి స్పష్టమైన నిబంధ నలూ, పారదర్శక విధానాలూ అవసరం.

విమర్శకుల ముందూ కొత్త బాధ్యత ఉంది. రచనలో ఏఐ వాడారా లేదా అని అనుమానించడమే విమర్శ కాదు. భాషనూ, పాత్రల్నీ, అనుభవాన్నీ, నిర్మాణాన్నీ, ఆలోచనా లోతునూ పరిశీలించాలి. ప్రచురణ సంస్థలూ, పత్రికలూ, సాహిత్య పురస్కారసంఘాలూ ఏఐ వినియోగంపై స్పష్టమైన విధానాల్ని రూపొందించుకోవాలి. ఏఐ గుర్తింపు సాధనాలను తప్పులేనివిగా భావించ కుండా, ఆరోపణలపై విచారణకూ, రచయిత వివరణకూ అవకాశం కల్పించాలి.ఆథర్‌షిప్‌ అనేది ఒక రచనకు బాధ్యత వహించడమే కాదు, దాని ఆలోచననూ, ఎంపికలనూ, సృజనాత్మక నిర్ణయాలనూ తనవిగా స్వీకరించడం కూడా. రచయిత ఎవరనే ప్రశ్నకు సమా ధానం చివరికి ఇదే: సృజనాత్మక నిర్ణయాధికారంతో పాటు బాధ్యతనూ మోసే మనిషి.

కృత్రిమ మేధ కథను రూపొందించే ప్రక్రియలోనూ భాగస్వామి అవుతోంది. అది రచయిత ఆలోచనకు తోడ్పడుతోందా, లేక ఆలోచనకు ప్రత్యామ్నాయంగా మారుతోందా అన్నదే ప్రశ్న.

– బాలాజీ పోతుల ‘ విమర్శకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement