కోహ్లితో సిరాజ్ (PC: BCCI X)
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా వన్డే జట్టుతో ఉన్న టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కివీస్-‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆడిన ఈ హైదరాబాదీని వన్డేల నుంచి పూర్తిగా పక్కనపెట్టేశారు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత జట్టు తొలి రెండు గెలవగా.. మూడో వన్డే వర్షం వల్ల రద్దైపోయింది.
ఘోర ఓటమి
ఇక శుక్రవారం మౌంట్ మౌంగనూయ్ వేదికగా నాలుగో వన్డేలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. కివీస్ చేతిలో ఏకంగా 244 పరుగుల తేడాతో మట్టికరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. సిరాజ్‌ను ఎందుకు వన్డేల్లో ఆడించడం లేదని ప్రశ్నించాడు.
ఒక్క మ్యాచ్‌లోనూ ఎందుకు ఆడించలేదు?
ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ మహ్మద్ సిరాజ్‌ను ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. దీని గురించి నేనొక పిటిషన్ వేస్తా. అసలు సిరాజ్ చేసిన తప్పేంటి?.. అతడిని ఎందుకు ఆడించడం లేదు.
ఒకవేళ టీమిండియా యాజమాన్యంలో కోచ్ లేదంటే కెప్టెన్ ఎవరైనా నా మాటలు విన్నట్లయితే.. దయచేసి ఇందుకు కారణం చెప్పండి. తొలి మూడు వన్డేలకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్. మిగిలిన రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్.
కెప్టెన్ మారినా సిరాజ్ రాత మాత్రం మారడం లేదు. అన్షుల్ కాంబోజ్‌ను టెస్టులకు సన్నద్ధమయ్యేందుకు పంపించారు. సిరాజ్‌ను మాత్రం ఇక్కడే బెంచ్ మీద ఉంచుతున్నారు. ఒకవేళ టెస్టుల్లో సిరాజ్ సేవలను వాడుకోవాలని భావిస్తే.. అతడిని వన్డే జట్టు నుంచి విడుదల చేయవచ్చు కదా!
డ్రింక్స్ మోస్తూ టెస్టులకు సన్నద్ధం అవుతాడా?
డ్రింక్స్ మోయించడం ద్వారా టెస్టులకు సన్నద్ధం చేయలేరు. సిరాజ్ విషయంలో మేనేజ్‌మెంట్ ఆలోచన ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. గత 35 నెలల్లో అతడిని కేవలం పది మ్యాచ్‌లలో మాత్రమే ఆడించారంటే అర్థం ఏమిటి?
24 నెలల్లో ఏడు, గత పన్నెండు నెలల్లో నాలుగు.. ఇలా ఆడించాలని రూల్ ఏమైనా పెట్టుకున్నారా? అతడికి ఆడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు’’ అని ఆకాశ్ చోప్రా టీమిండియా యాజమాన్యంపై ఫైర్ అయ్యాడు. కాగా సిరాజ్ చివరగా గత నెల (అక్టోబరు)లో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడాడు.
ఇవీ చదవండి: అవకాశం ఇచ్చినా ఫెయిల్ అయ్యాడు.. ఇలా అయితే కష్టం: గంభీర్
పృథ్వీ షా ఫర్వాలేదనిపించినా.. తప్పని ఓటమి


