పాక్‌తో ఉద్రిక్తతల తర్వాత.. భారత్‌ సంచలన నిర్ణయం | India Invites Pakistani Minister To Delhi For SCO Summit, First Such Invitation Since Operation Sindoor Amid Bilateral Tensions | Sakshi
Sakshi News home page

పాక్‌తో ఉద్రిక్తతల తర్వాత.. భారత్‌ సంచలన నిర్ణయం

Oct 28 2026 9:34 AM | Updated on Oct 28 2026 10:17 AM

India Invites Pakistan For SCO Forum In Delhi After Operation Sindoor

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలు పంపిన భారత్‌.. ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏకంగా పాక్‌ మంత్రినే ఢిల్లీకి ఆహ్వానించింది. నవంబర్‌ 20 నుంచి 22 వరకు జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సుకు రావాలని పాకిస్తాన్‌ జాతీయ వారసత్వం, సాంస్కృతిక శాఖ మంత్రి ఔరంగజేబ్‌ ఖాన్‌ ఖిచీకి ఆహ్వానం పంపింది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాక్‌ సీనియర్‌ మంత్రికి భారత్‌ నుంచి ఆహ్వానం అందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఎస్‌సీఓలోని మొత్తం 10 సభ్య దేశాలకూ భారత్‌ ఆహ్వానాలు పంపింది. 2025 మేలో పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. పాకిస్తాన్‌కు చెందిన సీనియర్‌ మంత్రికి భారత్‌ నుంచి ఇలాంటి ఆహ్వానం అందడం ఇదే తొలిసారి. ఖిచీ ఈ కార్యక్రమానికి హాజరైతే, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌లో పర్యటించిన తొలి సీనియర్‌ పాకిస్తాన్‌ మంత్రిగా నిలుస్తారు. అంతకుముందు 2023 మేలో అప్పటి పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ గోవాలో జరిగిన ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు.

అక్టోబర్‌ 20న తజికిస్థాన్‌ రాజధాని దుషాంబేలో జరిగిన ఎస్‌సీఓ ప్రభుత్వాధినేతల మండలి సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ వేదికను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఎస్‌సీఓ సభ్య దేశాలన్నింటినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సభ్య దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం, పరస్పర అవగాహనను పెంపొందించడం ఈ వేదిక ప్రధాన లక్ష్యం.

ఇదే సమావేశంలో ఉగ్రవాదంపై భారత్‌ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావుండకూడదని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారు, మద్దతు ఇచ్చేవారు, ఆశ్రయం కల్పించేవారిని ఉపేక్షించకూడదని పేర్కొన్నారు. ఉగ్రవాద వ్యవస్థను సమష్టిగా, దృఢంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి పాకిస్తాన్‌ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌ కూడా హాజరయ్యారు.

ఇదీ చదవండి: హంగ్‌ దిశగా ‘ఫలితాలు’.. నెతన్యాహుకు షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement