ప్రియాంక కుమారుని ఫొటో ఎగ్జిబిషన్‌పై దుమారం | Protest Photos By Priyanka Gandhis Son Taken Down | Sakshi
Sakshi News home page

ప్రియాంక కుమారుని ఫొటో ఎగ్జిబిషన్‌పై దుమారం

Oct 22 2026 8:53 AM | Updated on Oct 22 2026 8:53 AM

Protest Photos By Priyanka Gandhis Son Taken Down

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా కుమారుడు రెహాన్ వాద్రా ఢిల్లీలోని బీకానేర్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ‘నో ఐడియా ఈజ్ ఫైనల్’ ఫొటో ప్రదర్శన రాజకీయ దుమారానికి దారితీసింది. రాజస్థాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్రాంగణంలో ప్రదర్శన ప్రారంభానికి కొద్ది గంటల ముందే, అందులోని మొత్తం 105 ఫొటోలలో యువజన నిరసనలకు సంబంధించిన 74 చిత్రాలను నిర్వాహకులు బలవంతంగా తొలగించారని రెహాన్ ఆరోపించారు.

వాటిని తీసివేయకపోతే ఈవెంట్‌ను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించడంతో గత్యంతరం లేక తొలగించాల్సి వచ్చిందని రెహాన్ పేర్కొన్నారు. తొలగించిన వాటిలో జాతీయ జెండా (త్రివర్ణ పతాకం) ఉన్న ఛాయాచిత్రాలు కూడా ఉండటం వివాదాన్ని మరింత పెంచింది. ప్రదర్శన నిబంధనల ఉల్లంఘన జరిగిందని, రాజకీయపరమైన అంశాలతో కూడిన ఫొటోలను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం, సందర్భం కాదు అని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. కాగా కళాకారుల వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని రెహాన్ అన్నారు. ఈ చిత్రాలు కేవలం సమాజంలో జరిగిన నిరసనల డాక్యుమెంటేషన్ మాత్రమేనని తెలిపారు.
 

ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ, ప్రియాంకా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత గొంతును, భావప్రకటన స్వేచ్ఛను అణచివేసే చర్య ఇది అని, ఫొటోలలో ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు లేకపోయినా ఇలా చేయడం సిగ్గుచేటని ప్రియాంక మండిపడ్డారు. బీజేపీ పాలనలో కనీసం త్రివర్ణ పతాకం చిత్రానికి కూడా చోటు లేకుండా పోయిందని, ఖాళీ గోడలపై మిగిలిన మేకులే సెన్సార్‌షిప్‌నకు నిదర్శనమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా విమర్శించారు. ఈ వివాదంపై బీజేపీ, బీకానేర్ హౌస్ ఉన్నతాధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాగా, మిగిలిన ఫొటోలతో అక్టోబర్ 25 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుండగా, తొలగించిన నిరసన చిత్రాలను వేరే వేదికపై త్వరలోనే ప్రజల ముందుకు తెస్తానని రెహాన్ వాద్రా తెలిపారు.

ఇదీ చదవండి: ‘కంటెంట్‌’పై టీవీ ఛానెళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement