ఆఖరి బంతికి టీమిండియాను గెలిపించాడు.. ఎవరీ మోహిత్‌ ఉల్వా? | Who Is Mohit Ulva? India U19 Star Who Smashed 49 Off 26 To Clinch Last-Ball Win vs Pakistan U19 | Sakshi
Sakshi News home page

IND vs PAK: ఆఖరి బంతికి టీమిండియాను గెలిపించాడు.. ఎవరీ మోహిత్‌ ఉల్వా?

Nov 14 2026 8:22 PM | Updated on Nov 14 2026 8:28 PM

Who Is Mohit Ulva? India U19 Star Who Smashed 49 Off 26 To Clinch Last-Ball Win vs Pakistan U19

అండర్-19 ఆసియా కప్ 2026 ఛాంపియన్స్‌గా భారత జట్టు అవతరించింది. శనివారం దోహా వేదికగా జరిగిన ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌ను ఒక్క వికెట్ తేడాతో ఓడించిన యంగ్ ఇండియా.. తొమ్మిదోసారి ఆసియాకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఈ రికార్డు విజయంలో  18 ఏళ్ల యువ ఆటగాడు మోహిత్ ఉల్వాది కీలక పాత్ర. తొలుత బౌలింగ్‌లో విఫలమైనప్పటకి బ్యాటింగ్‌లో మాత్రం ఉల్వా ఇరగదీశాడు. పదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి తన సంచలన ఇన్నింగ్స్‌తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.

మలుపు తిప్పిన భాగస్వామ్యం
338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. విజయానికి 52 బంతుల్లో 86 పరుగులు అవసరమైన దశలో మనల్ చౌహాన్‌తో జతకట్టిన మోహిత్ ఉల్వా పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.

188.46 స్ట్రైక్ రేట్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఉల్వా.. మనల్ చౌహాన్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆఖరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. ఉల్వా ఫోర్ బాది జట్టును విజేతగా నిలిపాడు. దీంతో అతడి పేరు ఒక్కసారిగా మారుమోగిపోతోంది. ఎవరీ మోహిత్ ఉల్వా అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

ఎవరీ మోహిత్ ఉల్వా?
18 ఏళ్ల మోహిత్ ఉల్వా.. 2007 నవంబర్ 30న గుజరాత్‌లోని సౌరాష్ట్రలో జన్మించాడు. అతడి తండ్రి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పనిచేస్తున్నాడు. అయితే  మోహిత్‌కి చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కవ.  అతడి తండ్రి తన కుమారుడిలోని ప్రతిభను గుర్తించి అకాడమీలో చేరి పూర్తిస్థాయి శిక్షణ తీసుకోవాలని ప్రోత్సహించాడు. 

దీంతో టెన్నిస్ బాల్ క్రికెట్‌తో ప్రస్థానాన్ని ప్రారంభించిన మోహిత్‌.. ఆ తర్వాత  సౌరాష్ట్ర ఏజ్-గ్రూప్ క్రికెట్‌లో స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు. అతడు జామ్‌నగర్‌లోని క్రికెట్ బంగ్లా అకాడమీలో మహేంద్రసింగ్ చౌహాన్ వద్ద ఉల్వా శిక్షణ పొందాడు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా చిన్నతనంలో మహేంద్రసింగ్ చౌహానే కోచ్‌గా వ్యవహరించడం విశేషం. ఉల్వాకు మీడియా పేస్ బౌలింగ్‌తో బ్యాటింగ్ చేసే సత్తా ఉంది.

ఆఫ్-స్పిన్నర్ నుండి ఫాస్ట్ బౌలర్‌గా
అయితే ఉల్వా తన క్రికెట్ ప్రస్థానాన్ని ఫాస్ట్ బౌలర్‌గా ప్రారంభించలేదు. మొదట్లో అతను ఆఫ్-స్పిన్నర్‌గా శిక్షణ పొందాడు. అయితే అతడిలోనే ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్‌ను కోచ్ మహేంద్రసింగ్ చౌహాన్ గుర్తించాడు. ఉల్వాకు ఉన్న సన్నని శరీర ఆకృతి, వేగంగా పరుగెత్తగల సామర్థ్యాన్ని గమనించిన చౌహాన్.. అతన్ని ఫాస్ట్ బౌలింగ్ ప్రయత్నించమని సూచించారు. కోచ్ ఇచ్చిన ఆ సలహా ఉల్వాను ఒక అత్యుత్తమ రైట్ ఆర్మ్‌ మీడియం పేసర్‌గా తీర్చిదిద్దింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement