ఎన్‌విడియా సీఈవోగా టిమ్ కుక్?! | Trump Pitches For Apple Tim Cook As Next Nvidia Boss | Sakshi
Sakshi News home page

ఎన్‌విడియా సీఈవోగా టిమ్ కుక్?!

Nov 12 2026 11:22 PM | Updated on Nov 12 2026 11:23 PM

Trump Pitches For Apple Tim Cook As Next Nvidia Boss

వాషింగ్టన్‌: అమెరికా టెక్ రంగంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఎన్‌విడియా  సీఈవో పదవి నుంచి జెన్సన్ హువాంగ్ అకస్మాత్తుగా తప్పుకోవడం టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.  ఎన్‌విడియా  కొత్త సీఈఓ బాధ్యతలను చేపట్టేందుకు ఒ​కే ఒక్క మగాడు ఉన్నాడని, యాపిల్ మాజీ సీఈఓ టిమ్ కుక్ ఆ స్థానానికి సరిగ్గా సరిపోతారని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక  ట్రూత్ సోషల్ ద్వారా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఎన్‌విడియా సీఈఓగా అద్భుతమైన సేవలు అందించిన జెన్సన్ హువాంగ్ తప్పుకున్న తరుణంలో, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే అర్హుడు.. ఆయనే యాపిల్ సంస్థకు చెందిన టిమ్ కుక్! అని ట్రంప్ రాసుకొచ్చారు. అంతేకాదు, ఒక లెజెండ్ స్థానంలోకి మరో లెజెండ్ రాబోతున్నారు! అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్‌విడియా  సహవ్యవస్థాపకుడు ఇప్పటివరకు టెక్ ప్రపంచాన్ని తన వ్యూహాలతో శాసించిన జెన్సన్ హువాంగ్ (63) తన సీఈఓ పదవితో పాటు ప్రెసిడెంట్, బోర్డు మెంబర్ పదవులకు కూడా ఆకస్మికంగా రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. చైనాకు చెందిన  వ్యాపారవేత్తతో ఆయనకు ఉన్న వ్యక్తిగత సంబంధాలు, ఆమె చైనా ప్రభుత్వానికి గూఢచారిగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి.  ఈ వివాదం వెలుగులోకి రావడం, ఎన్విడియా షేర్లు భారీగా పడిపోవడం వంటి పరిణామాల నడుమ ఆయన తప్పుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతానికి ఎన్‌విడియా  చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్  కొలెట్ క్రెస్  తాత్కాలిక సీఈవోగా  బాధ్యతలు నిర్వహిస్తారని కంపెనీ బోర్డు ప్రకటించింది. శాశ్వత సీఈవో  కోసం చర్చలు ప్రారంభించింది.  

సెప్టెంబరులో యాపిల్ సీఈవో పదవి నుంచి వైదొలిగి ప్రస్తుతం ఆ సంస్థ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్న టిమ్ కుక్‌ను ట్రంప్ తెరపైకి తేవడం గమనార్హం. గతంలో యాపిల్ ఉత్పత్తుల తయారీ విషయంలో ట్రంప్, టిమ్ కుక్‌ల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ.. ఇటీవలి కాలంలో వీరిద్దరి మధ్య సత్సంబంధాలు బలపడ్డాయి.

అమెరికాలోనే భారీ పెట్టుబడులు పెట్టేలా టిమ్ కుక్ తీసుకున్న నిర్ణయాలను ట్రంప్ పలుమార్లు ప్రశంసించారు. అయితే, ట్రంప్ ప్రకటనపై టిమ్ కుక్ ఇప్పటివరకు స్పందించలేదు.  ఆయన ప్రస్తుతం యాపిల్ బాధ్యతలతో పాటు ప్రపంచ పర్యటనలు, డెవలపర్లతో సమావేశాల్లో బిజీగా ఉన్నారు.

జెన్సన్ హువాంగ్ నిష్క్రమణతో కేవలం ఎన్‌విడియా  భవిష్యత్ మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఏఐ బూమ్‌పై కూడా అనిశ్చితిని ఎదుర్కొంటోంది. ఈ క్లిష్ట సమయంలో మదుపర్లలో నమ్మకాన్ని నిలబెట్టగల సమర్థుడైన నాయకుడు ఎన్‌విడియాకు ఎవరు ఎంపికవుతారో తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement