అమెరికా: ఎయిర్‌ ట్రాఫిక్‌ సిస్టమ్‌ క్రాష్‌.. నిలిచిపోయిన వైమానిక సేవలు | America halts all flights across us | Sakshi
Sakshi News home page

అమెరికా: ఎయిర్‌ ట్రాఫిక్‌ సిస్టమ్‌ క్రాష్‌.. నిలిచిపోయిన వైమానిక సేవలు

Nov 14 2026 6:33 AM | Updated on Nov 14 2026 6:45 AM

America halts all flights across us

వాషింగ్టన్‌: అమెరికాలో విమానయాన సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. భద్రతా కారణాలతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రాంతీయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బోస్టన్ సహా పలు విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఎఫ్‌ఏఏ జారీ చేసిన అధికారిక నోటీసు ప్రకారం.. అసాధారణ పరిస్థితులు, భద్రతా కారణాలతో ఈ గ్రౌండ్ స్టాప్ విధించారు. అప్పటికే గాల్లో ఉన్న విమానాలకు మాత్రం ల్యాండింగ్‌కు అనుమతించారు. మిగిలిన విమానాల రాకపోకలను నిలిపివేశారు.

22 కేంద్రాల్లో కమ్యూనికేషన్ సమస్య
అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 22 ప్రాంతీయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ సమస్య తలెత్తింది. ఈ కేంద్రాలు వివిధ విమానాశ్రయాల మధ్య ప్రయాణించే విమానాలకు దిశానిర్దేశం చేస్తుంటాయి. సమస్యకు కారణాలను గుర్తించేందుకు ఎఫ్‌ఏఏ సాంకేతిక నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు.

టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం
సీబీసీ న్యూస్ కథనం ప్రకారం.. విమానాల నిలిపివేతకు ప్రధాన కారణం విఫలమైన సాంకేతిక అప్‌డేట్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాలను అనుసంధానించే నెట్‌వర్క్‌ను నిర్వహించే L3Harris సంస్థ వ్యవస్థలో అప్‌డేట్ చేశారు. దీంతో ఎఫ్‌ఏఏ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ రీబూట్ కావాల్సి వచ్చింది. అయితే తిరిగి ప్రారంభమైన వెంటనే అది క్రాష్ కావడంతో దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది.

ట్రంప్‌కు సమాచారం
ఈ పరిణామాలపై అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు స్పందించారు. కమ్యూనికేషన్ వ్యవస్థలో వైఫల్యం కారణంగానే విమానాలపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పరిస్థితిని వివరించినట్లు డీహెచ్‌ఎస్‌ కార్యదర్శి మార్క్‌వేన్ ముల్లిన్ వెల్లడించారు.

2023 తర్వాత తొలిసారి
అమెరికాలో దేశవ్యాప్తంగా అన్ని విమానాలను ఒకేసారి నిలిపివేయడం అరుదైన పరిణామం. 2023 జనవరిలో ఎఫ్‌ఏఏ ప్రధాన కంప్యూటర్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 11, 2001 ఉగ్రదాడుల తర్వాత కూడా అమెరికాలో పూర్తిస్థాయిలో విమాన రాకపోకలను నిలిపివేశారు.

ఆధునికీకరణకు మరో 30 బిలియన్ డాలర్లు
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో పాత సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్చేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఏడాది ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్ 12.5 బిలియన్ డాలర్లు కేటాయించింది. ఇందులో భాగంగా పాత రాగి తీగల స్థానంలో ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రయాల్లో పాత రేడియో వ్యవస్థలను కూడా మారుస్తున్నారు. అయితే ఈ ఆధునికీకరణను పూర్తిచేయడానికి మరో 30 బిలియన్ డాలర్లు అవసరమని రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ తెలిపారు. ఇందుకోసం కాంగ్రెస్ ఆమోదం పొందేందుకు వైట్‌హౌస్ ప్రయత్నిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement