ముక్కోణపు వన్డే సిరీస్‌లో లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ డాషింగ్ ఓపెనర్ బెన్ డకెట్ విధ్వంసంకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో లంక బౌలర్లను డకెట్ ఉతికారేశాడు. మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ కేవలం 87 బంతుల్లోనే తన 6వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఓవరాల్‌గా 132 బంతులు ఎదుర్కొన్న డకెట్.. 24 ఫోర్ల సాయంతో 167 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ తుపాన్ ఇన్నింగ్స్‌తో డకెట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
డకెట్ సాధించిన రికార్డులు ఇవే
చారిత్రత్మక గడ్డాఫీ మైదానంలో డకెట్‌కు ఇది మూడో వన్డే సెంచరీ. దీంతో గడ్డాఫీ స్టేడియంలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాటర్‌గా పాకిస్థాన్ దిగ్గజాలు మహమ్మద్ యూసుఫ్, షోయబ్ మాలిక్, జహీర్ అబ్బాస్‌లతో సరసన డకెట్ చేరాడు.
అదేవిధంగా ఈ మైదానంలో అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్ మాత్రం డకెట్‌నే కావడం గమానార్హం. ఇంతకుముందు అరవింద డిసిల్వా, కేన్ విలియమ్సన్ లహోర్‌లో రెండు వన్డే సెంచరీలు చేయగా.. తాజా సెంచరీతో వారిద్దరిని డకెట్ అధిగమించాడు.
జయసూర్య, సంగక్కర రికార్డు సమం
ఓవరాల్‌గా పాకిస్థాన్ గడ్డపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్ల రికార్డును కూడా డకెట్ సమం చేశాడు. శ్రీలంక దిగ్గజాలు సనత్ జయసూర్య, కుమార సంగక్కర మాత్రమే ఇప్పటివరకు పాకిస్థాన్‌లో తలా 3 వన్డే సెంచరీలు చేయగా, డకెట్ వారి సరసన నిలిచాడు.
వరుసగా 150 ప్లస్ స్కోర్లు.. లారా, దిల్షాన్ సరసన!
పాకిస్థాన్ గడ్డపై వన్డేల్లో రెండుసార్లు 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా డకెట్ చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా స్వదేశం వెలుపల రెండుసార్లు 150 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన ప్రపంచంలోనే మూడో బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. గతంలో శ్రీలంకకు చెందిన తిలకరత్నే దిల్షాన్ (ఆస్ట్రేలియాలో రెండుసార్లు), వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా (యుఎఈలో రెండుసార్లు) మాత్రమే ఈ ఘనత సాధించారు


