మిస్టిక్ వరల్డ్
అది 1954– ఉత్తరప్రదేశ్‌లోని రసూల్‌పూర్– రాత్రి 11 గంటలు దాటుతోంది. గిరిధారిలాల్ ఝాట్ ఇంటికి హడావుడిగా ఓ వైద్యుడు వచ్చారు. మశూచి సోకి మంచంపై అచేతనంగా పడి ఉన్న బాలుడిని పరీక్షించారు. అనంతరం విషాదవదనంతో, ‘జస్బీర్ ఇక లేడు...’ అని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భోరుమన్నారు. నాలుగేళ్లకే నూరేళ్లు నిండిన తమ కుమారుడిని చూసి తీవ్రంగా విలపించారు. అప్పటికే అర్ధరాత్రి కావడం వల్ల మిగిలిన కార్యక్రమాలు మరుసటి రోజు చూద్దామని ఊరి పెద్దలు నిర్ణయించారు. అదే కీలకమైన మలుపు తిప్పుతుందని ఆ సమయంలో వారికి తెలియదు.
తెల్లవారుతుండగా మంచంపై ఉన్న జస్బీర్ శరీరంలో కదలిక కనిపించింది. కొద్దిసేపటికి అతడు çస్పృహలోకి వచ్చాడు. అది చూసిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. మళ్లీ బతికిన కుమారుడిని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే, ఆ ఆనందం ఎన్నోరోజులు నిలవలేదు. ఎందుకంటే, చనిపోయింది జస్బీర్– కాని, బతికొచ్చింది శోభారామ్!
మశూచితో చనిపోయిన కొద్దిగంటలకే మళ్లీ బతికిన జస్బీర్, కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. అప్పుడే అసలు కథ మొదలైంది. అప్పటి వరకు తమతో ఉన్న జస్బీర్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. తాను రసూల్‌పూర్‌కు చెందినవాడిని కాదని, ఉత్తరప్రదేశ్‌లోనే వెహెడి గ్రామానికి చెందిన శంకర్‌లాల్ త్యాగి అనే వ్యక్తి కుమారుడినని చెప్పడం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లారు. తాను ఝాట్‌ను కాదని, బ్రాహ్మణుడినని చెప్పడమే కాకుండా తన కుటుంబ సభ్యులు వండిపెట్టిన ఆహారం కూడా తినడానికి నిరాకరించేవాడు. ఇదంతా చూసి అతడికి ఏమైందో అర్థంకాక తల్లిదండ్రులు గాభరాపడ్డారు. ఏమీ తినకుండా అలా ఉండిపోతే ఆరోగ్యం చెడిపోతుందనే భావనతో పొరుగునే ఉన్న ఓ బ్రాహ్మణ మహిళ చేత ఆహారాన్ని వండించి పెట్టేవారు.
ఈ ప్రవర్తన కుటుంబ సభ్యులకు అంతుబట్టలేదు. ఒక చిన్న పిల్లవాడికి తన కుటుంబ కులం, ఆహారపు అలవాట్లపై ఇంత పట్టుదల ఎందుకు ఏర్పడిందన్న ప్రశ్న తలెత్తింది. అయితే, ఈ విషయాన్ని వారు రహస్యంగా ఉంచినా, మూడేళ్ల తర్వాత బయటకు తెలిసింది. ఇలా ఆ విషయం పునర్జన్మలపై పరిశోధనలు చేసే అమెరికన్ ప్రొఫెసర్ డాక్టర్ ఇయాన్ స్టీవెన్ సన్‌కు తెలిసింది. దీంతో ఆయన జస్బీర్ కేసును పరిశోధించడానికి 1961లో రసూల్‌పూర్, వెహెడి గ్రామాలను సందర్శించారు. జస్బీర్, అతడి తల్లిదండ్రులు, బంధువులు, శోభారామ్ కుటుంబ సభ్యులు మొత్తం 13 మందిని ఇంటర్వ్యూ చేశారు. 1964లో మరోసారి వెళ్లి కొందరిని తిరిగి ప్రశ్నించారు. సాక్షుల కథనాలు చాలావరకు స్థిరంగా ఉన్నాయని తన పుస్తకంలో పేర్కొన్నారు.
జస్బీర్ చెప్పిన వివరాలు శోభారామ్ జీవితంతో పోలి ఉండటాన్ని స్టీవెన్‌సన్ గుర్తించారు. అతడు సుమారు 22 ఏళ్ల వయసులో వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా రథం నుంచి పడిపోయి మరణించినట్లు తెలుసుకున్నారు. జస్బీర్ తన గతజన్మ మరణం గురించి చెబుతూ, వివాహ వేడుకలో విషం కలిపిన మిఠాయిలు తిన్నానని, ఆ తర్వాత రథం నుంచి పడి చనిపోయానని చెప్పాడు. అయితే విషం కలిపిన మిఠాయిలు తిన్నాడన్న అంశాన్ని శోభారామ్ కుటుంబ సభ్యులు ధ్రువీకరించలేకపోయారు.
శోభారామ్ కుటుంబ సభ్యులు జస్బీర్‌ను కలిసినప్పుడు, అతడు వారిని గుర్తించి బంధుత్వాలను కూడా వివరించాడు. అనంతరం వెహెడి గ్రామానికి వెళ్లినప్పుడు రైల్వే స్టేషన్ నుంచి త్యాగి కుటుంబం నివసించే ప్రాంతానికి దారి చూపించడం, కుటుంబానికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత వివరాలను చెప్పడం ఆసక్తి రేకెత్తించింది.
జస్బీర్ తన గతజన్మ జ్ఞాపకాలను చెప్పడం ప్రారంభించిన సమయానికి శోభారామ్ మరణం కొన్ని నెలల ముందే జరగడం ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశంగా నిలిచింది. సాధారణ పునర్జన్మ కథల్లో ఒక వ్యక్తి మరణించిన తర్వాత మరో వ్యక్తి జన్మిస్తాడని చెబుతారు. కానీ జస్బీర్ అప్పటికే జీవించి ఉన్న బాలుడు కావడంతో పరిశోధకులు ఈ ఉదంతాన్ని ‘రీప్లేస్‌మెంట్ రీఇన్ కార్నేషన్ ’ అనే అరుదైన వర్గంలో చర్చించారు.
ఇదీ చదవండి: ఈవారం కథ: పసిరికలు...
ఒక బాలుడి అనూహ్య ప్రవర్తన, మరో కుటుంబంతో అతడికి ఉన్నట్లు కనిపించిన అనుబంధం, పరిశోధకులు నమోదు చేసిన సాక్ష్యాలు– ఇవన్నీ జస్బీర్ కథను ఆసక్తికరంగా మార్చాయి. నిజంగా పునర్జన్మేనా? తెలియని సమాచారాన్ని బాలుడు ఎలా తెలుసుకున్నాడు? లేక ఈ అనుభవాలకు మరో వివరణ ఉందా? ఈ ప్రశ్నలకు తుది సమాధానం లేకపోయినా; జస్బీర్ ఉదంతం మనిషి జ్ఞాపకశక్తి, వ్యక్తిత్వం, మరణం తర్వాతి ఉనికి గురించి చర్చకు దారితీసిన అరుదైన కేసుగా మిగిలింది.
- సత్యకిశోర్ కొండ్రెడ్డి


