ఫండే
ఈవారం కథ
‘యేంగాదమ్మా.. మామూలు జరమే. సూది గుడక అవసరంల్యా. రెండుదినాలు మందులేస్తే తగ్గిపోతది.’ నా నోట్లవున్నె థర్మామీటరు తీసి ఇదిలిచ్చుకుంటా చెప్పినాడు ఆరెంపీ డాక్టరు.
‘మావాయన పసిరికలు గీన అయినయేమో అని బయపడ్తున్నాడు సార్’ అనింది మాయమ్మ.
‘పసిరికలు లేదు గిసిరికలు లేదు. వాతావరణం మార్నెందుకు ఊర్ల పిల్లలకందరికీ జరాలు పట్కున్నయ్.’
యాభై రూపాయలు ఆయన సేతిలబెట్టి, మందులు మా సేతబట్టుకోని ఇంటికొచ్చినం.
మాయక్కోళ్ళు బడికి పయనమైనారు. నేను గుడక తినీగినీ స్కూలు డ్రస్సు తొడుక్కున్న.
మాయమ్మ పనికి పోనీకె సద్ది పెట్టుకోయింది. నాకాడికొచ్చి, నానొస్టిమీన చెయ్యిపెట్టి, ‘పెయిపెనం లెక్క కాలిపోతుంది... ఇయ్యాల నేను ఇంటికాన్నే వుంటే బాగుండును’ అని బయిటికి పొయ్యింది.
కొంచేపటికి మల్ల లోనికొచ్చి ‘ఈరోజు బడికి పోకుంటే మానేయిలే నానా’ అనింది.
బయిటికి సూపియ్యకుండ లోపల్లోపల్నే సంబరపడిన నేను.
‘నర్సక్కకి పని లేదంట. ఇంటి కాన్నే వుంటది. సాయంత్రం అక్కోల్లు బడి కాన్నించి వొచ్చేవరకు నర్సక్క కాన్నే ఉండు’ అని చెప్పి పనికి పొయ్యింది.
నేను స్కూల్ డ్రస్సు ఇడ్సి, అంగీ నిక్కరూ తొడుక్కోని నర్సక్కోల్ల ఇంటికి పొయ్నా.
నర్సక్కకి నేనంటే శానా ఇష్టం. మాయక్కోల్ల లెక్కనే సూస్కుంటది నన్ను. ఇయ్యాలంత వాళ్ళింట్ల మహేసుగానితో ఆడుకోవచ్చు. మహేసుగాడు నర్సక్క కొడుకు. మొన్న మొన్ననే నన్ను ‘మామా’ అని పిల్సనీకె నేర్సుకున్నాడు.
‘నేను లేకున్న్యా గుడక నీకాడ ఏడ్సకుండ బాగా ఆడుకుంటాడు చిన్నా... మహేసుగాడు’ అంటది నర్సక్క. నిజమే... వానిగ్గుడక నేనంటే బలే ఇష్టం.
పొద్దునంత మహేసుగాన్ని ఆడిపిచ్చుకోని, మధ్యానం వాడు నిద్రపొయ్నాక నేను ఇంటికొచ్చి అన్నం తిని టీవీ సూస్కుంట ఎప్పుడు నిద్రపోయిన్నో ఏమో... లేసేలోపు మూడున్నర దాటింది. ఇంగో అర్ధగంటకి బడి ఇడుస్తారు. పొయ్యి క్రికెట్ ఆడుకోవచ్చు. అంతవరకు ఏం జెయ్యాలి. ఇంట్లేకి పొయ్యి టీసర్వ తీస్కోని గడ్నూనె స్టవ్వు పొయ్యిమీద పెట్టిన. కొంచేపటికి మసిబట్టతో పట్టుకోని దింపి, గ్లాసుకి పోస్కోని తాగిన. తూ... గడ్నూనెకంపు. మాయమ్మ సేతిలో మూడింది నాకు ఇయ్యాల.
కొంచేపటికి శివగాడొచ్చినాడు ఇంటికాడికి. బడి ఇడిసినట్టున్నారు.
‘ఏమిరా బడికి రాల్యా’
‘జరమొచ్చిందిరా’
‘క్రికెట్ ఆన్నీకె రావా ఐతే’
నేను లేసి ఇండ్లు మూసిన. శివగాని సైకిలెక్కి బీడు బరకలేకి తొక్కినం. మ్యాచ్చికి ఐదురూపాయలు పందెం. శివగాడూ, రమేష్గాడూ, యేసేపుగాడూ... ఈ ముగ్గురే కలిసి పెడ్తారు మా టీము నుంచి ఐదురూపాయలు. ఫస్టు మ్యాచ్చి అయిపోయి రెండోది ఆడుతున్నాం.
