అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఓటమి తర్వాత రిపబ్లికన్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభిశంసన వేళ.. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండగా నిలిచారు. రెండు యుద్ధాల్లో విజయం సాధించారన్న ట్రంప్.. మాసీపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. హెగ్సెత్‌ను తొలగించే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్‌పై చేపట్టిన సైనిక ఆపరేషన్ల విషయంలో హెగ్సెత్‌ను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్న ట్రంప్.. గతంలో వియత్నాం, ఇరాక్, అఫ్గానిస్తాన్ యుద్ధాలకు బాధ్యులైన వారిని ఎందుకు అభిశంసించలేదని ప్రశ్నించారు. పీట్ హెగ్సెత్ రెండు యుద్ధాల్లో విజయం సాధించారు. ఇప్పుడు ఆయనను అభిశంసించాలంటున్నారు. మరి వియత్నాం యుద్ధాన్ని నడిపించిన వారిని ఎందుకు అభిశంసించలేదు? ఇరాక్, అఫ్గానిస్తాన్ యుద్ధాలకు బాధ్యులైన వారిని ఎందుకు ప్రశ్నించలేదు? ఆ యుద్ధాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మనం 18 మందిని కోల్పోతే.. వియత్నాంలో వారు 65 వేల మందిని కోల్పోయారు. మనం అక్కడ ఏడు నెలలుగా ఉన్నాం. వారు 21 ఏళ్లపాటు యుద్ధం చేశారు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
గతంలో ఎలాంటి ప్రయోజనం లేకుండా సాగిన యుద్ధాలకు బాధ్యులైన నాయకులను ఎందుకు అభిశంసించలేదన్న ట్రంప్ హెగ్‌సెత్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన కెంటకీ రిపబ్లికన్ ప్రతినిధి థామస్ మాసీపై సైతం తీవ్ర విమర్శలు చేశారు. ‘‘అతనొక ఓటమిపాలైన వ్యక్తి. కాంగ్రెస్, సెనేట్ సమయాన్ని వృథా చేయకూడదు. మనం ఎంత మంచి బిల్లును తీసుకొచ్చినా అతను వ్యతిరేకంగానే ఓటు వేస్తాడు. అతనిలో ఏదో సమస్య ఉంది’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా, రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు థామస్ మాసీ.. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై ఏకంగా ఎనిమిది అభిశంసన ఆర్టికల్స్‌ను సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇరాన్‌తో అక్రమంగా యుద్ధానికి వెళ్లడం, రక్షణ శాఖాధిపతిగా తన అధికారాలను దుర్వినియోగం చేశారనే ప్రధాన ఆరోపణలతో ఈ అభిశంసన ప్రతిపాదనను తెచ్చినట్లు మాసీ తెలిపారు. ఈ పరిణామం ఇరాన్ యుద్ధ వ్యవహారంలో రిపబ్లికన్ పార్టీలోని అంతర్గత విభేదాలను బట్టబయలు చేసింది. మరోవైపు ఈ అభిశంసన ప్రయత్నాలను ట్రంప్ వ్యతిరేకించారు.
ఇదీ చదవండి: ‘పదవి నుంచి దిగిపోవాల్సిందే’.. పీట్ హెగ్సెత్‌పై అభిశంసన


