న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచారు. తన తొలి పోస్టులో త్వరలో విడుదల కాబోయే ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) ఫస్ట్ లుక్‌ను పంచుకుంటూ, దీనిని ‘ప్రేమ, బాధ్యత, కోల్పోవడం కలబోసిన కథ’గా అభివర్ణించారు. దేశంలోని యువతను, ముఖ్యంగా జెన్ జీకి చేరువయ్యేందుకు రాజకీయ నేతలుప్రయత్నిస్తున్న వేళ, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గురువారం ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రవేశించారు.
సోషల్ మీడియా వేదికపై పెట్టిన తన మొదటి పోస్టులో, 79 ఏళ్ల రాజ్యసభ సభ్యురాలైన సోనియా గాంధీ తన పుస్తకం ప్రతిని అందుకుంటున్న వీడియో క్లిప్‌ను పంచుకుంటూ పాఠకులకు పరిచయం చేశారు. ‘అందరికీ నమస్కారం, ఈ క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది; ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం ఫస్ట్ లుక్ ఇది. దీనిని మీతో పంచుకోవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ఆమె పేర్కొన్నారు. ఆమెకు మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీతో ఉన్న అనుబంధం, భారత రాజకీయాల్లో ఆమె సాగించిన ప్రయాణం వరకు అనేక అంశాలను స్పృశించే ఈ పుస్తకం చుట్టూ గతంలో తీవ్ర వివాదం చెలరేగింది.
తొలుత ఈ పుస్తకాన్ని ప్రచురించాల్సిన పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా (పీఆర్‌హెచ్‌ఐ) పుస్తకంలో కొన్ని ఎడిటోరియల్ మార్పులు చేయాలని కోరింది. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన భాగాలను తొలగించాలని సోనియా గాంధీని కోరినట్లు కొందరు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీనిపై పీఆర్‌హెచ్‌ఐ స్పష్టత ఇచ్చింది. ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి తాము ఎంతో ఆసక్తిగా ఉన్నామని, ఇది ఒక గొప్ప ఒప్పందమని పేర్కొంటూనే, ఒక నిర్దిష్ట అంశంపై ప్రతిష్టంభన ఏర్పడటంతో చివరకు వెనక్కి తగ్గాల్సి వచ్చిందని తెలిపింది. అలాగే తమపై ఎలాంటి బాహ్య ఒత్తిళ్లు లేవని ఖండిస్తూ, పుస్తకంలోని విషయాలు రహస్యమైనవని స్పష్టం చేసింది. ఒక ప్రచురణకర్తగా వాస్తవాలను తనిఖీ చేయడం (ఫ్యాక్ట్ చెక్), రచయితలకు తగిన సిఫార్సులు చేయడం తమ బాధ్యత, హక్కు అని పేర్కొంది. పుస్తకాన్ని ప్రచురించడానికి పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సిద్ధంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చదవండి: పాక్‌లోనే దావూద్.. ఐరాస నివేదికపై భారత్ ఆగ్రహం


