ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గుమ్మడికాయగా తాజా రికార్డు నెలకొల్పింది. అమెరికాలో రోడ్ ఐలండ్‌లోని వారెన్ ప్రాంతానికి చెందిన రాన్ వ్యాలస్ అనే రైతు ఈ అండ పిండ బ్రహ్మాండ కూష్మాండాన్ని పండించాడు. దీని బరువు 3,156 పౌండ్లు– అంటే, 1431.5 కిలోలు. ఇప్పటి వరకు ఇలాంటి భారీ గుమ్మడి కాయలను కొందరు పండించారు.
ఇదివరకు రికార్డులకెక్కినవి కూడా ఎన్నడూ మూడువేల పౌండ్ల బరువును మించి లేవు. తొలిసారిగా మూడువేల పౌండ్ల బరువును మించిన గుమ్మడికాయను పండించడంతో రాన్ వ్యాలస్ గిన్నిస్ బుక్ రికార్డుతో పాటు, గ్రేట్ పంప్‌కిన్ కామన్‌వెల్త్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. భారీ గుమ్మడికాయలను పండించడంలో రాన్‌కు సుదీర్ఘ అనుభవమే ఉంది. ఇదివరకు అతను 2006లో 1,500 పౌండ్ల బరువున్న గుమ్మడికాయను పండించాడు.
ఆ తర్వాత 2012లో రెండువేల పౌండ్ల బరువున్న గుమ్మడికాయను పండించాడు. తాజాగా పండించిన బ్రహ్మాండ కూష్మాండం రాన్‌కు రికార్డులతో పాటు భారీ బహుమతులను కూడా తెచ్చిపెట్టింది. స్థానికంగా నిర్వహించిన పోటీలో దీనికి మూడున్నర వేల డాలర్ల నగదు బహుమతి లభించింది. ‘సేఫ్‌వే మెగా చాంపియన్‌షిప్’ పోటీలో ఏకంగా ముప్పయివేల డాలర్ల నగదు బహుమతి లభించింది.
ఇదీ చదవండి: అప్రమత్తతే అసలైన రక్షణ..!


