సోనియా గాంధీ వెల్లడి
ఆత్మకథతో ‘తమాషా’ ఖాయమని వ్యాఖ్య
నా గురించి చాలామంది చెప్పారు
చాలా వరకూ సత్యదూరం, కల్పనలే
నా కథ నేనే చెప్పుకునేందుకే ఆత్మకథ
న్యూఢిల్లీ: భర్త రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకించానని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ౖచైర్‌పర్సన్ సోనియా గాంధీ తెలిపారు. త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’తో కొంత దుమారం చెలరేగడం ఖాయమని మంగళవారం వ్యాఖ్యానించారు. ‘‘ఈ పుస్తకం బయటకు వచ్చాక కొంత ‘తమాషా’జరగడం ఖాయం. దశాబ్దాలుగా ఇతరులు నా ‘కథ’చెబుతూ వచ్చారు. ఇప్పుడు నా వంతు వచ్చింది’’అని సోనియా ఎక్స్‌లో పేర్కొన్నారు.
సుమారు వారం రోజుల క్రితం సోనియా మొట్టమొదటిసారి సొంత అకౌంట్ ద్వారా సోషల్ మీడియాలో ప్రవేశించగా.. తాజాగా ఎక్స్‌లోనూ రంగ ప్రవేశం చేశారు. ఎక్స్‌లో మంగళవారం తన రెండో పోస్టు చేస్తూ దానికి ఒక వీడియోను జత చేశారు. దాదాపు ఒక నిమిషం 28 సెకన్లు ఉన్న ఈ వీడియోలో సోనియా తన ఆత్మకథ పేజీలను తిరగేస్తూ కనిపించారు. ‘‘మొత్తం కథ చెప్పాలో లేదో నాకు తెలియడం లేదు’’కానీ.. ‘‘రాజీవ్‌ను ప్రధానమంత్రి పదవికి ఎంపిక చేసినప్పుడు నేను పూర్తిగా వ్యతిరేకించాను..’’అని వ్యాఖ్యానించారు.
ఆ వీడియోలో చాలామంది తన గురించి దశాబ్దాలుగా రాస్తూ వచ్చారని, వీటిల్లో కొన్ని వాస్తవాలకు దూరంగా ఉంటే.. చాలావరకూ కల్పించి రాసినవేనని సోనియా చెప్పారు. ఇంకొన్ని అంశాల్లో అతిశయోక్తులు జోడించారని తెలిపారు. అందుకే వాస్తవాలను యథాతథంగా వివరించేందుకు ఈ పుస్తకం రాశానని చెప్పుకొచ్చారు. ప్రజల్లో నా గురించి ఎన్నో అభిప్రాయాలు ఉండవచ్చు. పుస్తకం చదివిన తరువాత కొందరు దాన్ని మార్చుకోవచ్చు.. మరికొందరి అభిప్రాయం మరింత తక్కువ స్థాయికి చేరవచ్చు. ఆత్మకథ రాసినప్పుడు ఇదే జరుగుతుంది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని తమాషాలు జరిగే తీరతాయి’’అని వ్యాఖ్యానిచారు. సోనియా తాజా ఎక్స్ పోస్టు ఆధారంగా చూస్తే ఆమె ఆత్మకథలో రాజకీయంగా సున్నితమైన వ్యక్తిగత, రాజకీయ అంశాలు ఉండే అవకాశం ఉంది.


