పసిడి పోరుకు మనీషా | Manisha Bhanwala in the final of the World Senior Womens Wrestling Championship | Sakshi
Sakshi News home page

పసిడి పోరుకు మనీషా

Oct 30 2026 4:05 AM | Updated on Oct 30 2026 4:05 AM

Manisha Bhanwala in the final of the World Senior Womens Wrestling Championship

తనూ శర్మకు కాంస్యం 

ప్రపంచ సీనియర్‌ మహిళల రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ 

ఆస్తానా: మహిళల ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో కొత్త చరిత్ర లిఖించేందుకు మనీషా భన్వాలా (59 కేజీలు) అడుగు దూరంలో నిలిచింది. కజకిస్తాన్‌ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీ మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో మనీషా ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో మనీషా 10–0తో అల్టిన్‌ శగయేవా (కజకిస్తాన్‌)పై గెలిచి పసిడి పోరుకు అర్హత సాధించింది. ఇప్పటి వరకు ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత మహిళా రెజ్లర్‌ స్వర్ణ పతకం సాధించలేదు. తాజా టోర్నీలో కాజల్‌ ధోచక్‌ (76 కేజీలు), నీలమ్‌ సిరోహి (50 కేజీలు) ఫైనల్లో ఓడి రజతాలతో సరిపెట్టుకోగా... గతంలో అన్షుమాలిక్‌ (2021లో; 57 కేజీలు) రజతం నెగ్గింది. 

గత రెండు బౌట్‌లలో ప్రత్యర్థికి ఒక్క పాయింట్‌ కూడా ఇవ్వని మనీషా ఫైనల్లో పాన్‌ అమెరికా చాంపియన్‌ అబిగైల్‌ ఎలిజబెత్‌ (అమెరికా)తో తలపడనుంది. మహిళల 72 కేజీల విభాగంలో తనూ శర్మ కాంస్య పతకం కైవసం చేసుకుంది. కాంస్య పతక పోరులో తనూ శర్మ 9–5తో ప్రీసియస్‌ రోసన్నా (అమెరికా)పై గెలిచింది. 2012 ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో అత్యధికంగా భారత్‌కు రెండు పతకాలు దక్కగా... ఈసారి ఇప్పటికే మూడు పతకాలు సొంతమయ్యాయి. మనీషా రూపంలో నాలుగో పతకం సిద్ధంగా ఉంది. పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల క్వార్టర్‌ ఫైనల్లో భారత స్టార్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత సుజీత్‌ కల్కల్‌... తజకిస్తాన్‌ రెజ్లర్‌ అబ్దుల్‌ మజీద్‌ కుదియెవ్‌ చేతిలో ఓడాడు. ఇటీవల ఆసియా క్రీడల ఫైనల్లో కుదియెవ్‌పై విజయంతోనే పసిడి నెగ్గిన సుజీత్‌ ఇప్పుడు అలాంటి ప్రదర్శన కనబర్చలేకపోయాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement