109 ఏళ్ల క్రితం బ్రిటన్‌కు ఇచ్చిన డబ్బు.. ఇప్పటికీ తేలని లెక్క! | Rs 35000 Loan in 1917 Mystery Continues After 109 Years | Sakshi
Sakshi News home page

109 ఏళ్ల క్రితం బ్రిటన్‌కు ఇచ్చిన డబ్బు.. ఇప్పటికీ తేలని లెక్క!

Oct 20 2026 3:16 PM | Updated on Oct 20 2026 3:25 PM

Rs 35000 Loan in 1917 Mystery Continues After 109 Years

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం 109 ఏళ్ల క్రితం బ్రిటీష్ ప్రభుత్వానికి వార్ లోన్‌గా ఇచ్చిన మొత్తంపై న్యాయ పోరాటం చేస్తోంది. 1917లో భోపాల్‌కు చెందిన వ్యాపారి సేథ్ జుమ్మా లాల్ రుథియా అప్పటి ఇండియన్ వార్ లోన్‌లో రూ.35,000 పెట్టుబడి పెట్టారు. అయితే, ఆ డబ్బు తిరిగి వచ్చిందా? లేదా? అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదని ఆయన కుటుంబం చెబుతోంది. ఈ విషయంపై బ్రిటన్ ప్రభుత్వాన్ని సంప్రదించగా.., ఆ రుణం తమ ప్రభుత్వానికి సంబంధించినదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని యూకే డెట్ మేనేజ్‌మెంట్ ఆఫీస్ (DMO) వెల్లడించింది.

ఈ పెట్టుబడికి సంబంధించి 1917 జూన్ 4న జారీ చేసిన ధ్రువపత్రం కుటుంబం వద్ద ఉంది. అందులో సేథ్ జుమ్మా లాల్ రుథియా రూ.35,000 పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నారు. అప్పట్లో భోపాల్‌లోని ఆయన వ్యాపార సంస్థ పేరు కూడా అందులో నమోదైంది. ఈ పత్రంపై అప్పటి రాజకీయ ప్రతినిధి డబ్ల్యూ.ఎస్. డేవిస్ సంతకం ఉంది. ఈ పెట్టుబడిపై ఏటా 5.5 శాతం వడ్డీ లభించేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వందేళ్లకు పైగా ఆ పత్రాన్ని భద్రపరిచామని, తమ పెట్టుబడికి సంబంధించిన వివరాలు అధికారికంగా తెలియాలని కోరుతున్నారు.

ఈ వ్యవహారంపై వివేక్ రుథియా కుటుంబం తరఫున న్యాయవాది శ్రేయాన్ష్ రాణివాలా బ్రిటన్ అధికారులను సంప్రదించారు. దీనికి అక్టోబర్ 16న స్పందించిన డీఎంఓ, ఆ రుణం బ్రిటన్ ప్రభుత్వ బాధ్యత అని నిరూపించే ఆధారాలు తమకు లభించలేదని ఇమెయిల్ ద్వారా తెలిపింది.

అయితే.. అప్పట్లో ఆ డబ్బు తిరిగి చెల్లించారా?, లోన్ క్లియర్ చేసారా?.. అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. దీంతో సామాజిక కార్యకర్త వినయ్ రుతియా అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బు తిరిగి చెల్లించి ఉంటే అందుకు సంబంధించిన రికార్డులు చూపించాలని, లేకపోతే ఆ పెట్టుబడికి ఏమైందో స్పష్టంగా చెప్పాలని ఆయన కోరుతున్నారు.

కుటుంబం అంచనా ప్రకారం.. రూ.35,000 మొత్తాన్ని ఏటా 5.5 శాతం చక్రవడ్డీతో 109 ఏళ్ల పాటు లెక్కిస్తే నేటి విలువ కొన్ని కోట్ల రూపాయలకు చేరుతుంది. బంగారం ధరల పెరుగుదల ఆధారంగా చూస్తే ఆ మొత్తం రూ.10 కోట్లకు మించవచ్చని కుటుంబం భావిస్తోంది.

ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు?.. ఐటీ శాఖ రూల్స్ తెలుసా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement