ట్రంప్‌నకు భారీ షాకిచ్చిన పాక్‌ | Trump Deportation Plan Hits Pakistan Roadblock Flight Turns Back | Sakshi
Sakshi News home page

ట్రంప్‌నకు భారీ షాకిచ్చిన పాక్‌

Nov 12 2026 9:12 AM | Updated on Nov 12 2026 9:19 AM

Trump Deportation Plan Hits Pakistan Roadblock Flight Turns Back

ఇస్లామాబాద్‌: అమెరికా నుంచి ఇరాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ వలసదారులను వారి స్వదేశాలకు పంపించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం కొత్త ప్లాన్‌ వేసింది. ఇందుకోసం పాకిస్థాన్‌ను మధ్యంతర రవాణా కేంద్రంగా ఉపయోగించుకోవాలని భావించింది. కానీ ఈ ప్రయత్నానికి అనూహ్యంగా బ్రేక్‌ పడింది. ఇరాన్‌ పౌరులతో అమెరికా నుంచి బయలుదేరిన విమానం అరగంటలోనే వెనక్కి వచ్చేసింది. పాకిస్థాన్‌ వారిని స్వీకరించేందుకు నిరాకరించడమే ఇందుకు కారణమని వార్తలు రావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

అమెరికాలో ఉంటున్న ఇరాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ వలసదారులను స్వదేశాలకు పంపించాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇరాన్‌తో అమెరికాకు దౌత్య సంబంధాలు లేకపోవడం, ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన ఉండటంతో నేరుగా పంపించడం కష్టంగా మారింది. దీంతో పాకిస్థాన్‌ను ట్రాన్సిట్‌ కేంద్రంగా ఉపయోగించుకోవాలని ప్రణాళిక రూపొందించింది.

అరగంటలోనే వెనక్కి వచ్చిన విమానం!
నవంబర్‌ 10న అరిజోనాలోని మెసా నుంచి ఇరాన్‌ పౌరులతో ఓ డిపోర్టేషన్‌ విమానం బయలుదేరింది. అయితే 30 నిమిషాల్లోనే తిరిగి అదే విమానాశ్రయానికి చేరుకుంది. పాకిస్థాన్‌ ప్రయాణికులను స్వీకరించేందుకు నిరాకరించడంతో విమానం వెనక్కి వచ్చినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. విమానంలో కనీసం తొమ్మిది మంది ఇరానీయులు ఉన్నట్లు సమాచారం. ఇది మూడు రోజుల్లో రెండో విఫల ప్రయత్నం. నవంబర్‌ 8న కూడా ఎనిమిది మంది ఇరానీయులను పాకిస్థాన్‌ మీదుగా పంపించే ప్రయత్నం చివరి నిమిషంలో రద్దయింది.

200 మంది ఆఫ్ఘన్లను పంపించే యోచన!
అమెరికాలో ఉన్న 150 నుంచి 200 మంది ఆఫ్ఘన్‌ పౌరులను పాకిస్థాన్‌ మీదుగా తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్థాన్‌కు పంపించాలని ట్రంప్‌ ప్రభుత్వం భావించినట్లు కథనాలు వెల్లడించాయి. అయితే వీరిలో గతంలో అమెరికా సైన్యానికి సహకరించినవారు కూడా ఉండటంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రయత్నాన్ని సవాల్‌ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో నవంబర్‌ 3న అమెరికా న్యాయస్థానం ఆఫ్ఘన్ల డిపోర్టేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.

పాకిస్థాన్‌ ఏమంటోంది?
అమెరికా ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు పాకిస్థాన్‌ అంగీకరించింది. అయితే తుది ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేసింది. ఇరాన్‌ వలసదారులకు 15 రోజుల ట్రాన్సిట్‌ వీసాలు జారీ చేసినట్లు అమెరికా కోర్టు పత్రాల్లో ప్రస్తావన ఉంది. దీనిపై పాక్‌ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. వలసదారులను బలవంతంగా స్వదేశాలకు పంపితే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని మానవ హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘన్లను తాలిబన్ల చేతుల్లోకి పంపడం ప్రమాదకరమని పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా.. అమెరికా కాంగ్రెస్‌కు చెందిన 66 మంది సభ్యులు కూడా ఈ ప్రణాళికను వ్యతిరేకించారు. వలసదారులను హింస, వేధింపులు లేదా ప్రాణాపాయ పరిస్థితుల్లోకి నెట్టే ప్రక్రియకు పాకిస్థాన్‌ సహకరిస్తే ఆ దేశ అధికారులపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతిపాదనకు పాకిస్థాన్‌ పూర్తిస్థాయిలో అంగీకరిస్తుందా? ఇరాన్‌, ఆఫ్ఘన్‌ వలసదారుల తరలింపు మళ్లీ మొదలవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. 

ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లో ఊహించని ట్విస్ట్‌.. ఒక్క రోజులో మాట మార్చిన నెతన్యాహు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement