వాషింగ్టన్: ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం అమెరికాకు లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనం ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్న ఆయన.. ఇకపై ఇరాన్‌తో చర్చల కంటే అమెరికాలోని అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఆదేశించారు. ముఖ్యంగా డెమొక్రాట్ల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో అవినీతి, నేరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.
గురువారం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్.. ఇరాన్‌తో మాకు ఎలాంటి ఒప్పందం అవసరం లేదు. ఆ రోజులు ఎప్పుడో ముగిశాయి. వారి వందల బిలియన్ల డాలర్ల డబ్బు మా చేతుల్లో ఉంది. హార్ముజ్ జలసంధి కూడా మా ఆధీనంలో ఉంది’ అంటూ ఆయన పేర్కొన్నారు.
వాన్స్‌కు ట్రంప్ కీలక ఆదేశాలు
ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలకు నాయకత్వం వహిస్తున్న జేడీ వాన్స్‌కు ట్రంప్ తాజాగా కొత్త బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ వ్యవహారాలపై దృష్టి సారిస్తున్న వాన్స్ తన పూర్తి సమయాన్ని ఇకపై డెమొక్రాట్ల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో నేరాలు, అవినీతిపై చర్యలకు కేటాయించాలని ట్రంప్ సూచించారు. మిన్నెసోటా, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ వంటి రాష్ట్రాలను ప్రస్తావిస్తూ అక్కడి ప్రభుత్వాలు సరిగా పనిచేయడం లేదని, ప్రతి నెలా బిలియన్ల డాలర్ల ప్రజాధనం అక్రమంగా మళ్లించబడుతోందని ఆరోపించారు. ఈ అక్రమాలను అరికట్టి, దుర్వినియోగమైన నిధులను తిరిగి రాబడితే అమెరికా ఫెడరల్ బడ్జెట్ లోటును తగ్గించేందుకు అవకాశం ఉంటుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఇరాన్‌పై దిగ్బంధనమే అస్త్రం!
ఇరాన్‌పై సైనిక చర్యలు, ఆర్థిక ఆంక్షల విషయంలో అమెరికా తన వ్యూహాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా సైన్యం నౌకాదళ దిగ్బంధనాన్ని అమలు చేస్తోంది. అంతర్జాతీయ నౌకాయానానికి కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పించే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. అమెరికా విధించిన ఆంక్షలు, దిగ్బంధనం వల్ల ఇరాన్‌పై ఒత్తిడి పెరిగిందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కొత్తగా సైనిక చర్యలకు దిగడం లేదా మరోసారి దౌత్య చర్చలను ప్రారంభించడం అవసరం లేదనే సంకేతాలను అమెరికా అధికార యంత్రాంగం ఇచ్చింది.
ఇదిలా ఉండగా, తమ హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రయాణించిన నాలుగు చమురు రవాణా నౌకలు పేలుళ్లకు గురయ్యాయని ఇరాన్ సైన్యం గురువారం వెల్లడించింది. హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం అంతర్జాతీయ చమురు రవాణాపై ఆందోళనలను పెంచుతోంది. మరోవైపు, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇరాన్‌తో ఒప్పందంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మంగళవారం పారిస్‌లో అమెరికా మిత్రదేశాలతో చర్చల అనంతరం మాట్లాడుతూ, ఇరాన్ ప్రతిపాదిస్తున్న డిమాండ్లు అసంబద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. యుద్ధానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ కోరుతోందని, అలాంటి ఒప్పందానికి ట్రంప్ అంగీకరించరని రూబియో పేర్కొన్నారు.
రిపబ్లికన్లకు రాజకీయ నష్టం?
ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడానికి ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడిన ఆర్థిక భారం కూడా ఒక కారణమని జేడీ వాన్స్ గతంలో వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని ముగించాలని తాను గతంలో ఇచ్చిన సలహా సరైనదేనని కూడా పేర్కొన్నారు. అయితే ట్రంప్ మాత్రం ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా నిరోధించేందుకు సైనిక చర్యలు అవసరమయ్యాయని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అయితే, తాజాగా వాన్స్‌కు దేశీయ రాజకీయ అంశాలపై దృష్టి పెట్టాలని ఆదేశించడం, ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా తదుపరి వ్యూహంపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇదీ చదవండి: ట్రంప్‌నకు భారీ షాకిచ్చిన పాక్


