పృథ్వీ షా (పాత ఫొటో PC: BCCI/X)
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026 సీజన్ శనివారం ఆరంభమైంది. ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా మహారాష్ట్ర జట్టు తమ తొలి మ్యాచ్‌లో పుదుచ్చేరితో తలపడింది. మొహాలీ వేదికగా టాస్ గెలిచిన మహారాష్ట్ర కెప్టెన్ పృథ్వీ షా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఆకాశ్ ఆకాశమే హద్దుగా
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పుదుచ్చేరి నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 204 పరుగుల మేర మంచి స్కోరు సాధించింది. ఓపెనర్ భాను ఆనంద్ (27 బంతుల్లో 46), మిడిలార్డర్‌లో పరమేశ్వరన్ శివరామన్ (21 బంతుల్లో 46) రాణించారు.
ఇక వన్‌డౌన్ బ్యాటర్ పుగలేంది ఆకాశ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 14 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 300 స్ట్రైక్‌రేటుతో 42 పరుగులు సాధించాడు. అతడికి తోడు శశాంక్ సింగ్ (20), సాగర్ త్రివేది (21) ఫర్వాలేదనిపించారు. మహారాష్ట్ర బౌలర్లలో ముకేశ్ చౌదరి, విక్కీ ఓస్త్వాల్, ప్రశాంత్ సోలంకి తలా రెండు వికెట్లు తీయగా.. తనయ్ సంఘ్వీ ఒక వికెట్ పడగొట్టాడు.
పృథ్వీ షా ఫర్వాలేదనిపించినా
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి కేవలం 189 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా పుదుచ్చేరి చేతిలో పదిహేను పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓపెనర్లు కెప్టెన్ పృథ్వీ షా (25 బంతుల్లో 32), అర్షిణ్ కులకర్ణి (18 బంతుల్లో 33) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాహిల్ పరేఖ్ మెరుపు అర్ధ శతకం (29 బంతుల్లో 57)తో రాణించాడు.
రాహుల్ త్రిపాఠి (27 బంతుల్లో 35 నాటౌట్) పోరాడే ప్రయత్నం చేయగా.. మిగిలిన వారి నుంచి అతడికి సహకారం అందలేదు. దీంతో మహారాష్ట్ర జట్టుకు ఓటమి తప్పలేదు. పుదుచ్చేరి బౌలర్లలో బాదల్ రావత్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రాఘవ్ గోయల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇవీ చదవండి: కెప్టెన్సీ డెబ్యూలో వైభవ్ విఫలం
విధ్వంసం సృష్టించిన టీమిండియా మాజీ కెప్టెన్