మా నాయన గొంతు ఇనిపిచ్చింది. ‘ఏరా... మావోడు వున్నాడా ఆడ?’ అని రోడ్డుపక్కన అరుగు మీన కూచున్నోల్లని అడుగుతున్నాడు.
నేను తలకాయ తిప్పి చూస్తే, అంత దూరంల రోడ్డుమీన బగ్గి నిలవెట్టి, బరకలేకి వొస్తున్నాడు మా నాయన. ‘వొరేయి శివా... మా నాయనొస్తున్నాడు. నేను బోతున్నా.’
‘ఫీల్డింగు ఎవడు జెయ్యాల్రా?’
‘సబ్స్టూట్ పెట్టుకో... రెండోవర్లేగదా!’
నా బ్యాటింగ్ ఎట్టనో ఐపోయింది. ఫీల్డింగ్ ఎందుకు చెయ్యడం... బయపడుకుంట మా నాయన కాడికి వురికిన.
‘ఏమిరా తింగర్నాకొడకా... జరమని బడి ఎగ్గొట్టి, ఈడొచ్చి ఆట పట్టిచ్చినవా? దొంగ బడి నేర్సుకుంటివ్యా?’ మా నాయన నెత్తిన చిన్నగా తట్టినాడు.
నేను బగ్గెక్కి కుచ్చున్న. సక్కగ ఇంటికి పోకుండా వూర్లేకి పోనిచ్చినాడు.
తిమ్మన్న జేనాయన ఇంటికాడ ఆగినం.
‘శినాయనా కొంచెం నీ మనవన్ని సూడే... బువ్వ సరింగ తింటలేడు... ఒకటే జరం...’
తిమ్మన్న జేనాయన నాకండ్లు కిందికి గుంజి, కండ్లల్లేకి చూసి, ‘ఏమిరా... కాళ్ళూసేతులూ గుంజుతున్నయా?’ అని అడిగినాడు.
నేను తలకాయ అడ్డంగ ఊపిన.
ఆయన మానాయనకెల్లి తిరిగి, ‘అయినయిరా... నారపసిరికలు... ఇంగా ఏం ముదిరిలేవు గానీ, తొందరగ సూపిస్తే మేలు’ అని జెప్పినాడు.
రాత్రి పనుకునే ముందర, ‘రేపు బడికొద్దులే... వూరికి పొయ్యేదుంది మనం’ అన్నాడు మా నాయన.
నాకు అర్థం గాల్యా.
పొద్దున్నే లేసి, స్నానంజేసి పయనమైనం నేనూ మా నాయన.
మావూరి నుంచి రెండు బస్సులు మారితే, గన్నూరుకొచ్చినం.
చిన్నవూరు. వూరినిండ చెట్లు. బలే ఉంటది గన్నూరు.
ఊర్ల దిగి కొంచేపు నడిసి ఒక ఇంటి బయట అరుగుమీన కుచ్చున్నం. కొంచేపటికి ఒక ముసలామె ఆ ఇంట్లనుంచి బయిటికొచ్చింది.
ఆమె చేతిల ఒక పప్పుగంటె, ఆ గంటెల రాగి జావలెక్క ఏందో వుంది. నాకాడికొచ్చింది.
నా మొగంజూసి, ‘ఇతిరానంగ ముదిరిపోయినయి గదన్నా’ అనింది మా నాయనతో.
మనసులనే ఏందో పార్థన జేస్కోని, నా పురకన్నుని గుంజి తెరిసి, ఆ గంటెల వున్న మందుని ఆమె చూపుడువేలితో తీస్కోని నాకంట్లో పెట్టింది.
నాకు ఏమయ్యిందో అర్థమయ్యేలోపే అమ్మరి పక్కన కంట్ల కూడా పెట్టేసింది.
అమ్మో... నా కండ్లు వాయరో అని అరుగు మీన్నుంచి లేసి లబాలబ్బా కొట్టుకుంటా, కిందవడి దొర్లాడుకుంటా ఏడుస్తున్న. కండ్లు తెరిసి మా నాయన్ని సూన్నీకె గూడ అయితలేదు నాతో. కండ్లల్ల సలిసీమలు కుడుతున్నట్టు మంట, కండ్లల్లేకి వేళ్లుపెట్టి గోర్లతో కంటిగుడ్లను తోడేస్తున్నట్టు నొప్పి.
కండ్లమీన చేతులుపెట్టి నల్చుతుంటే, అప్పుడు మానాయనొచ్చి నన్ను పట్టుకోని లేపి, ‘నల్చితే మంట ఎక్కువైతది. కండ్లు తెర్సనీకె సూడు. అప్పుడు కండ్లల్ల మందు కారిపోయి మంట తగ్గిపోతది’ అని జెప్పినాడు.
నేను అట్లనే ప్రయత్నం జేసిన. అబద్ధం. యా మంట తగ్గలేదు. ‘మంటా మంటా’ అని ఏడిస్తే శాంచేపటికి తగ్గింది కొంచెం.
