బోనకల్: ఇటలీలోని బోర్మియోలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు అంతర్జాతీయ స్కేటింగ్ యూనియన్ (ఐఎస్‌యూ) ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్ ప్రపంచ కప్–2 పోటీల్లో తాళ్లూరి నయనశ్రీ పతకాన్ని సాధించడంలో విఫలమైంది. అయితే తన గత రికార్డును ఆమె అధిగమించింది. ఈ పోటీల్లో 500 మీటర్ల ట్రాక్‌ను 47.104 సెకన్లలోనే పూర్తి చేసి తన టైమింగ్‌ను మెరుగుపర్చుకుంది.
ఇటీవలేే ఆమె ఇదే రేస్‌ను 47.144 సెకన్లలో ముగించింది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం మోటమర్రికి చెందిన నయనశ్రీ ప్రస్తుతం కెనడాలో యూజీ ద్వితీయ సంవత్సరం చదువుతూ అక్కడే కాల్గరీలో ఉన్నత స్థాయి శిక్షణ పొందుతోంది. ఇప్పటికే వచ్చే ఏడాది జనవరిలో కజకిస్తాన్‌లో జరిగే ప్రపంచ చాంంపియన్‌షిప్ టోర్నీకి అర్హత సాధించింది.


