నిద్రలేమి, ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం వంటి వాటి వల్ల కళ్లకింద వాపు, చర్మం పొడిగా మారడం, నల్లగా కనిపించడం ఈరోజుల్లో సహజమైపోయింది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ మార్కెట్‌లో ‘అండర్ ఐ మాస్క్’లు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో ‘ది ఎవర్‌లాస్ట్ ఐ మాస్క్’ ప్రత్యేకంగా నిలుస్తోంది. మెడికల్–గ్రేడ్ సిలికాన్‌తో తయారైన ఈ మాస్క్‌ను సీరమ్, ఐ క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ రాసిన తర్వాత కళ్ల కింద ఉంచుకోవాలి. ఇది చర్మంపై ఒక సీల్‌లా పనిచేసి, ఉపయోగించిన చర్మ సంరక్షణ ఉత్పత్తులు త్వరగా ఆవిరైపోకుండా చేసి, చర్మం లోలోతుల్లోకి అందించడంలో సహాయపడతాయి.
దీంతో కళ్ల కింద చర్మం మరింత తాజాగా కనిపిస్తుంది. ఇది ముఖానికి చక్కగా సరిపోయే ఆకారంలో ఉండటంతో ఉపయోగిస్తున్నప్పుడు జారిపోకుండా ఉంటుంది. తేలికగా ఉండటంతో ప్రయాణాల్లోనూ వెంట తీసుకెళ్లవచ్చు. సుమారు 10–20 నిమిషాలు ఉంచిన తర్వాత మాస్క్‌ని తొలగించాలి. ఉపయోగించిన తరువాత గోరువెచ్చని నీటితో లేదా తేలికపాటి సబ్బుతో కడిగి, ఆరబెట్టి మళ్లీ ఉపయోగించుకోవచ్చు.
పెట్రోల్‌తో హెయిర్ వాష్!
19వ శతాబ్దంలో జుట్టు శుభ్రం చేసుకునేందుకు పెట్రోలియం ఆధారిత పదార్థాలను ఎక్కువగా ఉపయోగించేవారు. ఇవి జుట్టులోని దుమ్ము, మురికిని తొలగించే డ్రై షాంపూలా పనిచేసేవి. అప్పట్లో ‘మేడమ్ ఫాక్స్ లైఫ్ ఫర్ ది హెయిర్’ వంటి ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉండేవి.
ఖచ్చితమైన ఫలితాన్నిచ్చే హెయిర్ రెస్టోరర్‌గా ప్రచారం అయిన ఈ ఉత్పత్తిని వాసన లేనటువంటి పెట్రోలియంతో పాటు బిర్యానీ ఆకు రసంతో తయారుచేసేవారు. నీటి సౌకర్యం లేని కొన్ని హెయిర్ సెలూన్లలోనూ ‘పెట్రోలియం వాష్’ పద్ధతిని ఉపయోగించేవారు. అప్పట్లో పెట్రోల్‌ను జుట్టును శుభ్రం చేయడానికి మాత్రమే కాకుండా, రకరకాల వ్యాధుల చికిత్సలోనూ ఉపయోగించేవారు. అయితే పెట్రోల్‌ను నేరుగా ఉపయోగించడం సురక్షితం కాదని నిపుణుల సూచన.
ముడతలను ఇలా తగ్గించుకోండి..
వయసు పెరిగే కొద్దీ చర్మంలో కొలాజెన్ తగ్గడం, ఎండకు ఎక్కువగా గురికావడం, చర్మం పొడిబారడం వంటి కారణాలతో ముఖంపై ముడతలు కనిపిస్తాయి. వాటిని పూర్తిగా తొలగించడం సాధ్యం కాకపోయినా, చర్మాన్ని తేమగా ఉంచి ముడతలు మరింత స్పష్టంగా కనిపించకుండా చేయడంలో కొన్ని పద్ధతులు సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి, కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకుని మృదువుగా మర్దన చేయాలి.
పొడి చర్మానికి ఇది తేమను అందిస్తుంది. తాజా కలబంద గుజ్జును ముఖానికి రాసి 15–20 నిమిషాల తర్వాత కడిగేయాలి. చర్మం పొడిబారకుండా తేమగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే కొద్దిగా తేనెను ముఖానికి రాసి, పదినిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. తేనెలోని తేమను నిలిపే గుణాలు చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి. వీటన్నింటితో పాటు ముఖం అందంగా కనిపించాలంటే తగినంత నీరు తాగడం, తగినంత నిద్రపోవడం కూడా ముఖ్యం.
ఇదీ చదవండి: మైండ్ రీడింగ్ ఏఐ! మనసున ఉన్నది.. చెప్పేస్తూ ఉన్నదీ!