పుండికూర తినగూడదు. వంకాయ తినగూడదు. పచ్చిమిరక్కాయల పప్పు తినగూడదు. ఏమీ తినగూడదు. ఉత్త మిరప్పొడి, వొట్టికారం పప్పు.
రాత్రి పనుకోని పొద్దున లేసేటప్పటికి కండ్లుకర్సక పోయినాయి. తెర్సనీకె అయితలేదు. కండ్లనిండ పుసులుతోడి బంకపోసి కరిపిచ్చినట్టు మూస్కపొయ్నాయి.
ఉడుకు నీళ్లతో కడుక్కోని నిదానంగా తెరిస్తే, అప్పటిగ్గూడా కుచ్చుక పోతున్నాయి.
బడి ఎగ్గొట్టిన. అసలు బయిటికే పోగూడదు. పొద్దుమూకులు ఇంట్లనే. తర్వాత రోజు మాయమ్మా నేనూ పోయినం. మాయవ్వోల్ల వూరికి పోతున్నం అని అబద్ధం జెప్పి తోలుకొచ్చింది మాయమ్మ గన్నూరుకి.
‘నేను పెట్టుకోను దేవుడో... నేను మావూరికి పోతా. అమ్మా... నానా... అవ్వా... జేజీ...’ ఎంత మొత్తుకోని దొమ్మలు పగిలేతట్టు ఏడ్సినా ఇడ్సిపెట్టల్యా. రెండు కండ్లల్ల మల్లా మందుపెట్టింది ముసల్ది.
‘అమ్మా... నొప్పే... నియ్యమ్మా, ఇంగెప్పుడన్న నీ మాట నమ్మితే అడుగు’ మాయమ్మని కర్సుకోని ఏడ్సిన. ఇయ్యాల మొన్నటంత నొప్పిలేదు. పక్కన మాయమ్మ వున్నెందుకేమో! ఇంటికిపొయ్యి చారన్నం తిని పండుకున్న. ఇంగా పదైదు దినాలు ఉండాలంట పత్తెం. లేకపోతే సచ్చిపోతారంట. మా ఇంటిపక్కన జేజి చెప్పింది.
రెండ్రోజులకి మల్లా పోయినం గన్నూరు. ఈసారి నేను రానని పొద్దున్నే ఇంట్ల నుంచి పారిపొయ్యి సిన్మా టాకీస్కాడ దాపెట్టుకుంటే ఎతుకులాడుకుంట వొచ్చి, కొట్టుకుంట తోలుకొచ్చింది మాయమ్మ.
గంటె దీస్కోని బయిటికొచ్చింది ముసల్ది. నాకు ఉచ్చలు కారిపోయినయ్ ఆ గంటెని సూస్తేనే.
‘సిన్నమ్మా... నా కొడుకు బయపడ్తున్నాడు... ఇయ్యాల కండ్లల్లేకి గాకుండా కడుపులేకి ఇస్తవా మందు’ అనడిగింది మాయమ్మ.
‘వొద్దురా కొడుకా... కండ్ల మందే మేలు. తొందరగ గట్టిగైతాడు పిల్లగాడు. వొద్దు కచ్చితంగ కడుపులేకే ఇయ్యమంటే ఇస్తా సూడు మల్ల. ఎట్టనో రెండు దినాలు ఐపోయింది గావట్టి అదిగూడ.’
మాయమ్మ కడుపుల మందే ఇయ్యమనింది. తమలపాకుల ఏందో పెట్టి, మల్లా మనసుల ఏదో దేవునికి మొక్కుకోని నా నోరు తెర్సమనింది. ఆ ఆకు నోట్లోపెట్టి కసబిస నమలమనింది.
నమిలి మింగిన. యాక్తూ... ఏం బాలేదు. కొంచెం వాంతికొచ్చినట్టయింది.
యాదోటిలే... కంట్ల మందు కంటే నూరురెట్లు మేలు. ఇయ్యాల సంబరంగ ఇంటికొచ్చిన.
నాకు జరం తగ్గి, పత్తెం గిత్తెం అయిపోయి మల్లా మంచిగైన.
కొన్నాళ్ళకి మహేసుగానికి పానం బాలేక జరమొచ్చింది. ఆడుకనీకె మాఇంటిగ్గూడక వొస్తలేడు ఈమధ్య. డాక్టర్ల కాడికి పోతే, రక్తపరీక్షలు చేసి, టైఫాయిడ్ జరమొచ్చి పసిరికలు అయ్నాయని చెప్పినారంట. వాన్నిగూడా గన్నూరుకి ఎత్తుకపొయ్నారు. నాకు ఏడుపొచ్చింది.
