లండన్: బ్రిటన్‌కు చెందిన 81 ఏళ్ల రచయిత ఎం. జాన్ హారిసన్ ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ఆయన రచించిన సైన్స్ ఫిక్షన్ నవల ‘ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్’కు 2026 బుకర్ పురస్కారం లభించింది. సోమవారం లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు 50 వేల పౌండ్ల (సుమారు 67 వేల డాలర్లు) నగదు బహుమతిని అందజేశారు. బుకర్ ప్రైజ్ 56 ఏళ్ల చరిత్రలో సైన్స్ ఫిక్షన్ నవలకు ఈ పురస్కారం దక్కడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఈ అవార్డు అందుకున్న అత్యధిక వయస్కుడైన రచయితగా 81 ఏళ్ల హారిసన్ మరో రికార్డు సృష్టించారు.
భవిష్యత్తులో ప్రపంచ విధ్వంసం
హారిసన్ రాసిన 13వ నవల ఇది. 198 పేజీలతో రూపొందిన ఈ కథ ఇంగ్లండ్‌లోని ఛానల్ తీర ప్రాంతంలో సమీప భవిష్యత్తులో సాగుతుంది. పేరులేని ఓ విపత్తుతో సమాజం విచ్ఛిన్నమై, యూరప్ ఖండమే కనుమరుగైన పరిస్థితులు ఇందులో కనిపిస్తాయి. ఫిలిప్ టెన్నెంట్ అనే వ్యక్తి, చిత్తవైకల్యంతో బాధపడుతున్న అతడి స్వేచ్ఛాప్రియురాలైన అత్త మార్నీ ఈ కథలో ప్రధాన పాత్రలు. మనుషుల రూపాలను అనుకరించే ఐగెట్టి అనే రూపం మార్చుకునే గ్రహాంతర జీవులు తీరానికి చేరడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది.
ఏఐపై ఆలోచింపజేసే కథ
కృత్రిమ మేధస్సు, బ్రెగ్జిట్, కొవిడ్ మహమ్మారి, సాంకేతికత ప్రభావం, 2008 ఆర్థిక సంక్షోభం వంటి అంశాలను రచయిత ప్రస్తావించారు. కథలోని సంఘటనల కంటే వాతావరణం, కవితాత్మక రచనా శైలి పాఠకులను ఆకట్టుకుంటాయని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ప్రపంచం నిరంతర సంక్షోభంలో ఉన్నప్పటికీ మనిషి తన జీవితాన్ని ఎలా కొనసాగించాలనే ప్రశ్న ఈ నవలలో ప్రధానంగా కనిపిస్తుంది. సైన్స్ ఫిక్షన్ రచయితగా దశాబ్దాల అనుభవం ఉన్న హారిసన్.. ఈ నవలతో సాహిత్య ప్రపంచంలో కొత్త చర్చకు తెరతీశారు. విభిన్న ప్రక్రియలను కలిపి కూడా గొప్ప సాహిత్యాన్ని సృష్టించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఐదుగురు సభ్యుల న్యాయనిర్ణేతల బృందం 163 నవలలను ఏడాది పాటు పరిశీలించింది. ఏఐ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో యంత్రాలు సృష్టించలేని ప్రత్యేకమైన మానవీయ సృజనాత్మకత ఉన్న రచనలను ఎంపిక చేయడంపై దృష్టి పెట్టింది. ప్రముఖ చరిత్రకారిణి మేరీ బియర్డ్ నేతృత్వంలోని బృందం ఏకగ్రీవంగా హారిసన్ నవలను విజేతగా ప్రకటించింది. ఇది జీవితకాల సాఫల్య పురస్కారం కాదని, నవల తన సృజనాత్మక ప్రతిభతోనే అవార్డుకు అర్హత సాధించిందని ఆమె స్పష్టం చేశారు.
ఐదుగురు ప్రముఖులతో పోటీ
డగ్లస్ స్టువర్ట్, మార్లన్ జేమ్స్, ఎలిజబెత్ స్ట్రౌట్, ల్యూక్ కెన్నార్డ్, రెబెక్కా పెర్రీ వంటి ప్రముఖ రచయితలను వెనక్కి నెట్టి హారిసన్ విజేతగా నిలిచారు. 1969లో ప్రారంభమైన బుకర్ పురస్కారం అంతర్జాతీయంగా రచయితల కెరీర్‌కు గొప్ప గుర్తింపుగా నిలుస్తోంది. గత విజేతల్లో సల్మాన్ రష్దీ, అరుంధతీ రాయ్, ఇయాన్ మెక్‌ఈవాన్ తదితరులు ఉన్నారు. ఈ విజయం తన పుస్తకాల అమ్మకాలను పెంచడంతో పాటు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. రూ.50 వేల పౌండ్ల బహుమతి మొత్తాన్ని ఏం చేస్తారని అడగ్గా.. తన ఇంటి మరమ్మతుల కోసం ఖర్చు చేస్తానని హారిసన్ చమత్కరించారు.


