జకార్తా: ఇండోనేషియా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉపాధ్యక్షుడు గిబ్రాన్ రకబుమింగ్ రాకా హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 11న అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు రాజీనామా లేఖ అందించినట్లు ఆయన సహాయకుడు బుడి ఆరీ వెల్లడించారు. అయితే రాజీనామాను అధ్యక్షుడు అధికారికంగా ఆమోదించారా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. గిబ్రాన్ విద్యార్హతలే ఈ పరిణామానికి ప్రధాన కారణంగా మారాయి. ఇండోనేషియా చట్టాల ప్రకారం ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే వ్యక్తి సీనియర్ సెకండరీ విద్య పూర్తి చేసి ఉండాలి. తాను సింగపూర్, ఆస్ట్రేలియాలో సమానమైన విద్యార్హతలు పొందినట్లు గిబ్రాన్ గతంలో పేర్కొన్నారు. అయితే విదేశీ విద్యార్హతలు ఇండోనేషియా హైస్కూల్ అర్హతకు సమానమని నిరూపించే ఆధారాలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతకుముందు రాజ్యాంగ న్యాయస్థానం కూడా ఇదే అంశంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
కోర్టు తీర్పులతో గిబ్రాన్‌పై ఒత్తిడి పెరిగింది. నవంబర్ 11న పార్లమెంట్‌లోని ఎనిమిది వర్గాలకు చెందిన 120 మంది సభ్యులు అభిశంసనకు దారితీసే అభిప్రాయ తీర్మానంపై సంతకాలు చేశారు. ఆయన రాజ్యాంగబద్ధంగా ఉపాధ్యక్షుడిగా కొనసాగేందుకు అర్హుడా కాదా అన్న ప్రశ్నలు తలెత్తాయి. మాజీ అధ్యక్షుడు జోకో విడోడో కుమారుడైన గిబ్రాన్.. 2024లో ప్రబోవోతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఉపాధ్యక్షుడయ్యారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రబోవో, జోకో వర్గాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. కొత్త రాజధాని నుసంతారా ప్రాజెక్టు, ప్రభుత్వంలో కీలక పదవుల మార్పులు ఈ విభేదాలకు కారణాలుగా చర్చకు వచ్చాయి.
ఉచిత పాఠశాల భోజన పథకానికి నిధుల కొరత, కార్చిచ్చులు, స్టాక్ మార్కెట్ అవకతవకల ఆరోపణలు ప్రబోవో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అవినీతి, పర్యావరణ సమస్యలపై విద్యార్థులు నిరసనలు కూడా చేపట్టారు. రాజీనామా అధికారికంగా ఆమోదం పొందిన తర్వాత ఇండోనేషియా పార్లమెంట్ పదవి ఖాళీని ప్రకటించాలి. అనంతరం అధ్యక్షుడు ఇద్దరు అభ్యర్థులను ప్రతిపాదిస్తారు. రాజ్యాంగం ప్రకారం 60 రోజుల్లోగా అసెంబ్లీ ఎన్నిక నిర్వహించి కొత్త ఉపాధ్యక్షుడిని ఎంపిక చేయాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: ట్రంప్ మిసిసిపీ కోట బద్దలు.. ఆశలు ఆవిరి!