పదేండ్ల పెద్దపిల్లగాన్ని నేనే తట్టుకలేక పోయిన. వాడు ఎట్ట తట్టుకుంటాడు పాపం. వాడు మామూలుగానే సిన్న సిన్న దాన్లకు కొట్టాలు లేసిపొయ్యేటట్టు ఏడుస్తాడు. ఇంగ ఈ మందు దెబ్బకి ఏడిస్తే అస్సలు సూడలేను నేను. వానికి కంట్ల గాకుండా, కడుపుల మందు ఇస్తే మేలు దేవుడా అనుకున్న.
మద్యానానికి ఇంటికొచ్చినారు నర్సక్కోల్లు.
మహేసుగాడు మెత్తగ పండుకున్నాడు నర్సక్క బుజాల మింద.
కండ్లల్లేకే యేసినారంట మందు.
నాకు పిచ్చి కోపమొచ్చింది.
ఇంటికి పొయ్యి మాయమ్మని అడిగిన. ‘అంత పిల్లగానికి ఆ నొప్పికే ఏమన్న అయితే’...
‘మందు వానికి ఆరోగ్యం బాగకానీకెనే నైనా’ అని జెప్పింది మాయమ్మ.
అయినా నాకు బాధ తగ్గల్యా.
మాయమ్మ పక్కన కూచ్చోని చిన్నగా, ‘నేనంటే పెద్దపిల్లగాన్ని గావట్టి మూడుసార్లు పొయ్యినం. వానికి ఒక్కసారే గదమ్మా ఏసేది’ అని అడిగిన.
మాయమ్మ ఏం మాట్లాడకుండా అవునన్నట్టు తలకాయ ఊపింది.
రెండ్రోజులకి మల్లా ఎత్తుకపొయ్నారు వాన్ని.
మాయమ్మ నాకు అబద్ధం జెప్పింది. సాయంత్రం బడికి పొయ్యొచ్చినాక సక్కగ మహేసుగాని ఇంటికే పోయిన.
మెత్తగైపోయి కండ్లు కర్సకపోయి ఉన్నాడు. నేను ఎత్తుకొని ఆడిపిచ్చుకుంటే గుడక నవ్వుత లేడు. నాకు ఏడుపొచ్చింది.
ఇంటికిపొయ్యి సంచి పక్కన పడేసి, ‘నియ్యమ్మా... వానికి మల్ల మందు పెట్టరని అబద్ధం చెప్తవా’ అడిగిన మాయమ్మని.
‘నాకేందెల్సురా... పెట్టరనే అనుకున్న నేను గుడక.’
నాకు అర్థమయ్యింది. వీళ్ళకి తెలిసే అబద్ధాలు చెప్తారు.
నర్సక్కోళ్ల ఇంటికి పొయ్యి, వానికి మందు పెట్టియొద్దని చెప్పిన ఆమెకి.
‘మీకు తెలియదేమో కావాలంటే కడుపులేకి గూడ ఇస్తారు మందు తెల్సునా?’ అని చెప్తే...
‘అవునా! అయితే ఈసారి కడుపులేకే ఇప్పిస్తంలే’ అని జెప్పింది.
తర్వాతసారి గూడ కండ్లమందే పెట్టిచ్చినారు.
నాకు నర్సక్క మీన ఎక్కల్లేని కోపమొచ్చింది. ‘అదే మందు మీ కండ్లల్ల పెడితే తెలుస్తదే మీకు ఆ నెప్పి’ అని కొట్లాడిన నర్సక్క మింద.
ఐదు రోజులు దాటిపోయినా మహేసుగానికి జరం తగ్గల్యా. ఆరోజు ఆదివారం. బడి లేదని నేను లేటుగ నిద్రలేశ్నా. ఇంట్ల ఎవ్వర్లేరు. బయిటికిపొయ్యి చూస్తే, నర్సక్క ఇంటికాడ ఉన్నారు ప్యాట్ల జనాలంతా.
నేను పొయ్యి చూసిన. మహేసుగాడు సచ్చిపొయ్నాడంట. వాని సుట్టూ కుచ్చోని ఏడుస్తున్నారు మంది. దగ్గరికి నడిసిన.
నన్ను పట్టుకోని, ‘మహేసూ... లెయ్యిరా నీ మామొచ్చినాడు’ అని గట్టిగా అర్సుకుంటా రొమ్ములు బాదుకుంటా ఏడుస్తుంది గోకారత్త. నేను మహేసుగాని మొగంకెల్లి చూసిన. వాని నవ్వు నా చెవులల్ల మారుమోగిపోతుంది. నా కండ్లల్ల నీళ్ళు చెంపలపొంటి జలజల కారినయ్.
- సి. భవాని శంకర్
ఇదీ చదవండి: తిట్టడు... గొడవపడడు... ఈ భర్త నాకొద్దు! కారణం తెలిస్తే షాకే!


