హెగ్‌సెథ్‌ అభిశంసన యత్నం విఫలం  | US House votes to derail impeachment of Defense Secretary Hegseth | Sakshi
Sakshi News home page

హెగ్‌సెథ్‌ అభిశంసన యత్నం విఫలం 

Nov 12 2026 5:46 AM | Updated on Nov 12 2026 5:46 AM

US House votes to derail impeachment of Defense Secretary Hegseth

సమర్థంగా అడ్డుకున్న రిపబ్లికన్‌ ప్రతినిధులు 

కమిటీకి పంపేందుకు 211 మంది మద్దతు 

హౌస్‌ నిర్ణయాన్ని స్వాగతించిన ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్‌ హెగ్‌సెథ్‌ అభిశంసన ప్రయత్నాన్ని అధికార రిపబ్లికన్లు సమర్థంగా అడ్డుకోగలిగారు. పార్లమెంటు అనుమతి లేకుండా హెగ్‌సెథ్‌ ఇరాన్‌పై యుద్ధానికి వెళ్లాడన్న ఆరోపణతో అతడిని అభిశంసించేందుకు రిపబ్లికన్‌ పార్టీకే చెందిన కెంటకీ ఎంపీ థామస్‌ మాస్సీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌)లో దీనిపై జరిగిన ఓటింగ్‌లో తీర్మానాన్ని న్యాయ వ్యవహారాల కమిటీకి పంపాలని 211 మంది మద్దతిచ్చారు. 

అభిశంసించాలని కోరిన వారి సంఖ్య 204కు పరిమితం అయింది. మాస్సీ మినహా మిగిలిన రిపబ్లికన్‌ ప్రతినిధులు అందరూ తీర్మానాన్ని కమిటీకి పంపేందుకే మద్దతిచ్చారు. అయితే ఆసక్తికరంగా పలువురు డెమోక్రాట్లు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. థామస్‌ మాస్సీ మొత్తం ఎనిమిది అంశాలపై హెగ్‌సెథ్‌ అభిశంసనను కోరారు. పార్లమెంటు అనుమతి లేకుండా ఇరాన్‌పై 90 రోజులకుపైగా యుద్ధం చేయడం అందులో ఒకటి మాత్రమే. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అనుమానంతో కొన్ని పడవలపై చేసిన దాడుల్లో చట్ట వ్యతిరేకంగా హత్యలు చేశారని కూడా మాస్సీ ఆరోపించారు. 

    అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల తరువాత పార్లమెంటులో అధికార రిపబ్లికన్ల ఆధిక్యం కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు వచ్చే ఏడాది జనవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తరువాత గానీ ప్రతిపక్ష డెమోక్రాట్ల ఆధిక్యం ఉపయోగంలోకి రాదు. అప్పటివరకూ హౌస్‌లో రిపబ్లికన్లదే ఆధిక్యం. ఈ కారణంగానే హెగ్‌సెథ్‌పై అభిశంసన వీగిపోవడంపై డెమోక్రాట్ల నేత హకీమ్‌ జెఫ్రీస్‌ వ్యాఖ్యానిస్తూ.... ‘‘ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే’’అని అన్నారు. ఈ లెక్కన చూస్తే జనవరిలో డెమోక్రాట్లు మరోసారి అభిశంసన అంశాన్ని చేపట్టే అవకాశం ఉంది. ఇంకోలా చెప్పాలంటే హెగ్‌సెథ్‌కు ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభించిందన్నమాట. 

ఇదిలా ఉంటే.. అభిశంసన తీర్మానం వీగిపోవడాన్ని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వాగతించారు. ‘‘అభిశంసన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది’’అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. హెగ్‌సెథ్‌ గొప్ప దేశభక్తుడని కొనియాడారు. హెగ్‌సెథ్‌ కూడా అభిశంసన నాటకమని, హాస్యాస్పదమైందని, దేశ భద్రతకు హాని కలిగించే కుట్ర అని అని వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement