స్ఫూర్తి
ప్రపంచ మహిళల రెజ్లింగ్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది మనీషా బన్వాలా. ఆమెకు తండ్రి అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి కొలమానాలు, తూకాలు సరిపోవేమో! కూతురి విజయాన్ని చూసే అదృష్టం ఆ తండ్రికి దక్కలేదు. ‘నాన్న నాతోనే ఉన్నాడు’ అనుకోవడం మనీషా బలం. కుటుంబ బంధాలు వ్యక్తుల విజయాలకు ఎలా కీలకం అవుతాయో చెప్పడానికి మనీషా బన్వాలా బలమైన ఉదాహరణగా నిలిచింది...
‘‘ఈ క్షణం కోసం నేను చాలాకాలంగా ఎదురు చూస్తున్నాను. 2022 నుండి ప్రపంచ ఛాంపియన్ అవుతాను అని నా డైరీలో రాసుకుంటూ వచ్చాను. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మొదటి భారతీయ మహిళ కావాలనేదే నా కల. ఆ కల నిజమైంది’’ బంగారు అక్షరాలతో ‘వరల్డ్ ఛాంపియన్’ అని ముద్రించిన నీలిరంగు తోలుబెల్టు సర్దుకుంటూ చెప్పింది మనీషా. హరియాణాలోని జింద్ పట్టణానికి పదికిలోమీటర్‌ల దూరంలో ఉన్న సీవాహ అనే గ్రామానికి చెందిన మనిషా కాస్త ఆలస్యంగానే కుస్తీపోటీల్లోకి వచ్చింది. ‘నా విజయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది’ అంటున్న మనీషా బన్వాలా అంతరంగం...
స్వేచ్ఛగా...
మాది ఓ చిన్న గ్రామంలోని ఓ సాధారణ కుటుంబం. మా నాన్న సురేష్ బన్వాలా నన్ను రెజ్లింగ్ వైపు ప్రోత్సహించారు. ప్రోత్సహించడమే కాదు ‘నువ్వు నంబర్ వన్ రెజ్లర్ అవుతావు’ అని నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపేవారు. నాకు ఒక తమ్ముడు, చెల్లెలూ ఉన్నారు. నాపైనే ఆయనకు ఎక్కువ ఆశలు ఉండేవి.
‘అమ్మాయివి కాబట్టి నువ్వు ఇలాగే ఉండాలి. అలా చేయకూడదు’ ఇలాంటి పట్టింపులేవీ నాన్నలో ఉండేవి కాదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నాన్న చిన్నపాటి రైతు. పెద్దగా డబ్బులు లేకున్నప్పటికీ ఏ లోటు లేకుండా పెంచారు.
కృంగిపోయాను
ఆరోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. 2022 ఆసియా ఛాంపియన్‌షిప్. నేను టోర్నమెంట్‌కు బయలుదేరే రోజు నాన్నకు గుండెపోటు వచ్చి కన్నుమూశారు. ఆ బాధ మాటల్లో చెప్పలేను. బాగా కుంగిపోయాను. నాన్నవల్లే రెజ్లింగ్‌లోకి వచ్చాను. నేను గెలిస్తే ఆయన పొంగిపోయేవారు. ఓడిపోయినా బాధపడేవారు కాదు.‘ఇతి తాత్కాలికమే’ అనేవారు. ఎన్నో ఏళ్లుగా ఆయన నన్ను నమ్మారు. నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రెజ్లింగ్‌లో నేను ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసే సమయంలో ఆయనను కోల్పోవడం బాధాకరంగా ఉంది. ఆయన గర్వపడేలా ఏదైనా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
ఆట కాదు ఆరాధన!
రెజ్లింగ్ అనేది నా దృష్టిలో ఆట కాదు. ఆరాధన. నా తండ్రిపై నాకు ఎంత గౌరవం ఉందో, రెజ్లింగ్‌పై అంతే ఉంది. నాన్న చెప్పిన ఒక మాట ఎప్పుడూ నా మనసులో మెదులుతుంటుంది. ‘ఏ పని మొదలుపెట్టినా దాన్ని మధ్యలోనే వదిలేయకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి’ అని నాన్న చెబుతుండేవారు. చిన్నప్పటి నుంచి ఆ మాటనే నా జీవనసూత్రంగా పాటిస్తూ వచ్చాను.ప్రపంచ ఛాంపియన్ కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. ఆ లక్ష్యాన్ని సాధించేవరకు వెనకడుగు వేయకూడదని బలంగా నిర్ణయించుకున్నాను.
తపస్సుకు దొరికిన ఫలం
→ నా పోటీకి ఒక రోజు ముందు కాజల్, నీలం ఇద్దరూ ఫైనల్స్‌కు చేరుకున్నారు. కాజల్ ఫైనల్‌కు చేరినప్పుడు ఆమె స్వర్ణం గెలుస్తుందని చాలామంది అన్నారు. దేవుడే నన్ను మొదటి ఛాంపియన్ చేయాలనుకున్నాడేమో! ఇది నా తపస్సుకు లభించిన ప్రతిఫలం.
→ స్వర్ణం గెలుస్తానని నాకు ముందే అనిపించింది. అందుకే ఈ టీ షర్ట్‌ను సిద్దం చేసుకున్నాను. నా తండ్రి నాతోపాటే ఉండాలని నేను కోరుకున్నాను (ఫైనల్ రోజున వార్మప్ కోసం మనీష ఒక ప్రత్యేకమైన టీ షర్ట్‌ను ధరించింది. దానిపై ఆమె తండ్రి ఫొటో ఉంటుంది)
→ నేను మ్యాట్‌పై అడుగు పెట్టినప్పుడు నాన్న నాతోపాటే ఉన్నట్లు అనిపించింది. దీన్ని మాటల్లో చెప్పలేను. ఆయన గొంతు వింటున్నట్లుగానే అనిపించింది. ఆయన భౌతికంగా లేకపోయినా మా మధ్య అనుబంధం అలాగే ఉంది. ఈ బంగారు పతకాన్ని ఆయన చూస్తున్నారని, గర్వంగా నవ్వుతున్నారని నాకు తెలుసు.
→ 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో 57 కేజీల విభాగానికి తిరిగి రానున్నాను. వచ్చే ఏడాది చాలా ముఖ్యం. 57 కేజీల విభాగంలో వరల్డ్ ఛాంపియన్‌షిప్ బెల్ట్ గెలుచుకోవడానికి నా వంతు కృషి చేస్తాను’’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది మనీషా.


